TS News: రాష్ట్రంలో కొవిడ్‌ ఆంక్షలు 10 వరకు పొడిగింపు..

ఒమిక్రాన్‌, కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల పదో తేదీ వరకు అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను

Updated : 02 Jan 2022 07:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌, కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల పదో తేదీ వరకు అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు(జీవో.01) జారీచేసింది. డిసెంబరు 25 నుంచి జనవరి 2వతేదీ వరకు ఆంక్షలు విధిస్తూ గతంలో ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించింది.

ఆంక్షలు కఠినంగా అమలుచేయాలి: సీఎస్‌

ఒమిక్రాన్‌, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తెలంగాణలో విధించిన ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు సహా జన సమూహ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలిచ్చారు. కరోనాపై శనివారం ఆయన బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రజా రవాణాలో, దుకాణాలు, మాల్స్‌, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఆయాచోట్ల వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి. కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రంచేయాలి. ఐఆర్‌ థర్మామీటర్‌, థర్మల్‌ స్కానర్‌, శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలి. పాఠశాలల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించేలా విద్యా సంస్థల యాజమాన్యాలు చొరవ చూపాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించాలని’’ మార్గదర్శనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని