ఇంటర్‌ సీట్లు నిండకపోతే జీతాలు నిలిపివేస్తాం!

‘ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు 80 శాతంలోపే ఉన్నందున మీ జులై వేతనం నిలిపివేస్తున్నాం’ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు(టీఎంఆర్‌జేసీ) ప్రిన్సిపాళ్లకు మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలివి.

Published : 02 Aug 2023 03:15 IST

టీఎంఆర్‌జేసీ ప్రిన్సిపాళ్లకు మైనారిటీ సొసైటీ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు 80 శాతంలోపే ఉన్నందున మీ జులై వేతనం నిలిపివేస్తున్నాం’ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు(టీఎంఆర్‌జేసీ) ప్రిన్సిపాళ్లకు మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలివి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎంఆర్‌జేసీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల్లో కలకలం స్పష్టించింది. జులై 19 నాటికి మొత్తం 81 మైనారిటీ గురుకులాల్లో ఇంటర్‌ సీట్లలో 80 శాతానికంటే తక్కువగానే భర్తీ అయ్యాయి. దీనిపై ప్రిన్సిపాళ్లకు షోకాజ్‌ నోటీసులతోపాటు వాట్సప్‌ మెసేజీలు కూడా పంపారు. వేతనాలు నిలిపివేసే నిర్ణయాన్ని తెలంగాణ యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) ఖండించింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, నాయకులు మాణిక్‌రెడ్డి మంగళవారం మైనారిటీ సొసైటీ కార్యదర్శి షఫీయుల్లాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రవేశాలకు ఆయా ప్రిన్సిపాళ్లను బాధ్యులను చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఎవరి జీతం నిలుపుదల చేయడం లేదని, కేవలం ప్రవేశాలు, హాజరు పెంచడానికి హెచ్చరించామని ఆయన స్పష్టం చేసినట్లు నేతలు తెలిపారు. దీంతోపాటు ప్రిన్సిపాళ్లకు మార్చి నుంచి ఇవ్వాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడానికి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఖాళీల్లో సీనియర్‌ ప్రిన్సిపాళ్లను నియమించడానికి కూడా అంగీకరించారని వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని