Updated : 10 Jan 2021 11:28 IST

డొనాల్డ్‌ ట్రంప్‌ నెత్తిన కత్తి

అవిశ్వాసానికి సన్నాహాలు

వాషింగ్టన్‌: అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తక్షణమే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేదంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని సాక్షాత్తు స్పీకర్‌ హెచ్చరించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా మరింతగా రెచ్చగొట్టే ప్రమాదం ఉండడంతో ఆయన ఖాతాను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ట్విట్టర్‌ ప్రకటించింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన ఖాతాలను నిలిపివేస్తున్నట్టు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇదివరకే తెలిపాయి. ఉభయ సభలకు నిలయమైన క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేసి, అయిదుగురి మరణానికి కారణమయిన నేపథ్యంలో ఈ రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) స్పీకర్‌ నాన్సీ పెలోసీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘‘అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలని సభ్యులంతా కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన పదవి నుంచి తప్పుకోకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అంతా సిద్ధం చేయాలని రూల్స్‌ కమిటీకి సూచించాను. 25వ రాజ్యాంగ సవరణ కింద అధ్యక్షుడిని తొలగించాలంటూ వచ్చిన నోటీసులపై తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పాను’’ అని పేర్కొన్నారు.
ట్విట్టర్‌ అనూహ్య నిర్ణయం
సామాజిక మాధ్యమాల ద్వారా ట్రంప్‌ హింసను రెచ్చగొడుతుండడంతో ట్విట్టర్‌ మునుపెన్నడూ లేని నిర్ణయాన్ని తీసుకొంది. ఆయన ఖాతాను శాశ్వతంగా మూసివేసింది.
కారణం ఈ రెండు ట్వీట్లే
ట్విట్టర్‌ ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవడానికి రెచ్చగొట్టే విధంగా ట్రంప్‌ చేసిన రెండు ట్వీట్లే కారణం. ‘‘నాకూ, ‘అమెరికాయే ప్రథమం’, ‘మళ్లీ అమెరికాను ఘనంగా నిలపండి’ అన్న విధానాలకు ఓటు వేసిన 7.5 కోట్ల అమెరికా దేశభక్తులరా! భవిష్యత్తులో మీ కోసం బలమైన గొంతుక వినిపిస్తుంది. మీరు ఏ రూపంలోనూ అగౌరవానికి, అన్యాయానికి గురికారు’’ అంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. వెంటనే మరో ట్వీట్‌ చేస్తూ ‘‘నన్ను అడిగిన వారందరికీ ఇదే సమాధానం. 20న జరిగే ప్రభుత్వ ఆవిష్కరణకు వెళ్లబోవడం లేదు’’ అని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో వీటి అర్థాన్ని విశ్లేషించాల్సి ఉందని పేర్కొన్న ట్విట్టర్‌ ఇవి హింసను ప్రేరేపించేవని అభిప్రాయపడింది.
దాడికి ముందు ‘మాగా’ ...చీర్స్‌
క్యాపిటల్‌ భవనంపై దాడి జరుగుతుందన్న విషయం డొనాల్డ్‌ ట్రంప్‌నకు ముందుగానే తెలుసా? దీన్ని ఆయన కుటుంబ సభ్యులు సంబరంగా జరుపుకొన్నారా? ట్రంప్‌ కుమారుడు డాన్‌ జూనియర్‌ తన సెల్‌ఫోన్లో తీసిన వీడియో ఒకటి ఇందుకు బలం చేకూర్చుతోంది. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతోంది. అభిమానులంతా క్యాపిటల్‌ భవనంవైపు వెళ్లడానికి ముందు ట్రంప్‌తో పాటు కుమార్తె ఇవాంక, కుమారుడు డాన్‌ జూనియర్‌ మరికొందరు పార్టీ చేసుకున్నారు. ‘మాగా’ (ఎం.ఎ.జి.ఎ- మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌- మళ్లీ అమెరికాను ఘనంగా నిలపండి) అంటూ చీర్స్‌ చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ట్రంప్‌ మరింత తీవ్రంగా పోరాడండి, క్యాపిటల్‌ వైపు వెళ్లండి అంటూ పిలుపునిచ్చారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని