Viveka Murder Case: సుపారీ సొమ్ము ఎక్కడిది?

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ‘వివేకాను

Updated : 07 Mar 2022 05:03 IST

నిందితులకు అడ్వాన్సుగా ఇచ్చిన సొత్తు మూలాలెక్కడ?
వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీ‘ఐ’

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ‘వివేకాను అంతమొందిస్తే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీ వాటాగా ఇస్తాను’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత ఎంత మొత్తం చేతులు మారిందనే అంశంపై సీబీఐ దృష్టి సారించింది. నిందితులకు అడ్వాన్సుగా చెల్లించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉన్న ఆర్థికమూలాలు ఏంటనే కోణంలో దర్యాప్తు చేపట్టి కొన్ని ఆధారాలు సేకరించింది.

ఎక్కడ నుంచి వచ్చిందో తేలితే కుట్రదారుల్ని బయటపెట్టొచ్చు

దస్తగిరి వాంగ్మూలం ప్రకారం... వివేకా హత్య కుట్ర 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే సిద్ధమైంది. తర్వాత నాలుగు రోజులకు సునీల్‌ యాదవ్‌ కోటి రూపాయలు తీసుకొచ్చి దస్తగిరికి సుపారీ అడ్వాన్సుగా ఇచ్చారు. ఆ డబ్బులు సునీల్‌ యాదవ్‌కు ఎవరిచ్చారు? వాళ్లకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై సీబీఐ ఇప్పటికే ఆరాతీసింది. సుపారీ సొమ్ము మూలాలు తెలిస్తే కుట్రదారులెవరో తేలిపోతుందని సీబీఐ భావిస్తోంది.

ఎవరికి.. ఎలాంటి సంబంధం?

వివేకానందరెడ్డిని చంపేయ్‌. మేమూ నీతో వస్తాం. దీని వెనుక కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు. దస్తగిరితో ఎర్ర గంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు, సుపారీ సొత్తుకు ఎలాంటి సంబంధం ఉంది? మిగతా నిందితులైన ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లకు అడ్వాన్సు అందిందా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని