Updated : 17/12/2022 19:39 IST

నాలుగేళ్ల చిన్నారి.. రోజుకి 25 కి.మీ నడక.. ఎందుకో తెలుసా?

సాధారణంగా గుళ్లో ప్రదక్షిణలు చేయడం సహజమే. కానీ, నది చుట్టూ ప్రదక్షిణ చేయడం మీరెప్పుడైనా విన్నారా? అవును ‘నర్మదా పరిక్రమ’ పేరుతో నర్మదా నది చుట్టూ ఏటా లక్షల మంది ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ క్రమంలో దాదాపు 3500 కి.మీ నడక సాగిస్తుంటారు. అయితే ఈ ప్రదక్షిణలో భాగంగా ప్రస్తుతం ఓ నాలుగేళ్ల చిన్నారి చూపరులను ఆకట్టుకుంటోంది. తల్లిదండ్రులతో కలిసి రోజూ సుమారు 25 కి.మీ. నడుస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ వివరాలు తెలుసుకుందామా...

3500 కి.మీ నడక..

భారతీయ సంస్కృతిలో దేవాలయాలతో పాటు నదులకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే చాలామంది కొన్ని నదుల్లో పుణ్యస్నానాలు చేయడానికి మక్కువ చూపిస్తుంటారు. అయితే నది చుట్టూ ప్రదక్షిణ చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? అవును మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల గుండా ప్రవహించే నర్మదా నది చుట్టూ ఏటా లక్షల మంది ప్రదక్షిణ చేస్తుంటారు. దీనిని ‘నర్మదా పరిక్రమ’ పేరుతో పిలుస్తుంటారు. 1300 కి.మీలకు పైగా ఉండే ఈ నది చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేయడానికి దాదాపు 3500 కి.మీ నడవాల్సి ఉంటుంది. బస్సు ప్రయాణం ద్వారా ఈ యాత్రను పూర్తి చేసేవారుంటారు. ఇంతదూరం నడవాలంటే పెద్దవాళ్లకే కష్టంగా ఉంటుంది. అలాంటిది నాలుగేళ్ల రాజేశ్వరగిరి మాత్రం తల్లిదండ్రులతో కలిసి అలుపూసొలుపూ లేకుండా రోజూ సుమారు 25 కి.మీ నడుస్తోంది. రాళ్లూరప్పలతో కూడిన మార్గాల్లో సైతం ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగిపోతున్న ఈ చిన్నారిని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దైవభక్తి ఎక్కువ...

రాజేశ్వరగిరి కుటుంబానిది మహారాష్ట్రలోని ప్రసిద్ధ క్షేత్రం శని శింగనాపూర్ కి దగ్గర్లోని చెడ్గావ్‌ అనే ప్రాంతం. ఈ అమ్మాయికి దైవభక్తి ఎక్కువ. భజనలు చేయడం, శ్లోకాలు పఠించడంలో ముందుంటుంది. ఈ అమ్మాయి రెండేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి బస్సులో ‘నర్మదా పరిక్రమ’ను మొదటిసారి పూర్తిచేసింది. అయితే ఈసారి వారు కాలినడకన ప్రదక్షిణ చేయాలనుకున్నారు. అలా అక్టోబర్‌ 12న తమ యాత్ర ప్రారంభించారు. గత రెండు నెలలుగా సాగుతోన్న వీరి యాత్ర మరో రెండు నెలల పాటు సాగనుంది. అయితే యాత్రలో భాగంగా వీరు ఇటీవలే బర్వాలోని ఒక దేవాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరగిరి చిన్న వయసులోనే చేస్తున్న ఈ సాహసం, తన శ్లోక పఠనానికి మెచ్చిన అక్కడి ప్రజలు ఆ అమ్మాయికి సన్మానం చేయడం విశేషం. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అలసిపోతున్నా తను మాత్రం ఎంతో ఉత్సాహంగా ‘నర్మదే హర్, జిందగీ భర్‌’ అంటూ ముందుకు సాగుతోంది ఈ చిన్నారి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి