మళ్లీ చుట్టపు చూపేనా!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మళ్లీ చుట్టం చూపుగానే వస్తున్నారా? ఆయన రాకవల్ల ఏమైనా ప్రయోజనం  ఉందా అనే దానిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తెరాస

Updated : 26 May 2022 06:27 IST

మోదీ పర్యటనతో ఒరిగేదేమైనా ఉందా?

ప్రజలకు సమాధానం చెప్పాలి: తెరాస డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మళ్లీ చుట్టం చూపుగానే వస్తున్నారా? ఆయన రాకవల్ల ఏమైనా ప్రయోజనం  ఉందా అనే దానిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తెరాస డిమాండ్‌ చేసింది. తెలంగాణకు అతి తక్కువసార్లు వచ్చిన మోదీ కేవలం ఉపన్యాసాలకే పరిమితమై వెళ్తున్నారని, రాష్ట్రానికి పైసా ఇవ్వలేదని తెరాస ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేశ్‌, ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజు విమర్శించారు. వారు బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అభివృద్ధిలో తెలంగాణను కేంద్రం ప్రశంసిస్తున్నా.. రాష్ట్రానికి మేలు చేయాలనే ధ్యాస ప్రధానికి లేదు. సీఎం కేసీఆర్‌ ఏ గ్రామానికైనా, పట్టణానికైనా వెళితే పండగే. ఎందుకంటే అక్కడి ప్రజలు అడగకముందే పెద్దఎత్తున వరాలిస్తారు. కోరిన నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తారు. కానీ ప్రధాని మోదీ పర్యటన అంటే రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి లేదు. ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మోదీ విభజన హామీలను తుంగలో తొక్కారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతిష్ఠాత్మక సంస్థలను గుజరాత్‌కు తరలిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదు. కొత్త ప్రాజెక్టులు లేవు. నిధులడిగితే పట్టించుకోరు. చివరికి రైతుల ధాన్యం కొనడానికి చేతులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగే ఏ ఒక్క ప్రశ్నకు కేంద్రం జవాబివ్వడంలేదు. రాష్ట్ర భాజపా ఉండీ దండగే. ఇక్కడ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నా ఫలితం లేదు. బండి సంజయ్‌ ఓ విచిత్రమైన వ్యక్తి. ఐఎస్‌బీకి వస్తున్న మోదీ ఒక్క ఉన్నత విద్యాసంస్థనైనా తెలంగాణకు ఇస్తారా? కేంద్రాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న రాష్ట్రానికి పన్నుల రూపంలో రావాల్సిన నిధులు ఇస్తామని చెప్పగలరా? కాజీపేట రైల్వేకోచ్‌ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం. వరంగల్‌ కాకతీయ మెగా జౌళిపార్కుల గురించి ప్రధాని మాట్లాడగలరా?’’ అని వారు ప్రశ్నించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని