Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ఆరోజు వివేకా ఇంటికి వచ్చారు

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు (2019 మార్చి 15) ఉదయాన్నే తొలుత కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వివేకా ఇంటికి వచ్చారని పులివెందుల వాసి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు...

Published : 28 Feb 2022 06:57 IST

ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడారు
ఇంతలోనే వైద్యులు చేరుకున్నారు.. వివేకా మృతిచెందారని చెప్పారు
సీబీఐకి ఎంపీటీసీ మాజీ సభ్యురాలు శశికళ వాంగ్మూలం

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు (2019 మార్చి 15) ఉదయాన్నే తొలుత కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వివేకా ఇంటికి వచ్చారని పులివెందుల వాసి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కె.శశికళ సీబీఐ అధికారులతో చెప్పారు. వివేకా ఇంట్లోకి వెళ్లిన అవినాష్‌రెడ్డి 3, 4 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లాన్‌లో నిలుచొని ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారని తెలిపారు. ఇంతలోనే డాక్టర్‌ మధు, కొందరు నర్సులు  వచ్చారన్నారు. కాసేపటికి వివేకా మృతి చెందారంటూ వారు వెల్లడించారని శశికళ చెప్పారు. తర్వాత వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో తానూ వివేకా ఇంటి లోపలికి వెళ్లానని.. బెడ్‌రూమ్‌లో రక్తం, బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని చూసి ఇది హత్యేనని తనకు స్పష్టంగా అనిపించిందని వివరించారు. వివేకా ఇంటికి ఆమె ఎందుకు వెళ్లారు, అక్కడేం జరిగిందనే అంశాలపై సీబీఐ ఆమెను విచారించి, 2020 సెప్టెంబరు 20న వాంగ్మూలం తీసుకుంది.


తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఏఎస్పీ ఒత్తిడి తెచ్చారు

మీడియాతో కల్లూరు గంగాధర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి నేను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు’ అని ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న కల్లూరు గంగాధర్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సునీతను ఈ కేసు నుంచి బయటపడేయాలని జగదీశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రలోభపెట్టాడు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిపై తప్పుడు సాక్ష్యం చెబితే కేసు బలంగా ఉంటుందన్నాడు. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ వద్దకు వెళ్లగా.. ఆయన కూడా తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. హత్య చేసినట్లు ఒప్పుకొంటే రూ.10 కోట్లు ఇస్తామని అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేసినట్లు చెప్పాలని ఏఎస్పీ ఒత్తిడి తెచ్చారు. మేం చెప్పినట్లు చేస్తే జగదీశ్వర్‌రెడ్డి నీకు డబ్బులు ఇప్పిస్తారని ప్రలోభపెట్టారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని