పదకొండేళ్లకే రిటైరవుతుందట!

చాలామంది ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో చేస్తుంటారు. కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత రిటైరవుతారు. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన 11 ఏళ్ల పిక్సీ కర్టిస్ అనే అమ్మాయి ఇందుకు పూర్తి భిన్నం. చిన్నప్పుడే ఓ సంస్థకు యజమానిగా....

Published : 24 Feb 2023 21:20 IST

(Photos: Instagram)

చాలామంది ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో చేస్తుంటారు. కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత రిటైరవుతారు. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన 11 ఏళ్ల పిక్సీ కర్టిస్ అనే అమ్మాయి ఇందుకు పూర్తి భిన్నం. చిన్నప్పుడే ఓ సంస్థకు యజమానిగా మారిన ఈ అమ్మాయి పదకొండేళ్లకే రిటైర్మెంట్ తీసుకుని, ఇప్పుడు ఇక తన పూర్తి ధ్యాసను చదువుపై పెట్టాలనుకుంటోందట. ఈ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు.. డ్రైవింగ్‌ రాకుండానే మెర్సిడెజ్‌ బెంజ్ కారుకు యజమానిగా మారింది దీనికంతటికీ అసలు కారణం ఈ అమ్మాయి తల్లి వ్యాపారంలో అద్భుతంగా రాణించడం! మరి ప్రస్తుతం అంతర్జాలంలో వైరలవుతున్న ఈ తల్లీకూతుళ్ల కథేంటో విందామా?

రెండేళ్ల వయసులోనే..!

ఆస్ట్రేలియాకు చెందిన రాక్సీ జాసెంకో ఒక బిజినెస్‌ ఉమన్‌. ఆమె ముద్దుల కూతురే పిక్సీ కర్టిస్‌. రాక్సీ తనకు పాప పుట్టగానే పిక్సీ పేరు మీద ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచింది. ఇందులో పిక్సీ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్లను జోడించేది. వాటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వచ్చేదట. దాంతో పిక్సీ రెండు సంవత్సరాల వయసులోనే వార్తల్లో నిలిచింది. రాక్సీ ఎలాగూ బిజినెస్‌ ఉమన్‌ కావడంతో పిక్సీకి చిన్నప్పటి నుంచే వ్యాపార విషయాల గురించి చెప్పేదట. అదే సయమంలో రాక్సీ ఓ కేశాలంకరణ ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది.

మొదటి అడుగులోనే..!

ఆ తర్వాత ‘పిక్సీస్ ఫిడ్జెట్స్’ పేరిట ఆన్‌లైన్ బిజినెస్ మొదలు పెట్టింది. దీనిద్వారా చిన్నపిల్లలకు సంబంధించిన వివిధ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది. అది విజయం సాధించడంతో రాక్సీ తను మొదట ప్రారంభించిన కంపెనీని కూడా ఇందులో కలిపేసి దానికి ‘పిక్సీస్ పిక్స్’గా పేరు పెట్టింది. దీనికి తన కూతురు పిక్సీని యజమానిగా చేసింది. ఈ క్రమంలో- పిక్సీకి ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా జీతం కూడా వస్తుందట. అంతేకాదు.. వ్యాపార నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలలో పిక్సీని కూడా భాగస్వామిని చేయడం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...

పిక్సీ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చాలా పాపులర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్సీకి లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. పిక్సీ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు తమ బిజినెస్‌కు సంబంధించిన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ లిటిల్‌ బిజినెస్‌ గర్ల్‌కి టెన్నిస్‌ ఆడడం అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పిక్సీ టెన్నిస్‌ కోర్టులో వాలిపోతుంటుంది. పిక్సీకి హంటర్‌ అనే ఎనిమిదేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు.

ఇదే సరైన సమయం..!

అయితే- పిక్సీకి వ్యాపారం పట్ల మక్కువ ఉన్నప్పటికీ తన కూతురు చదువుపై దృష్టి సారించడానికి ఇదే తగిన సమయం అంటోంది రాక్సీ. గత కొన్ని నెలలుగా మా కుటుంబ సభ్యులమంతా వ్యాపార ప్రణాళిక గురించి చర్చించుకున్నాం. మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. అయితే పిక్సీ తన ఉన్నత చదువుపై తిరిగి దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం.. అందుకే తనకు ఉద్యోగ జీవితం నుంచి రిటైర్‌మెంట్ కల్పించి.. చదువుకునేందుకు అవకాశం కల్పిస్తాం’ అని చెప్పుకొచ్చింది. పిక్సీ 10వ పుట్టిన రోజు సందర్భంగా రాక్సీ విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిందట. తల్లి వ్యాపార నైపుణ్యాలతో పదకొండేళ్ల వయసులోనే కోట్లకు పడగలెత్తిన ఈ చిన్నారి కథనం ప్రస్తుతం వైరలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్