నిండా మునిగాక...

‘ఒకపక్క ధరలు మండిపోతూ, జనం జేబులకు మంటపెడుతుంటే... ఇంకోపక్క తినేందుకు తిండీ, చేసేందుకు పనీ కరవై అల్లాడుతుంటే... నిత్యావసరాలపైనా పన్నులు బాదడం సమంజసమేనా?’‘మరీ అంతగా పన్నులపై పడి ఏడవక్కర్లేదు... సామాన్య ప్రజలెవరూ పెరిగే ధరలను భారంగా భావించడం లేదు....

Published : 23 Aug 2022 00:34 IST

‘ఒకపక్క ధరలు మండిపోతూ, జనం జేబులకు మంటపెడుతుంటే... ఇంకోపక్క తినేందుకు తిండీ, చేసేందుకు పనీ కరవై అల్లాడుతుంటే... నిత్యావసరాలపైనా పన్నులు బాదడం సమంజసమేనా?’
‘మరీ అంతగా పన్నులపై పడి ఏడవక్కర్లేదు... సామాన్య ప్రజలెవరూ పెరిగే ధరలను భారంగా భావించడం లేదు’
‘అంతా సంతోషంగానే ఉన్నారంటావా?’  
‘పెద్దగా నొప్పి ఉన్నట్లుగా కనిపించడం లేదు’
‘నొప్పి ఉన్నట్లు తెలిసేదెలా? పీకల్లోతు మునిగాక, లోపల గజగజా వణుకుతున్నా పైకేమీ తెలియదు కదా. బిక్కచచ్చిన మొహాన్ని చూసి సంతోషంగానే ఉన్నారనుకోవడం అజ్ఞానం. ఒక పక్క రూపాయి పడిపోతూ, ఆ దెబ్బ ధరలపై కనిపిస్తుంటే, జనానికి బాధలే లేవనడమేమిటి?’
‘అది తప్పుడు భావన. రూపాయి పడిపోవడం లేదు. జారుతోందంతే! జారడమంటే, దొర్లుకుంటూ ముందుకు పోతోందన్నమాట. ఎక్కడా కింద పడి, ఆగడం లేదు కదా, తేడా గమనించాలి!’
‘ఈ లెక్కన, పాక్కుంటూ పాతాళానికి పోవడాన్నీ పాజిటివ్‌గానే తీసుకోవాలన్న మాట!’  
‘పైకో కిందికో ఎటో ఒకవైపు నిరంతర ప్రస్థానం ప్రగతి కారకం. ఆగడం స్థిరాంకం, అదే చరమాంకం! దొర్లడం, జారడం, క్షీణించడం...సుస్థిరం, నిరంతరం, బయల్దేరిన చోటికే వచ్చే అవకాశం! ఒక కోణంలో విడిగా చూస్తే... రూపాయి బక్కచిక్కినట్లే కనిపిస్తుంది. ఇంకోవైపు నుంచి, మరికొన్నింటి పక్కనపెట్టి పోల్చిచూస్తే, పక్కవాటికన్నా బలంగానే కనిపిస్తుంది. పెద్దగీత పక్కన, చిన్నగీత ఎప్పుడూ చిన్నగానే కనిపిస్తుంది. మన గీతను చిన్నగీతలతోపాటే చూస్తే, మనదే కండలు తిరిగి కనిపిస్తుంది. చూడటం, అర్థం చేసుకోవడంలోనే సమస్య!’  
‘ఇప్పుడీ గీతాపురాణం అర్థంకాదుగానీ- రూపాయి అధోముఖం, ద్రవ్యోల్బణం ఊర్ధ్వముఖం... అల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థకు సంకేతాలు కాదా?’  
‘జీఎస్టీ వసూళ్లతో సర్కారు ఖజానాలు పొంగిపొర్లడం కనిపించడం లేదా? ఆదాయ పన్ను పత్రాలను ఎగబడి సమర్పించుకుంటున్న జనాలు కనిపించడం లేదా? ఆర్థిక వ్యవస్థ అంటకత్తెర అంచున ఉంటే ఇవన్నీ సాధ్యమేనా?’
‘పన్నులు బాది, సెస్సులు పిండి, ధరలతో దంచితే- వసూళ్ల గలగలలు, ఖజానా కళకళలే కనిపిస్తాయి. మరి, సామాన్యుల విలవిలలు చూసేదెవరు? కాకి లెక్కల్లాంటి అంకెల గారడీలన్నీ సంఖ్యాత్మకం, జనం సంక్షేమమే గుణాత్మకం! జనం సుఖంగా ఉన్నారా లేదా అన్నదే కదా కీలకం!’  
‘జనానికేం తక్కువైంది? పేదలకు ఉచిత బియ్యం, రైతులకు డబ్బులు, వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, మహిళలకు సమాన అవకాశాలు, యువతకు స్వేచ్ఛ, ఉచితాలు, తాయిలాలు... ఎవరికీ ఏదీ తక్కువ కాలేదు. అన్ని వర్గాలకూ అన్నీ సమకూరుతున్నాయి. అందరూ అన్నీ మరచి కడుపునిండా తిని, కంటినిండా కునుకు తీస్తున్నారు.’  
‘కడుపులో అర్ధాకలి, రేపెలాగనే భయం, తెల్లవారితే తరుముకొచ్చే కష్టాలతో బతుకు భారంగా గడిపేస్తుంటే- జనం సుఖంగా నిద్ర పోతున్నట్లూ కాదు, దేశం ప్రశాంతంగా ఉన్నట్లూ కాదు!’
‘అన్నీ నెగిటివ్‌గా చూడవద్దు. కరోనా కముకు దెబ్బల్ని కాచుకొన్న ఆర్థిక వ్యవస్థ- అర్జంటుగా కోలుకొని, ప్రగతి పరుగులు పెడుతుంటే, సంతోషంగా స్వాగతించాలి, ఆనందంతో ఊగిపోవాలి!’
‘ఎన్ని మెలికలేసి, ఎంతగా వెనకేసుకొచ్చినా... ధరలు పెరగడం నిత్యసత్యం! సామాన్యుల బతుకులు ఛిద్రంకావడం నిష్ఠుర సత్యం!’
‘ధరలు చుక్కల్ని తాకితే, కొనుగోలు చేసే పరిస్థితే ఉండదు... ఏదీ కొనలేని వారిపై ధరాభారం ప్రభావమే ఉండదు!’
‘సరే, తిండీతిప్పలను వాటి తిప్పలకే వదిలేసినా, వైద్య పరికరాలపైనా పన్నులు పెంచితే ఎలా? కాసుల వేటకు కాచుక్కూర్చునే వైద్యశిఖామణులకు పేదల ప్రాణాల్ని అప్పనంగా అప్పగించినట్లే కదా?’
‘పేదల కోసం సర్కారీ దవాఖానాల్లో బ్రహ్మాండంగా, ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. అదీకాదంటే ప్రైవేటుకు, కార్పొరేటుకు వెళ్ళినా ఎంత పెద్ద చికిత్సలైనా పైసా ఖర్చు లేకుండా సర్కారు ఖాతాలో జరిగిపోతున్నాయి. అయినా పన్నుల మోత, వైద్యసేవల కోత అంటూ గాలి ఆరోపణలు చేయడం సబబు కాదు!’
‘అయితే, దేశ ఆర్థిక ఆరోగ్యం సుభిక్షంగా, జన సంక్షేమం సురక్షితంగా ఉన్నాయనుకోవాలన్నమాట!’
‘నూటికి వెయ్యిశాతం అంతే! ఏ లెక్కన చూసినా, ఎన్ని లెక్కలేసుకుని చూసినా, అన్ని రకాలుగా అంతా బాగా ఉంది. జనమంతా బాగానే ఉన్నారు!’
‘బాగా ఉండటం అంటే, అంతా బాగానే ఉన్నట్లు కనిపించడం కాదు. కంటి ముందు కనిపించే శాతాలు, వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలు బాగుంటే అంతా బాగున్నట్లు కాదు. సమాజంలో అందరూ బాగుండటం... ఆ బాగులో పేదలు, సామాన్యులకూ చోటుండటం... దిగజారిన బతుకులు రెండుమెట్లు పైకెక్కడం... కడుపులో నాలుగు మెతుకులు పడుతూ, రేపటిపై నమ్మకం పెరుగుతూ, మనసూ శరీరం ఆరోగ్యంతో ఉంటేనే- బాగున్నట్లు!’

- శ్రీనివాస్‌ దరెగోని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.