సరిహద్దుల్లోకి ఏనుగుల మంద

మహారాష్ట్ర నుంచి ఇరవై రోజుల క్రితం రాష్ట్రంలోకి వచ్చిన ఏనుగు ఇద్దరు రైతుల ప్రాణాల్ని బలిగొంది. అది సంచరించిన గ్రామాల్లో.. ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.

Published : 23 Apr 2024 03:57 IST

రాష్ట్రంలోకి ప్రవేశిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీశాఖ వర్క్‌షాప్‌
అవి సంచరించే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం
వెనక్కి పంపడంపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్ర నుంచి ఇరవై రోజుల క్రితం రాష్ట్రంలోకి వచ్చిన ఏనుగు ఇద్దరు రైతుల ప్రాణాల్ని బలిగొంది. అది సంచరించిన గ్రామాల్లో.. ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. అధికారులు అతికష్టమ్మీద ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్రకు పంపించారు. అలా వెళ్లిన ఏనుగు ఇప్పుడు ఓ పెద్ద గుంపును తీసుకొస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో ఈ మంద సంచరిస్తున్నట్లు రాష్ట్ర అటవీశాఖకు మహారాష్ట్ర అధికారుల నుంచి సమాచారం వచ్చింది. ఈ మంద రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు అధికంగా ఉండడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఆ మంద వస్తే ఏర్పడే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై హైదరాబాద్‌ దూలపల్లిలోని అటవీ అకాడమీలో సోమవారం అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ అధికారులతో వర్క్‌షాప్‌ నిర్వహించారు. సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

రాత్రివేళ అధిక సంచారం

ఏనుగులు రాత్రి వేళలోనే ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్న దృష్ట్యా.. అవి సంచరించే గ్రామాల్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ప్రజలు పంటపొలాల్లోకి వెళ్లకుండా ప్రచారం చేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రజలు, రైతులకు ఎలాంటి హాని చేయకముందే వాటిని తిరిగి మహారాష్ట్రకు ఏ విధంగా పంపించాలన్న విషయంపై పలువురు అధికారులు సూచనలు చేశారు. ఏనుగుల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధునాతన సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ స్పష్టం చేశారు. ఒడిశాలో పెద్దసంఖ్యలో ఉన్న ఏనుగుల్లో కొన్ని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి అక్కడ సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎదురైన అనుభవాలను ఛత్తీస్‌గఢ్‌ రిటైర్డ్‌ పీసీసీఎఫ్‌ నర్సింహారావు వర్క్‌షాప్‌లో వివరించారు. ఏనుగులను ఎలా నియంత్రించాలి? ఎలాంటి రక్షణ వాహనాలు ఉపయోగించాలి.. వంటి వివరాల్ని తెలిపారు. శబ్దాలతో భయపెట్టే ప్రత్యేక బృందంతోనే సమస్య పరిష్కారం కాదని, ఆ చర్యలు ఏనుగుల్ని పక్కకు పంపించడానికే ఉపయోగకరమని.. అవి వెనక్కి వస్తే ఏం చేయలేమని స్పష్టంచేశారు. ఇతర విధానాలపైనా దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో పీసీసీఎఫ్‌ (వైల్డ్‌ లైఫ్‌, ప్రొటెక్షన్‌-విజిలెన్స్‌, కంపా)లు ఎంసీ ఫర్గయిన్‌, ఈలుసింగ్‌ మేరు, సువర్ణ, అదనపు పీసీసీఎఫ్‌ సునీతా భగవత్‌, జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని