కరిగిపోతున్న కెనడా కలలు

అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, కెనడా చదువులు శాశ్వత పౌరసత్వానికి బంగారు బాటలు వేస్తాయనే ధీమా క్రమంగా బలహీనపడుతోంది. ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్‌ హత్య భారత్‌-కెనడా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Updated : 16 Feb 2024 06:59 IST

అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, కెనడా చదువులు శాశ్వత పౌరసత్వానికి బంగారు బాటలు వేస్తాయనే ధీమా క్రమంగా బలహీనపడుతోంది. ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్‌ హత్య భారత్‌-కెనడా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. లేఆఫ్‌లు, ఆర్థిక మాంద్య భయాలు అమెరికాలో చదువులపై సందేహాలు రేపుతున్నాయి.

మెరికా, కెనడాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారతీయ విద్యార్థులకు ప్రతికూలంగా మారుతున్నాయి. అక్కడ బోధనా రుసుములతోపాటు ఇతర ఫీజులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం మన యువతకు భారంగా పరిణమిస్తోంది. ఇటీవల నెలరోజుల వ్యవధిలోనే అమెరికాలో ఆరుగురు భారతీయులు దుర్మరణం పాలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2018 నుంచి విదేశాల్లో చనిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య 403. వారిలో అత్యధికంగా 91మంది కెనడాలోనే దుర్మరణం పాలయ్యారని కేంద్రం ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. కెనడా తరవాత ఎక్కువగా బ్రిటన్‌(48), రష్యా(40), అమెరికా(36), ఆస్ట్రేలియా(35) దేశాల్లో ఈ మరణాలు సంభవించాయి. జాత్యహంకారంతో పాటు అనేక ఇతర కారణాలు ఇందుకు దారితీస్తున్నట్లు చెబుతున్నారు. అలాగని, మరణ భయమేదీ మన యువతీ యువకులను వెనక్కు లాగడంలేదు. 2024లో 18లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తారని అంచనా. వీరిలో అత్యధికుల గమ్యస్థానాలు కెనడా, అమెరికాలే!

ఎక్కడ చూసినా మనవారే...

ఇటీవల అమెరికా టెక్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అడుగంటిపోయాయని, జీత భత్యాలు మునుపటి మాదిరిగా లేవంటూ అక్కడి భారతీయులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. డాలర్‌ కలలతో అమెరికాకు రావద్దని స్వదేశీ విద్యార్థులకు సలహా ఇస్తున్నారు. అయినా సరే, అమెరికాకు మన విద్యార్థుల పయనం ఆగడంలేదు. 2022-23లో 2,68,932 మంది భారతీయులు చదువుల కోసం అమెరికా వెళ్ళారని ఓపెన్‌ డోర్స్‌-2023 నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య అంతకుముందు సంవత్సరంకన్నా 36శాతం ఎక్కువ. అమెరికాలో సుమారు 10లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉంటే, వారిలో 25శాతం భారతీయులే. 2022 చివరి నాటికి కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 40శాతం ఇండియన్లు ఉండగా, వారిలో   45శాతం పంజాబీ విద్యార్థులే. అయితే, 2023లో కెనడాకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆ దేశ వలస వ్యవహారాల మంత్రి మార్క్‌ మిలర్‌ అంగీకరించారు. 2024లో ఈ తగ్గుదల 41శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఆర్థిక, రాజకీయ కారణాలే ఇందుకు ప్రధానంగా దారితీస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.

ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్‌ హత్యతో ఇండియా-కెనడా సంబంధాలు ఒత్తిడికి గురయ్యాయి. భారత్‌ డిమాండ్‌తో చాలామంది కెనడా దౌత్య సిబ్బంది స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు. దాంతో కెనడాకు వెళ్ళగోరే విద్యార్థులు, ఇతరుల వీసాలను పరిశీలించి పరిష్కరించే సిబ్బంది తగ్గిపోయారు. మరోవైపు ద్రవ్యోల్బణం వల్ల కెనడాలో బోధనా రుసుములు, ప్రయాణ ఖర్చులు బాగా పెరిగాయి. ఇళ్ల అద్దెలు, నిత్యావసర సరకులు, వైద్యసేవలు ఖరీదైపోయాయి. ఉద్యోగాల కొరతా పీడిస్తోంది. కెనడాలో దాదాపు 3,48,000 ఇళ్ల కొరత ఉందని అక్కడి ప్రభుత్వమే వెల్లడించింది. కెనడాలో చదవాలనుకొనే విద్యార్థులు జీవన వ్యయం కోసం బ్యాంకు ఖాతాలో జమచేయాల్సిన ధనాన్ని కెనడా సర్కారు ఆరు లక్షల రూపాయల నుంచి రూ.12లక్షలకు పెంచింది. ఇంత డబ్బు పోసినా అక్కడి కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని విద్యార్థులు వాపోతున్నారు.

అరకొర వసతులు

అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహాన్ని సొమ్ము చేసుకోవడానికి కెనడాలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్నింటిని కేవలం భారతీయుల కోసమే ప్రారంభించారంటే అతిశయోక్తి కాదు! చాలా విద్యాసంస్థలకు సరైన భవనాలు, తరగతి గదులు లేవు. దాంతో కెనడా వచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్‌, సినీప్లెక్స్‌లలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈమాత్రం దానికి కెనడా వెళ్ళాలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు. జీవన ఖర్చుల కోసం తమ పిల్లలు రోజూ గంటల తరబడి పాక్షిక ఉద్యోగాలు, దూరాభారాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తోందని... దాంతో వారికి చదువుకోవడానికి తగిన సమయం ఉండటం లేదని మధనపడుతున్నారు. ఎంతో కష్టపడి చదివినా కెనడాలో సరైన ఉద్యోగాలు దొరకడంలేదని విద్యార్థులు బాధపడుతున్నారు. కెనడాలో శాశ్వత నివాస హోదా పొందినవారు సైతం ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 1982-2017 మధ్య కెనడాకు వలస వచ్చినవారిలో 17.5శాతం దేశాన్ని విడిచి వెళ్ళిపోయారని ప్రభుత్వ సంస్థ ‘స్టాటిస్టిక్స్‌ కెనడా’ వెల్లడించింది. పరిస్థితులను చూస్తుంటే భారతీయ విద్యార్థుల కెనడా కలలు చెదిరిపోతున్నట్లుగానే కనిపిస్తోంది!

 ఆర్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.