తాప్సీ బీటెక్‌.. ఈ అమ్మాయి చేసే పానీపూరీలు అందుకే స్పెషల్‌..!

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ఆలోచనలు కూడా మారుతున్నాయి. చదువు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆలోచన నుంచి ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో సమాజం నుంచి వచ్చే విమర్శలను....

Updated : 11 Mar 2023 20:01 IST

(Photos: Instagram)

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ఆలోచనలు కూడా మారుతున్నాయి. చదువు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆలోచన నుంచి ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో సమాజం నుంచి వచ్చే విమర్శలను కూడా పక్కనపెడుతున్నారు. ఈ జాబితాలో దిల్లీకి చెందిన 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్‌ ముందు వరుసలో ఉంటుంది. బీటెక్‌ చదివినా తనదైన శైలిలో పానీపూరీ వ్యాపారం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘బీటెక్‌ పానీపూరీవాలీ’ పేరిట బుల్లెట్ బండికి పానీపూరీ డబ్బాను తగిలించుకుని వీధుల్లో తిరుగుతూ పానీపూరీలు విక్రయిస్తున్న తాప్సీ వీడియో ఒకటి ఇటీవలే వైరలైంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

దిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్‌ చదివింది. అయితే చదువు పూర్తైన తర్వాత చాలామందిలా తను ఉద్యోగం చేయాలనుకోలేదు. దానికి భిన్నంగా ‘స్ట్రీట్‌ఫుడ్‌’ వ్యాపారం చేయాలనుకుంది. ఆలోచనైతే వచ్చింది. కానీ, ఏ ఫుడ్‌తో వ్యాపారం చేయాలో తనకు అర్థం కాలేదు. తన మనసులో మాత్రం ఎంచుకునే ఫుడ్‌ అందరికీ నచ్చేలా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని భావించింది. అలా పానీపూరీని ఎంచుకుంది. అయితే ఇంత చదివి ఎవరైనా పానీపూరీలు అమ్ముతారా? అనే విమర్శలను కూడా ఎదుర్కొంది. కానీ ‘జీవితంలో చేయాలనుకున్న పనిని వెంటనే చేసేయాలి. ఎందుకంటే సమయం ఎవరికోసం ఆగదు’ అన్న విషయాన్ని బలంగా నమ్మే తాప్సీ తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లడమే సరైన నిర్ణయం అనుకుంది. అలా ‘సర్వింగ్‌ హెల్త్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘బీటెక్‌ పానీపూరీవాలీ’ని ప్రారంభించింది.

వారి సహకారంతో...

పానీపూరీ వ్యాపారం ప్రారంభించే ముందు తాప్సీ తన ఆలోచనను స్నేహితులతో పంచుకుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినా స్నేహితులు మాత్రం తన ఆలోచనకు మద్దతు తెలపడంతో ముందుకు వెళ్లాలనుకుంది. ఈక్రమంలో చాలామందికి పానీపూరీలు ఇష్టమున్నా ఆరోగ్యానికి మంచిది కాదన్న అభిప్రాయంతో వెనకడుగు వేస్తున్నారని గమనించింది. అందుకే వీటిని ఆరోగ్యంగా ఎలా చేయచ్చనే అంశంపై దాదాపు ఏడు నెలల పాటు పరిశోధన చేసింది. ఈ క్రమంలో పలు వైఫల్యాలను కూడా చవిచూసింది. కానీ చివరకు తను అనుకున్న విధంగా పానీపూరీలను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసింది.

ఈ పానీపూరీ ప్రత్యేకతలివే..!

సాధారణంగా స్ట్రీట్‌ఫుడ్‌ అనగానే ‘పరిశుభ్రత పాటించరు’ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. తాప్సీ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ముఖ్యంగా ఈ పదార్థాలను తయారు చేయడం దగ్గర్నుంచి వినియోగదారులకు చేర్చడం వరకు.. మొత్తం ప్రక్రియలో చేతులకు తప్పకుండా గ్లోవ్స్ ధరిస్తుంది. సాధారణంగా పానీపూరీలు చేసే క్రమంలో ఆయిల్‌ ఉపయోగించడంతో పాటు డీప్‌ ఫ్రై చేస్తుంటారు. ఈ పద్ధతి వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దీనికి బదులుగా తాప్సీ పూరీలు చేయడానికి ఆయిల్‌ ఉపయోగించకుండా ఎయిర్‌ ఫ్రై పద్ధతిని పాటిస్తుంది. అలాగే ఆరోగ్యానికి హాని చేసే మైదా పిండిని అస్సలు ఉపయోగించదు. ఇక సాధారణ ఉప్పుకు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే హిమాలయన్‌ పింక్‌ రాక్‌ సాల్ట్‌ను ఉపయోగిస్తుంటుంది. ఇందుకు ఉపయోగించే నీళ్ల (పానీ) తయారీ విధానంలో కూడా తాప్సీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. స్టోర్స్‌లో లభించే పౌడర్లు కాకుండా సహజసిద్ధంగా తయారుచేసే హెర్బ్స్‌ని ఉపయోగిస్తుంది.

‘మేము పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన స్ట్రీట్‌ ఫుడ్‌ని అందిస్తున్నాం. ఈ ఆహారంలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడంతో పాటు విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. అలాగే ఇందులోని పోషకాలకు సంబంధించిన వివరాలను వినియోగదారులకు అందిస్తున్నాం. డైట్‌ పాటించే వారికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నాం’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.

ఆఫర్లతో ఆకట్టుకుంటూ..!

తాప్సీ బుల్లెట్‌ బండికి పానీపూరీ డబ్బాను తగిలించుకుని నగర వీధుల్లో తిరుగుతూ పానీపూరీలు విక్రయిస్తుంటుంది. సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటుంది. వీటి ద్వారా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో వివిధ ఆఫర్లు ప్రకటించడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాప్సీ ఆరు పూరీలను 30 రూపాయలకు విక్రయిస్తోంది. అంతేకాదు.. ప్రత్యేకించి బీటెక్ స్టూడెంట్స్ కోసం ఒక ఆఫర్‌ కూడా ప్రకటించింది. ఎవరైనా బీటెక్‌ విద్యార్థి తన ఐడీ కార్డ్‌ చూపిస్తే 99 రూపాయలకే అపరిమిత పానీపూరీలను అందిస్తోంది. తాప్సీ btechpaanipuri.com అనే వెబ్‌సైట్‌ను కూడా నడుపుతోంది. దీనిద్వారా ఫ్రాంఛైజీలను ఆహ్వానిస్తూ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అలాగే ప్రత్యేకించి మరెంతోమంది అమ్మాయిలను సాధికారత దిశగా నడిపించాలనుకుంటోంది. ఈ క్రమంలో కేవలం పానీపూరీలు మాత్రమే కాకుండా మరిన్ని ఆహార పదార్థాలను ఆరోగ్యకరమైన రీతిలో వినియోగదారులకు అందించడమే తన ముందున్న లక్ష్యం అంటోంది.

ఇటీవలే తాప్సీకి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్లో పోస్ట్‌ చేయగా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా ఉన్నారు. ఆమె తాప్సీ ఉపాధ్యాయ్‌ ఫొటోను షేర్‌ చేస్తూ ‘కేవలం పేరు మాత్రమే కాదు.. డిగ్రీ కూడా మ్యాచ్‌ అయింది’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇప్పటివరకు ఈ వీడియోని దాదాపు 4 లక్షల మంది లైక్‌ చేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్