Hair smuggling: జుట్టు వెనక గుట్టు

నిగనిగలాడే నల్లటి జుట్టు తెల్లగా మారిపోయినా, రాలిపోయినా మనసు చివుక్కుమంటుంది. అంతటి ప్రాధాన్యమున్నది కాబట్టే, కురుల వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. భారత్‌ నుంచి కేశాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాపై కొద్దిరోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కొరడా ఝళిపించడం అందర్నీ విస్తుపోయేలా చేసింది.

Updated : 16 Sep 2023 08:26 IST

నిగనిగలాడే నల్లటి జుట్టు తెల్లగా మారిపోయినా, రాలిపోయినా మనసు చివుక్కుమంటుంది. అంతటి ప్రాధాన్యమున్నది కాబట్టే, కురుల వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. భారత్‌ నుంచి కేశాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాపై కొద్దిరోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కొరడా ఝళిపించడం అందర్నీ విస్తుపోయేలా చేసింది.

‘జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చు’ అని నానుడి. పోతే పోయిందిలే జుట్టే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆడ మగలన్న తేడా లేకుండా అందరికీ అందంతో పాటు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది కాబట్టే కేశ సంపదకు అంతటి ప్రాధాన్యం. సాధారణంగా మనం రాలిపోయిన, కత్తిరించిన వెంట్రుకలను చెత్తతో పాటే ఇష్టానుసారంగా పడేస్తుంటాం. కాలక్రమంలో అవి భూమిలో కలిసిపోయి కార్బన్‌, సల్ఫర్‌, నైట్రోజన్‌ వంటి మూలకాల ఉత్పత్తికి దారితీస్తాయి. కురుల వ్యర్థాలు జలవనరుల్లో కలిసిపోయి నీటిలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడానికి, తద్వారా నీటి నాణ్యత క్షీణించడానికి కారణమవుతాయి. ఈ పరిణామాన్ని యూట్రోఫికేషన్‌గా పిలుస్తారు. విచ్చలవిడిగా పారేసే మనిషి జుట్టుతో పర్యావరణానికి తీరని హాని కలుగుతోందంటూ పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అయితే, కేశ సంపదే పెట్టుబడిగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పెద్దయెత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి.

భారత్‌లో మత సంప్రదాయాలను అనుసరించి నిత్యం వేల మంది భక్తులు వివిధ ఆలయాల వద్ద తలనీలాలు అర్పిస్తుంటారు. కొన్ని సమాజాల్లో పుట్టువెంట్రుకలు తీయించుకోవడం, కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు గుండు చేయించుకోవడం, జుట్టు పెరగ్గానే క్షవరం చేయించుకోవడం సంప్రదాయం. గుడులు, క్షౌరశాలలు, వ్యక్తుల నుంచి జుట్టును సేకరించడం, దాన్ని వర్గీకరించి శుభ్రం చేయడం... భారత్‌లో పెద్ద పరిశ్రమగా ఎదుగుతోంది. భారత్‌లో కేశ పరిశ్రమ లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. శుద్ధిచేసిన నాణ్యమైన జుట్టును ఎగుమతి చేయడం ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతయ్యే వెంట్రుకలు నాణ్యతను బట్టి కిలో రూ.9000 వరకు పలుకుతున్నాయి. శుద్ధిచేసిన శిరోజాల ఎగుమతుల విలువ 2019-20లో రూ.2,288 కోట్లుండగా, నిరుడు అది రూ.4,535 కోట్లకు  చేరినట్లు గణాంకాలు చాటుతున్నాయి.

భారతీయుల జుట్టుతో తయారయ్యే విగ్గులు, బట్టతలను కప్పిఉంచేవి, కృత్రిమ కనురెప్పలు, గడ్డం, మీసాలకు విదేశాల్లో, ముఖ్యంగా తూర్పు దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంటోంది. మోడలింగ్‌, నటన, మేకప్‌, బ్యూటీ, బొమ్మల తయారీ రంగాల్లో వీటిని విరివిగా వాడుతుంటారు. కొన్ని రకాల బ్రష్‌ల తయారీకి భారత్‌ నుంచి వచ్చే వెంట్రుకలే ముడి సరకు. అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో జడల బర్రెలు, మనుషుల నుంచి సేకరించిన వెంట్రుకలతో సంప్రదాయ దుస్తులు తయారవుతాయి. మనిషి వెంట్రుకల్లో ఉండే అమినో ఆమ్లాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌-సిస్టెయిన్‌ అనేది ఆహార రంగంలోనూ కీలకంగా మారింది. దీనితో తయారయ్యే పదార్థాలను పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు ఎక్కువసేపు నిల్వ చేసేందుకు వాడుతున్నారు. నైట్రోజన్‌ పుష్కలంగా ఉంటుంది కాబట్టి జుట్టును ఎరువుగా వాడటం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం. అంతేకాదు, కొన్నిరకాల సంగీత పరికరాలకు వెంట్రుకలతో తయారయ్యే తంత్రులే అవసరమవుతాయి. ఇంత విస్తృతంగా ఉపయోగిస్తున్నందువల్లే- భారతీయుల కురులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంటోంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. అధిక లాభాలకు ఆశపడి అక్రమ మార్గాల్లో కేశాలను విదేశాలకు తరలిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించిన ఈ ముఠాలు... చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, వియత్నాం, ఆస్ట్రియా తదితర దేశాలకు కేశాలను అక్రమంగా రవాణా చేస్తున్నాయి. ఇలా పట్టుబడిన 18 మందిపై ఈడీ అధికారులు ఇటీవలే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. దేశం నుంచి ఏటా కనీసం రూ.3,800 కోట్ల విలువైన కేశాలు అక్రమంగా తరలిపోతున్నాయన్నది అధికార వర్గాల అంచనా. ముడి వెంట్రుకలతో పాటు శుద్ధిచేసిన కేశాలు, కేశ ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకుంటే ఏటా రూ.40,000 కోట్ల విలువైన విదేశ మారకద్రవ్యం సమకూరుతుందని అఖిల భారత మానవ శిరోజాలు, కేశ ఉత్పత్తుల తయారీ, ఎగుమతిదారుల సంఘం అంటోంది. అందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. దేశంలో కేశ పరిశ్రమను వ్యవస్థీకరించి, ఉత్పత్తుల తయారీలో ఆధునిక సాంకేతికతలను, శిక్షణను దరిచేరిస్తే- మరెంతో మందికి ఉపాధి లభిస్తుంది.

టి.రఘుబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు