ప్రపంచం నోట పల్లెమాట

ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్తున్నవారితో జపాన్‌, చైనాల్లోని నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. దాంతో అక్కడి పట్టణాల్లో మౌలిక వసతులు సరిపోవడంలేదు.

Published : 09 Feb 2023 09:32 IST

ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్తున్నవారితో జపాన్‌, చైనాల్లోని నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. దాంతో అక్కడి పట్టణాల్లో మౌలిక వసతులు సరిపోవడంలేదు. వలసలను అడ్డుకునేందుకు ఆ రెండు దేశాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. భారత్‌ సైతం వలసలను నిరోధించేలా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలి.

చైనాలో పట్టణ, పల్లె వాసులకు వేర్వేరుగా ‘హుకౌ (కుటుంబ జనాభా గణాంకాలు)’ ఉంటాయి. గ్రామీణ హుకౌ జాబితాలో ఉన్నవారు నగరాలకు వలస వెళ్ళినా, అక్కడి సదుపాయాలను వినియోగించుకోవడం కుదరదు. వలస వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకోలేరు. ప్రభుత్వం అందించే విద్య, వైద్య సదుపాయాల్లోనూ వారికి పరిమితులు ఉంటాయి. ఈ నిబంధనలను ఇప్పుడిప్పుడే సవరిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ విద్యాసంస్థల్లో చదువుకుని వచ్చినవారికి, సుమారు రెండు దశాబ్దాల కిందటే వలస వచ్చినవారికి స్థానిక హుకౌలో చోటు కల్పిస్తున్నారు. జపాన్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉపాధిని వెతుక్కుంటూ రాజధాని టోక్యోతో పాటు సైతామా, చిబా, కనగావా వంటి నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. దాంతో ఆ నగరాల నుంచి పల్లెలకు తరలివెళ్ళే కుటుంబాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను జపాన్‌ సర్కారు మూడురెట్లు పెంచింది. ఇలాంటి కుటుంబాల్లోని ఒక్కో చిన్నారికి ప్రస్తుతం సుమారు రూ.6లక్షలు చొప్పున ప్రోత్సాహకం అందజేస్తోంది!

ఉపాధిని వెతుక్కుంటూ...

ప్రపంచంలో వరసగా అతిపెద్ద రెండో, మూడో ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న చైనా, జపాన్‌లలో జనాభా పెరుగుదల ఇప్పుడు అంతగా లేదు. ఆ దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చిన్నదే. పైగా జనాభా పెరుగుతోంది. కాబట్టి నగరీకరణ విసిరే సవాళ్లు మనకు మరింత కఠినంగా ఉంటాయి. ఐషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా నివేదిక ప్రకారం- 2030 నాటికి మన నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.39 లక్షల కోట్లు అవసరం. మెకెన్సీ సంస్థ దీన్ని రూ.90లక్షల కోట్లుగా అంచనా వేసింది. భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పనకు మరింత అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జనాభా పెరుగుతున్నకొద్దీ నగరాల్లో శాంతి భద్రతలు, రహదారుల విస్తరణ, గృహవసతి, తాగునీరు, మురుగునీటి నిర్వహణ వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. నగరాల్లో వెచ్చించే మొత్తంలో 25శాతం ఖర్చుతో చిన్న పట్టణాలు, పల్లెల్లో సౌకర్యాలు కల్పించవచ్చు. కానీ ఉపాధి కల్పించడమే అక్కడ పెద్ద సమస్య! గ్రామీణ ఉపాధి హామీ, రైతులకు నగదు బదిలీ వంటి పథకాలు రైతులు, రైతు కూలీలు గ్రామాల్లోనే ఉండేలా తోడ్పడుతున్నాయి. విద్యావంతులు మాత్రం ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తోంది. దేశంలో ఏటా కోటి మందికిపైగా కొత్తగా పనిచేసే వర్గంలో చేరుతున్నారు. వీరిలో 70శాతం గ్రామాలకు చెందినవారే. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు వలసలను కొంతమేర అరికడుతున్నాయి. ‘ముద్రా యోజన’ వంటి స్వయం ఉపాధి పథకాలు ఉన్నా, అందరికీ అందడంలేదు. నగరాలకు వలసవెళ్ళినా, నైపుణ్యాలు లేకపోవడంతో వారికి వెంటనే ఉద్యోగం దొరకడంలేదు. గ్రామీణ యువతను నిపుణులుగా తీర్చిదిద్ది, స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తేనే వలసలకు అడ్డుకట్ట పడుతుంది.

అంకురాలకు ఊతం

ఇప్పటివరకు దేశంలోకి డిజిటల్‌ చెల్లింపులు, ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ వంటి అంతర్జాల ఆధారిత సంస్థలే ఎక్కువగా వచ్చాయి. భవిష్యత్తులో వ్యవసాయంలో సాంకేతికత వినియోగం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వాతావరణ మార్పుల్ని గుర్తించడం, గ్రామీణుల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం వంటి రంగాల్లో అంకుర సంస్థలు పెరిగే అవకాశముంది. ఐటీ సేవలు అందించే జోహో ఐటీ సంస్థ తమిళనాడులోని తెన్‌కాశి లాంటి చిన్న పట్టణంలో వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. కొవిడ్‌ వేళ ఇంటి నుంచి పనిచేయడానికి లక్షలమంది యువత పల్లెబాట పట్టింది. పల్లెలకు ఐటీ మరింతగా చేరాలంటే అక్కడ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం మెరుగుపడాలి. ఈ మార్పుల్ని గమనించిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌)- ‘నాబ్‌ వెంచర్స్‌’ పేరుతో గ్రామాల్లో పనిచేసే పలు అగ్రిటెక్‌ అంకురాల్లో వందల కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెడుతోంది. ‘యూనస్‌ సోషల్‌ బిజినెస్‌ ఫండ్‌’ ఇటీవల ఐఐఎం-బెంగళూరులోని బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో కలిసి కొన్ని గ్రామీణ అంకురాలకు నిధులు అందిస్తోంది. తమిళనాడులోని ‘నేటివ్‌ లీడ్‌ ఫౌండేషన్‌’ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే సంస్థలకు ఊతమిస్తోంది. కర్ణాటకలోని హుబ్బళ్లి కేంద్రంగా పనిచేసే దేశ్‌పాండే ఫౌండేషన్‌ ఇదే తరహాలో వేలమంది గ్రామీణులను స్వయం ఉపాధివైపు నడిపిస్తోంది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు అంకుర సంస్థలకు ప్రభుత్వం మరింతగా ప్రోత్సాహకాలు అందించాలి. అప్పుడే పల్లెలకు జవసత్వాలు సమకూరి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వలసలకూ అడ్డుకట్ట పడుతుంది.

 సుంకరి చంద్రశేఖర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.