ఆదాయ అంతరాలు తగ్గేదెలా?

దేశార్థికం అంతకంతకు విస్తరిస్తోంది. ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతోంది. కానీ ప్రజల ఆదాయాలు, సంపదల మధ్య వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.  ఈ అంతరాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించాలి.

Published : 08 May 2024 00:38 IST

దేశార్థికం అంతకంతకు విస్తరిస్తోంది. ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతోంది. కానీ ప్రజల ఆదాయాలు, సంపదల మధ్య వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.  ఈ అంతరాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించాలి.

భారత్‌లో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ అంశంపై అధ్యయనం చేపట్టిన వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌- ‘భారతీయుల ఆదాయ సంపదల్లో వ్యత్యాసాలు 1922-2023’ పేరిట నివేదికను వెలువరించింది. ఈ అసమానతలు ఆంగ్లేయుల హయాములో కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంటున్నాయని అది విశ్లేషించింది. ప్రస్తుతం జనాభాలో పైవరసలో ఉన్న ఒక్క శాతానికి దేశ ఆదాయంలో 22.6శాతం, సంపదలో 40.1శాతం సమకూరుతోంది. వారి సగటు తలసరి వార్షికాదాయం రూ.53లక్షలు. అట్టడుగున ఉన్న సగం జనాభా కేవలం 15శాతం ఆదాయం, 6.4శాతం సంపదతో సరిపెట్టుకుంటోంది. వీరి సగటు తలసరి వార్షికాదాయం రూ.73 వేలుగా నివేదిక లెక్కగట్టింది.

ఆర్థిక సంస్కరణలతో...

దేశంలో వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 1991తో పోలిస్తే అట్టడుగునున్న 50శాతం ప్రజల ఆదాయాలు 2022 నాటికి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు సైతం పెరగడానికి 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణం. 1990 వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. 1991నాటి ఆర్థిక సంస్కరణలతో అది 6-8 శాతం వరకు పెరిగింది. అయినప్పటికీ, ఆదాయ సంపదల్లో అధిక భాగం పైనున్న వారికే దక్కుతుండటంవల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. భారత్‌ సహా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఆర్థిక అసమానతలు పెచ్చుమీరడం శ్రేయస్కరం కాదు. అవి సామాజిక అశాంతికి దారితీస్తాయి. ఈ నేపథ్యంలో, ఆర్థిక అసమానతలను తగ్గించడమెలాగన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ధనవంతుల సంపదపై వారసత్వ పన్ను విధించడమే పరిష్కారమని కొందరు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. మరి నిజంగానే ఈ పన్నువల్ల ఆర్థిక అసమానతలు తగ్గుతాయా, దీనికి ప్రత్యామ్నాయాలేమిటి అనేది కూడా పరిశీలించాల్సిన అవసరముంది.

మన దేశంలో ‘ఎస్టేట్‌ సుంకం’ పేరిట 1953-85 మధ్యకాలంలో వారసత్వ పన్ను ఉండేది. ఒక మనిషి చనిపోయిన తరవాత వ్యవసాయ భూములతో పాటు ఆ వ్యక్తి తాలూకు స్థిర, చరాస్తులు వారసులకు బదిలీ అయ్యే సమయంలో ఈ ఎస్టేట్‌ డ్యూటీ వసూలు చేసేవారు. దాంతోపాటు 1957 నుంచి 2015 వరకు సంపదపై పన్ను(వెల్త్‌ ట్యాక్స్‌) విధించేవారు. ఎస్టేట్‌ సుంకాన్ని మనిషి చనిపోయినప్పుడు విధిస్తే, వెల్త్‌ ట్యాక్స్‌ను మనిషి జీవించినంత కాలం ఏడాదికి ఒకసారి వసూలు చేసేవారు. వాటి అమలు కష్టతరం కావడం, వసూలయ్యే మొత్తం స్వల్పంగా ఉండటంతో ఆ రెండింటినీ రద్దు చేశారు. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ లాంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, తైవాన్‌, తుర్కియే, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ వారసత్వ పన్ను విధిస్తున్నారు. పన్ను రేట్లు 40-50శాతం ఉంటున్నప్పటికీ... అనేక మినహాయింపులు, పన్ను విధించదగ్గ కనీస సంపద పరిమితి ఎక్కువగా ఉండటం వంటి కారణాలవల్ల పన్ను రాబడి స్వల్పంగానే ఉంటోంది. కాబట్టి, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి వారసత్వ పన్ను పెద్దగా ఉపయోగపడదని చెప్పవచ్చు. ఇందులో నాలుగు కీలక అంశాలున్నాయి. 1)వారసత్వ పన్ను విధించడంవల్ల కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే- సంపాదించడం, కూడబెట్టడం, దాన్ని వారసులకు అందించడం మన దేశ సంస్కృతిలో భాగం. 2)పన్ను విధించిన తరవాత మిగిలిన ఆదాయమే సంపదగా మారుతుంది. దానిపై మళ్ళీ పన్ను వసూలు చేయడం అసంబద్ధ చర్య. 3)సంపదపై పన్ను విధించడమంటే పెట్టుబడులపై ట్యాక్స్‌ వేయడమే. ఆ చర్య ఆర్థిక రంగ పురోగతిని అడ్డుకుంటుంది. 4)ఈ పన్నును తగ్గించుకోవడానికి ధనికులు అనేక ఇతర మార్గాలను అవలంబిస్తారు. చనిపోవడానికి చాలా ముందుగానే సంపదనంతా వారసులకు బహుమతిగా ఇస్తారు. లేదంటే- ఒక ట్రస్టుకు బదలాయించి వారసులను హక్కుదారులుగా ఉంచుతారు. సంపదను విదేశాలకు తరలించే ప్రయత్నాలూ జరుగుతాయి. పర్యవసానంగా దేశార్థికానికి నష్టం వాటిల్లుతుంది.

