స్టూడెంట్‌గా వెళ్లి.. ర్యాగింగ్ చేసిన వారిని పట్టించింది..!

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్‌ కాలేజీలో సీనియర్లు.. జూనియర్‌ విద్యార్థులను అభ్యంతరకర రీతిలో ర్యాగింగ్‌ చేశారు. ర్యాగింగ్‌కు గురైన జూనియర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల....

Published : 12 Dec 2022 20:28 IST

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్‌ కాలేజీలో సీనియర్లు.. జూనియర్‌ విద్యార్థులను అభ్యంతరకర రీతిలో ర్యాగింగ్‌ చేశారు. ర్యాగింగ్‌కు గురైన జూనియర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల పేర్లను వెల్లడించలేదు. వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు కాలేజీకి వెళ్లారు. అయితే ఒక్కరు కూడా పేర్లు చెప్పలేదు. దాంతో పోలీసులు రహస్య ఆపరేషన్‌ ద్వారా వారి వివరాలను తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 24 ఏళ్ల యువ కానిస్టేబుల్‌ షాలినీ చౌహాన్‌ ముఖ్య పాత్ర పోషించి, ర్యాంగింగ్‌కు పాల్పడిన వారి వివరాలను చాకచక్యంగా తెలుసుకుంది.

కాలేజీ విద్యార్థిగా..

షాలిని ఇటీవలే ఇండోర్‌లోని సంయోగితగంజ్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరింది. ఆమె తండ్రి కూడా పోలీసే. ఆయన 2010లో చనిపోయారు. మరుసటి ఏడాదే షాలిని తల్లి కూడా మరణించింది. అయినా కుంగిపోకుండా తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని షాలిని కానిస్టేబుల్ అయింది. పోలీస్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొన్ని రోజులకే ఆమె ఈ కాలేజీ ఆపరేషన్‌లో భాగమైంది. ఈ క్రమంలో సాధారణ విద్యార్థినిగా జీన్స్‌, టీ షర్ట్‌ ధరించి బ్యాగ్‌ వేసుకుని రోజూ కాలేజీకి వెళ్లేది. క్యాంటీన్‌, కాలేజీ పరిసర ప్రాంతాల్లో జూనియర్‌ విద్యార్థులతో క్రమంగా పరిచయం పెంచుకుంది. తను కామర్స్‌ విద్యార్థి అయినా ఎవరికీ అనుమానం రాకుండా మెడికల్‌ విద్యార్థులతో మాట్లాడడం మొదలు పెట్టింది. వారి నుంచి విషయాలను రాబట్టేందుకు తనకు సంబంధించిన విషయాలను వారితో పంచుకునేది. దాంతో వారు కూడా వివిధ విషయాల గురించి షాలినితో పంచుకునేవారు. అలా వారు చెప్పిన విషయాల ఆధారంగా ర్యాగింగ్‌కు పాల్పడిన 11 మంది సీనియర్‌ విద్యార్థులను పట్టుకోగలిగింది. కాలేజీ యాజమాన్యం ఆ 11 మందిని సస్పెండ్‌ చేసింది. చేపట్టిన మొదటి ఆపరేషన్‌లోనే విజయం సాధించిన ఆమెకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా షాలిని మాట్లాడుతూ ‘నేను నిఘా ఉంచాల్సిన అనుమానిత విద్యార్థుల వివరాలను మా ఆఫీసర్‌ మాకు తెలిపారు. ఇందుకోసం రోజూ ఐదు నుంచి ఆరు గంటల పాటు విరామ సమయాల్లో క్యాంటీన్‌లో తిరిగేదాన్ని. అలా అక్కడ ఉన్నవారితో మాట్లాడడం మొదలుపెట్టాను. అలాగే జూనియర్‌ విద్యార్థులతో పరిచయం పెంచుకున్నాను. అలా నెమ్మదిగా ర్యాంగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల వివరాలు తెలుసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

ఎలాంటి క్లూ లేదు..

ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన పోలీస్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ‘ఈ కేసులో మొదట ఎలాంటి క్లూ లేదు. జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన సంభాషణలు, ర్యాగింగ్‌కు సంబంధించి అజ్ఞాత ఫిర్యాదులు మాకు అందాయి. విచారణ నిమిత్తం కాలేజీకి వెళ్తే భయపడి నిందితుల పేర్లు చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఫోన్‌ నంబర్లను ట్రాక్‌ చేద్దామంటే హెల్ప్‌లైన్‌ పాలసీ సహకరించదు. దాంతో పాత పద్ధతిలో అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేయాలనుకున్నాం. షాలినితో పాటు కొంతమంది కానిస్టేబుల్స్‌ని స్టూడెంట్స్‌గా కాలేజీకి పంపాం. వారు జూనియర్‌ విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ నిందితుల వివరాలను తెలుసుకోగలిగారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్