బటన్‌ బాబా కాల్‌ సెంటర్‌!

‘హలో... బటన్‌ బాబాగారు ఉన్నారా?’‘ఆయన ఇక్కడ ఉండరు. ఇంటింటికీ బూడిద కార్యక్రమానికి బటన్‌ నొక్కడానికి వెళ్ళారు. ఇది బటన్‌ బాబాకు చెబుదాం కాల్‌ సెంటర్‌. బీప్‌ సౌండ్‌ తరవాత మీ సమస్య ఏమిటో చెప్పండి’

Updated : 23 May 2023 07:07 IST

‘హలో... బటన్‌ బాబాగారు ఉన్నారా?’

‘ఆయన ఇక్కడ ఉండరు. ఇంటింటికీ బూడిద కార్యక్రమానికి బటన్‌ నొక్కడానికి వెళ్ళారు. ఇది బటన్‌ బాబాకు చెబుదాం కాల్‌ సెంటర్‌. బీప్‌ సౌండ్‌ తరవాత మీ సమస్య ఏమిటో చెప్పండి’

‘అదేమిటీ ఆయనే మాట్లాడతా అన్నాడుగా! సర్లే... నా బర్రె తప్పిపోయిందండి... కాస్త వెతికి పెట్టమని చెప్పండి’

‘అయ్యో... ఇది బర్రెలు వెతికిపెట్టే సెంటర్‌ కాదు. బటన్‌ బాబా ఆశ్రమం ఆఫీసు. మీకు పెన్షన్‌ అందకపోయినా, రేషన్‌ రాకపోయినా ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి... సాయం చేస్తాం’

‘అవ్వాతాతలకు ఏ అవసరం ఉన్నా చెప్పమన్నాడు కదా? నేను తాతనే. అవ్వ ఇంట్లో ఉంది. మేమిద్దరం బతకడానికి ఉన్నది ఒకటే బర్రె. అది తప్పిపోయింది. ఇదీ సమస్యే కదా’

‘అవుననుకోండి... అది ఇక్కడ కాదు చెప్పేది. మీకు పిల్లలు ఉంటే పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయించండి’

‘ఇద్దరు కొడుకులున్నారు. పెద్దోడు రైతు. వాడి పొలం గవర్నమెంటు తీసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం నష్టపరిహారం ఇవ్వకపోయేసరికి ఉద్యమం అంటూ మిగతా రైతులతో కలిసి ఏడాదికి పైగా ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాడు. రెండోవాడు ఆటో నడుపుతాడు. రోడ్లపై అడుగడుక్కీ ఉన్న గుంతల్లో పడి ఆ ఆటో చెడిపోయింది. మన సర్కారోళ్లు పోస్తున్న సరికొత్త రకం మందు తాగి వీధుల్లో దొర్లుతున్నాడు. ఇక దిక్కులేక పాడిని నమ్ముకొని నేను, నా భార్య బతుకుతున్నాం. మూడు రోజుల నుంచి బర్రె కనిపించడం లేదు’

‘సరేకానీ. ఇది బర్రెలు వెతకడానికి కాదు... ఇంకేదైనా సమస్య చెప్పండి’

‘ఏదైనా అడగమన్నారు. అన్నీ పరిష్కరిస్తామన్నారు. అడిగింది కాకుండా ఇంకేదో చెప్పమంటారు. మీతో కాదుగానీ బాబాను పిలవండి’

‘బీఈఈఈఈఈఈప్‌ప్‌...ప్‌’

‘అర్రె... కట్‌ చేసేశాడు’

*       *        *

‘హలో... గంటన్నర లైన్లో పెట్టారు’

‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ సమస్య చెప్పండి’

‘మీతో కుదరదండి. బటన్‌ బాబాను పిలవండి. ఆయన్నే అడుగుతా’

‘ఆయన లేరు. మాకు చెబితే ఆయనకు చెప్పినట్టే’

‘మా పిల్లాడు స్కూలు నుంచి వచ్చి దేశానికి రాజధాని దిల్లీ... మరి మన రాష్ట్రానికి రాజధాని ఏది అని అడుగుతున్నాడు. నాకేమో అంత చదువు లేదు. ఎంతమందిని అడిగినా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకే బాబానే అడుగుదామని ఫోన్‌ చేశా’

‘బీఈఈఈఈప్‌ప్‌ప్‌... మీరు లైన్లో ఉన్నారు. దయచేసి వేచి ఉండండి’

*       *        *

‘హలో అమ్మా... నేనో కాంట్రాక్టర్‌ని. బాబా చెప్పారని రోడ్లు, బిల్డింగులు కట్టాను. ఇంత వరకు ఒక్కపైసా బిల్లు రాలేదు. వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నాను. ఆ బిల్లులు ఎప్పుడిస్తారో బాబాను అడుగుతా... పిలవండి’

‘మీ ఆవేదన మాకు అర్థమైంది. బటన్‌ బాబాకి చెబుదాం అంటే మీరు చెప్పాలని కాదు. మేమే చెబుతాం’

‘మీరే చెప్పేటట్లయితే మమ్మల్ని కాల్‌ చేయమని ఆయన అంత పెద్దయెత్తున ప్రకటనలు ఎందుకు ఇచ్చాడు?’

‘మీరు ఫోన్‌ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరకాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం’

‘అంటే... ఇక మాకు ఆ దేవుడే దిక్కా... హలో...’

‘బీఈఈఈఈప్‌ప్‌ప్‌’

*       *        *

‘అవును... ఇది బటన్‌ బాబా కాల్‌ సెంటర్‌! మీ సమస్య చెప్పండి’

‘అయ్యా... మీ వాళ్లతో మాకు చెడ్డ పోరుగా ఉంది. ‘మా బాధ్యత నీదే బాబా’ పోస్టర్లు వద్దన్నా మా ఇంటి ముందు వేసి పోతున్నారు. ‘గడప గడపకు మన బాబా’ అంటూ మాటిమాటికి ఇళ్ల మీదకు వచ్చి ఆ టీవీల్లో బాబా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి మా పనులు చెడగొడుతున్నారు. ఈ గోల పడలేకపోతున్నాం’

‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. అందిన మేరకు అప్పులు చేసి టైమ్‌కి బటన్‌లు నొక్కుతున్నారు బాబా. మీ అందరికీ పవిత్రమైన బూడిద చేరే విధంగా చూస్తున్నారు. అది పెట్టుకోండి కష్టాలు తీరిపోతాయి... బీఈఈఈప్‌ప్‌ప్‌ప్‌...ప్‌’

*       *        *

‘హలో... బాబాగారూ.. మా పిల్లలు చదువుకోవాలంటే కరెంటు ఉండట్లేదండి’

‘హలో సారూ, నేను తాపీ పని కార్మికుడిని... ఇసుక ధర మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది. నిర్మాణాలు ఆగిపోయి మాకు పనులు లేకుండా పోయాయండి’

‘అమ్మా... మా పక్కింట్లో నాకంటే చిన్నోడికి పింఛన్‌ వస్తోంది. నాకు రావట్లేదు’

‘ఇంతకు ముందు కుదిరినప్పుడు వెళ్ళి రేషన్‌ తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు ఆ రేషన్‌ అసిస్టెంటు వచ్చేదాకా కాపలా కాయాల్సి వస్తోంది. పనులు పాడైపోతున్నాయి. అసలు ఇంటికి రేషన్‌ పంపమని ఎవరు అడిగారు?’

‘బాబూ... నేను సర్పంచ్‌ని. అప్పులు చేసి సొంత డబ్బుతో ఊళ్లో పనులు చేయించా. ఇంతవరకు గవర్నమెంటు నిధులు రాలేదు. ఎప్పుడొస్తాయో అడగండి’

‘ఇళ్లు వరదల్లో మునిగిపోయి చస్తున్నాం. ఒక్క పైసా రాలేదండి’

‘ఇదుగో పంట నష్టం అన్నారు.. ఇంతవరకు మళ్ళీ మా మొహం చూడలేదు’

‘హలో... హలో...’

‘బీఈఈఈఈఈఈ...ప్‌ప్‌ప్‌... టప్‌’.

 ఎమ్మెస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.