అనేక దేశాలు ప్రభుత్వ నియంత్రణతో సంబంధం లేకుండా, కేవలం ‘డిమాండ్‌-సప్లై’ సూత్రాలపై నడిచే మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను అమలు చేస్తున్నాయి. ఇండియా కూడా అటువంటి విధానాన్నే అనుసరిస్తున్నది. ఈ తరహా ఆర్థిక వ్యవస్థల్లో ఎంతోకొంత అసమానతలు ఉండటం సహజం. అయితే ప్రభుత్వాలు ఈ వ్యత్యాసాలను నియంత్రణలో ఉంచడానికి పటిష్ఠ విధానాలను రూపొందించుకోవాలి.

బాధ్యత ప్రభుత్వాలదే...

మన రాజ్యాంగం- సంక్షేమ రాజ్యం ఏర్పాటు దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలని నిర్దేశిస్తోంది. పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఆర్థిక న్యాయం చేకూర్చాలని చెబుతోంది. 38, 39వ అధికరణలు- వ్యక్తులు, సమూహాల మధ్య ఆదాయాల్లో అంతరాలు తగ్గించే దిశగా, సంపద ఏ కొందరి దగ్గరో పోగుపడకుండా చూసేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆదేశిస్తున్నాయి. దేశ ఆర్థిక ప్రగతి కోసం మార్కెట్‌ వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ- ప్రజల ఆదాయాలు, సంపదల్లో విపరీతమైన అసమానతలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. ఆ కర్తవ్యాన్ని అవి మరచిపోవని ఆశిద్దాం!


సమాన అవకాశాలు

మాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపడం కోసం ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. ప్రజలందరికీ తమ కలలను నెరవేర్చుకోవడం కోసం సమాన అవకాశాలు కల్పించాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం జీడీపీలో విద్యకు కనీసం ఆరు శాతం, వైద్యానికి మూడు శాతం నిధులను ప్రత్యేకించాలి. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా యువతకు ఉన్నత విద్యతో పాటు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను దరిచేర్చాలి. అప్పుడే ఆర్థికంగా కింది వరసలో ఉన్నవారు పైకి రాగలుగుతారు. మరోవైపు, పురోగామి పన్ను విధానాలను అవలంబించాలి. దేశంలో పరోక్ష పన్నుల వాటా పెరుగుతూ ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గుతోంది. 2010-11లో మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్నుల వాటా 42శాతం, పరోక్ష పన్నుల వాటా 48శాతం. 2021-22 నాటికి అవి వరసగా 34.2శాతం, 65.8శాతంగా మారాయి. పరోక్ష పన్నుల భారం అందరిపై సమానంగా పడుతుంది. ప్రత్యక్ష పన్నుల భారం ధనవంతులపైనే ఎక్కువగా ఉంటుంది. పరోక్ష పన్నుల వాటా పెరగడమంటే... అసమానతలను పెంచే దిశగా పన్నుల వ్యవస్థ వెళ్తోందని అర్థం. దీన్ని నివారించి ప్రత్యక్ష పన్నుల వాటాను పెంచే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.