Telangana News: సీఎం స్లిప్పిచ్చారు.. స్పీకర్‌ పంపించారు..

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు అడుగులో అడుగేసిన తనను కుట్రతో తెరాస నుంచి బయటికి వెళ్లగొట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అసెంబ్లీలో తనను చూడకూడదనే దుర్మార్గపు ఆలోచనతోనే సభ మొదలైన కొద్ది నిమిషాలకే

Updated : 18 Mar 2022 05:13 IST

‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’లో ఈటల రాజేందర్‌ ఆరోపణ
తెలంగాణకూ బుల్డోజర్లు రాబోతున్నాయి: రాజాసింగ్‌

రాంనగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు అడుగులో అడుగేసిన తనను కుట్రతో తెరాస నుంచి బయటికి వెళ్లగొట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అసెంబ్లీలో తనను చూడకూడదనే దుర్మార్గపు ఆలోచనతోనే సభ మొదలైన కొద్ది నిమిషాలకే భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్లిప్పుతోనే సభాపతి తమను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు, నేతలు గురువారం ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌ ప్రజలు.. కేసీఆర్‌ అహంకారాన్ని ఓడించిన సమయంలో ఆయన నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవి సహా శాసనసభ్యత్వానికీ రాజీనామా చేస్తారని అనుకున్నా. కేసీఆర్‌ మాత్రం నియంతృత్వ ధోరణితో రాజ్యాంగాన్నే రద్దు చేయాలంటూ మాట్లాడారు. మా సస్పెన్షన్‌పై ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించినా పట్టించుకోలేదు. ఇక తమకు మిగిలింది ప్రజా క్షేత్రమే. దీక్షలు, ధర్నాలకు అనుమతి ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ అంతా దొంగ లెక్కలు, కాకి మాటలే. బడ్జెట్‌పై చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. కేసీఆర్‌ను ఇక ఎవరూ కాపాడలేరు. రాష్ట్ర ప్రజలు భాజపాను గెలిపించడం ఖాయం. ప్రజల మీద విశ్వాసం కోల్పోయి పీకేను పెట్టుకున్నారు. పీకేతో ఏం కాదు.. బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ కాలు విరగకముందే పట్టీవేసిండు. ఏం కాకపోయినా కేసీఆర్‌ను ఆసుపత్రికి తీసుకుపోయిండు’’ అని విమర్శించారు.

* ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌లు వ్యక్తులు కాదు శక్తులని.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి అవినీతిపరులను బుల్డోజర్‌తో తొక్కించారన్నారు. బండి సంజయ్‌ దిల్లీ వెళ్లారని.. తెలంగాణకు సైతం బుల్డోజర్లు రాబోతున్నాయని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి వాటిని పంపిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, అక్రమాలను తొక్కించే రోజులు ముందున్నాయని చెప్పారు.

* కాంగ్రెస్‌, తెరాస ఒక్కటేనని ఎమ్మెల్యే రఘునందన్‌ ఆరోపించారు. అసెంబ్లీ తొలి రోజు నుంచి చివరివరకు కేసీఆర్‌, భట్టి పరస్పర పొగడ్తలతోనే సరిపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ భాజపాతోనే జరుగుతుందన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ రాజ్యాంగానికి జరిగిన అవమానమన్నారు. హైకోర్టు చెప్పినా భాజపా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని  నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

* ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ... అవినీతి, నియంతృత్వ పాలనలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సంతకం చేసిన పోచారం ఇప్పుడు స్పీకర్‌గా కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అక్రమాలు, కబ్జాలు చేస్తున్న మంత్రిని వెనుకేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో భాజపా నేతలు పి.మురళీధర్‌రావు, జితేందర్‌రెడ్డి, వివేక్‌, రవీంద్రనాయక్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బొడిగె శోభ, ధర్మారెడ్డి, లక్ష్మీనారాయణ, బాబూమోహన్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని