సినిమాటోగ్రఫీ నిబంధనలపై ప్రభుత్వానికి నోటీసులు

సినిమాటోగ్రఫీ నిబంధనలపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 2006 నాటి సినిమాటోగ్రఫీ నిబంధనలు, 2012లో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన

Published : 22 Jan 2022 05:00 IST

కౌంటరు దాఖలుకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సినిమాటోగ్రఫీ నిబంధనలపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 2006 నాటి సినిమాటోగ్రఫీ నిబంధనలు, 2012లో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమోలపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. సినిమాటోగ్రఫీ నిబంధనల ఆధారంగా ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయాలపై షరతులతో సిద్దిపేట పోలీసు కమిషనర్‌ లైసెన్స్‌ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బై మూవీ టిక్కెట్స్‌తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ చట్టవిరుద్ధంగా గత ఏడాది అక్టోబరు 10న ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయానికి లైసెన్స్‌ జారీ చేశారన్నారు. ఈ అమ్మకాలకు షరతులు విధించే పరిధి కమిషనర్‌కు లేదన్నారు. 50 శాతానికి మించి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించరాదని, రూ.6 కంటే ఎక్కువగా సర్వీసు ఛార్జి వసూలు చేయరాదని, సినిమా ప్రారంభానికి రెండు గంటల ముందు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించరాదంటూ షరతులు విధించారన్నారు. రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన ఈ షరతులు విధించడానికి వీలుగా ఉన్న సినిమాటోగ్రఫీ నిబంధనలను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం హోంశాఖ కార్యదర్శికి, సిద్దిపేట పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని