Hyderabad: 40 ఏళ్ల వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు

ఓ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందిన అరుదైన ఘటన ఇది. వైద్యులు విజయవంతంగా వాటిని తొలగించారు. కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ యురాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వై.ఎం.ప్రశాంత్‌ వివరాలను మంగళవారం విడుదల చేశారు.

Updated : 23 Aug 2023 09:14 IST

పిల్లలు పుట్టలేదని ఆసుపత్రికి వెళ్లగా గుర్తించిన వైద్యులు
శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందిన అరుదైన ఘటన ఇది. వైద్యులు విజయవంతంగా వాటిని తొలగించారు. కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ యురాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వై.ఎం.ప్రశాంత్‌ వివరాలను మంగళవారం విడుదల చేశారు. ‘మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఇటీవల పొత్తి కడుపు కింద తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన స్థానిక ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. మేము అతనికి అల్ట్రాసౌండ్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించాం. అతనిలో పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉండిపోయినట్టు, స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్‌ ట్యూబ్‌లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించాం. ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్‌ ట్యూబులు, గర్భసంచి, స్త్రీ జననాంగం తొలగించాం’ అని డాక్టర్‌ ప్రశాంత్‌ వెల్లడించారు.

హార్మోన్ల ప్రభావం వల్లనే

‘సాధారణంగా స్త్రీ, పురుషులకు వేర్వేరు జననాంగాలు, పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. కడుపులో పిండం ఏర్పడేటప్పుడు రెండు రకాల అవయవాలు ఉన్నా, ఆ తర్వాత హార్మోన్ల ప్రభావంతో ఏదో ఒకటే అభివృద్ధి చెందుతుంది. అరుదైన కేసుల్లో జన్యు ఉత్పరివర్తనం కారణంగా అవసరమైన హార్మోన్లు తగినంత స్థాయిలో విడుదల కాకపోవడంతో స్త్రీ, పురుష పునరుత్పత్తి అవయవాలు రెండూ అభివృద్ధి చెందుతాయి. దీన్నే వైద్య పరిభాషలో పెర్సిస్టెంట్‌ ముల్లేరియన్‌ డక్ట్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి వారిలో వృషణాలు ఉదర భాగంలో ఉండిపోవడం వల్ల వీర్య కణాలు ఉత్పత్తి కావు. పిల్లలు పుట్టరు’ అని డాక్టర్‌ ప్రశాంత్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ తరహా కేసులు 300 వరకు నమోదయ్యాయని, మన దేశంలో 20 వరకు గుర్తించారని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని