ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు.

Published : 23 Apr 2024 05:12 IST

అధికారులకు డీజీపీ ఆదేశం
సరిహద్దు బేస్‌ క్యాంపుల సందర్శన

చర్ల, బూర్గంపాడు, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత చెన్నాపురం, పూసగుప్ప, ఉంజుపల్లి బేస్‌ క్యాంపులను ఆయన సోమవారం సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో డీజీపీతో పాటు అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్‌ శివధర్‌రెడ్డి, గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ విజయకుమార్‌, సీఆర్పీఎఫ్‌ సౌత్‌జోన్‌ అదనపు డీజీపీ రవిదీప్‌సింగ్‌ సాహి, సీఆర్పీఎఫ్‌ సౌత్‌ సెక్టార్‌ హైదరాబాద్‌ జోన్‌ ఐజీపీ చారుసిన్హా, ఎస్‌ఐబీ ఐజీపీ సుమతి ఈ పర్యటనలో పాల్గొన్నారు. సరిహద్దు క్యాంపుల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి డీజీపీ పలు సూచనలు చేశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సారపాక ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న డీజీపీ ఆయా జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్ఠ చర్యలు చేపట్టాలని, అక్రమ నగదు, మద్యం రవాణాను అడ్డుకోవాలని, పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశం అనంతరం డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు, ములుగు ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌, భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ ఖరే, ఎస్‌ఐబీ ఎస్పీ రాజేశ్‌, ఓఎస్డీ సాయి మనోహర్‌, భద్రాచలం, ఏటూరునాగారం ఏఎస్పీలు పరితోష్‌ పంకజ్‌, మహేష్‌ జితే, సీఆర్పీఎఫ్‌ అధికారులు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని