వరి సాగే అధికం!

రాష్ట్రంలో భారీ, మధ్యతరహా, చిన్న నీటి వనరుల కింద ప్రస్తుతం ఆరుతడి పంటల కంటే వరి ఎక్కువగా సాగవుతున్నట్లు ఆయా ప్రాజెక్టుల ఇంజినీర్లు నివేదించినట్లు తెలిసింది. యాసంగిలో ఆయకట్టు సాగుపై ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ గురువారం జలసౌధలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Updated : 28 Jan 2022 05:34 IST

నివేదించిన ప్రాజెక్టుల ఇంజినీర్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ, మధ్యతరహా, చిన్న నీటి వనరుల కింద ప్రస్తుతం ఆరుతడి పంటల కంటే వరి ఎక్కువగా సాగవుతున్నట్లు ఆయా ప్రాజెక్టుల ఇంజినీర్లు నివేదించినట్లు తెలిసింది. యాసంగిలో ఆయకట్టు సాగుపై ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ గురువారం జలసౌధలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని చీఫ్‌ ఇంజినీర్లందరూ(సీఈ) హాజరయ్యారు. ప్రాజెక్టులు, చిన్ననీటి వనరుల్లో పూర్తిస్థాయిలో నీరున్నా, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని గత నెలలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ సాగైన  వీస్తీర్ణం వివరాలను సీˆఈల నుంచి సేకరించినట్లు తెలిసింది. ప్రభుత్వ సూచనతో కొంతమేర వరి సాగు తగ్గినా.. ఆయకట్టులో 60 శాతం వరకు ఈ పంటే సాగు చేసినట్లు ఎక్కువ మంది సీఈలు నివేదించారని సమాచారం. శ్రీరామసాగర్‌, నాగార్జునసాగర్‌.. ఇలా అత్యధిక ఆయకట్టు ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉండటంతో వరి సాగు విస్తీర్ణమే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ తదితర ఉమ్మడి జిల్లాల్లో వేరుసెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటల సాగు పెరిగినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. కూరగాయల సాగు కూడా ఉన్నట్లు తెలిపారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుందని గతంలో నిర్ణయించగా.. తాజాగా ఈ విస్తీర్ణం 36 లక్షల నుంచి 40 లక్షల ఎకరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా వాస్తవ లెక్కలను ఒకటి రెండు రోజుల్లో సీఈలు పంపనున్నారు. సమావేశంలో ఈఎన్‌సీ(ఓ అండ్‌ ఎం) నాగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని