Bhumi Pednekar: ఆ ప్రశ్నే.. ఇప్పుడీ పని చేయిస్తోంది..!

సాటి మనిషికి కష్టమొస్తేనే పట్టించుకోని రోజులివి.. కానీ చిన్న మొక్కకు కష్టమొచ్చినా ఓర్చుకోలేనంటోంది బాలీవుడ్‌ అందాల తార భూమి పెడ్నేకర్‌. పర్యావరణ పరిరక్షణే ఊపిరిగా భావించే భూమి.. ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడేందుకు ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించింది....

Published : 23 May 2024 12:29 IST

సాటి మనిషికి కష్టమొస్తేనే పట్టించుకోని రోజులివి.. కానీ చిన్న మొక్కకు కష్టమొచ్చినా ఓర్చుకోలేనంటోంది బాలీవుడ్‌ అందాల తార భూమి పెడ్నేకర్‌. పర్యావరణ పరిరక్షణే ఊపిరిగా భావించే భూమి.. ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడేందుకు ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించింది. ఈ వేదికగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తోంది. ఇలా ఎకో వారియర్‌గా ఆమె చేస్తోన్న సేవల్ని గుర్తించిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌’గా భూమిని ఎంపిక చేసింది. తద్వారా వచ్చే ఏడాది దావోస్‌లో జరగబోయే ‘ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు’లో భారత్ తరఫున పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుందీ బాలీవుడ్‌ అందం. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తోన్న కృషి గురించి తెలుసుకుందాం..!

నీరంతా ఇంకిపోతే ఎలా?
బాలీవుడ్‌లో కథా ప్రాధాన్యం, మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది భూమి. తెరపై సామాజిక సమస్యల్ని స్పృశించేలా ఉన్న పాత్రల్ని ఎంచుకోవడానికే ఎక్కువగా ఇష్టపడే ఈ తార.. నిజ జీవితంలోనూ పర్యావరణ పరిరక్షణ అనే అతి పెద్ద బాధ్యతను తన భుజాన వేసుకుంది. అయితే తనకు ప్రకృతిపై ప్రేమ చిన్నతనంలోనే మొదలైందంటోంది భూమి.
‘పర్యావరణంపై నాకున్న ప్రేమను బహుశా నా తల్లిదండ్రులు ముందుగానే ఊహించి నాకీ పేరు పెట్టారేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది (నవ్వుతూ). చిన్నతనం నుంచే ప్రకృతి, పచ్చదనాన్ని బాగా ఇష్టపడేదాన్ని. పర్యావరణం గురించి ఎక్కువగా తెలుసుకునేదాన్ని. అయితే ఓసారి నాకో సందేహం కలిగింది. ‘ఈ భూమ్మీద ఉన్న నీరంతా ఇంకిపోతే ఎలా?’ అన్న ప్రశ్న నా మనసులో మొదలైంది. అంతే.. అప్పట్నుంచి వాతావరణ మార్పులు, వాటి వల్ల మనకు కలిగే దుష్ప్రభావాల గురించి లోతుగా తెలుసుకోవడం ప్రారంభించా. దుస్తుల దగ్గర్నుంచి తినే పదార్థాల దాకా.. ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ఎంపికల పైనే దృష్టి సారించా. కానీ పెద్దయ్యాక నేను చేస్తోన్న పని ఈ భూమిని కాపాడడానికి సరిపోదనిపించింది. నేనొక్కదాన్నే కాదు.. అందరినీ ఈ మంచి పనిలో భాగం చేయాలనుకున్నా. ఈ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘ది భూమి ఫౌండేషన్‌’’ అని చెబుతోందీ అందాల తార.

అదే నా.. ప్లస్ పాయింట్!
గతేడాది జులైలో ప్రారంభించిన ఈ స్వచ్ఛంద సంస్థ వేదికగా.. పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది భూమి. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు రూపొందించడం, పాడ్‌కాస్ట్‌లు నిర్వహించడం, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, ఎకో-స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడం.. ఇలా తన వంతుగా కృషి చేస్తోందీ ముద్దుగుమ్మ.
‘నేనో నటిని. ఈ హోదా, పలుకుబడితో ఎంతోమందిలో అవగాహన కల్పించే శక్తి నాకు ఉంది. అందుకే నా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో వీలైనంత ఎక్కువమందికి చేరువవుతున్నా. సందర్భమొచ్చినప్పుడల్లా నా గళాన్ని వినిపిస్తున్నా.. ప్రజల్లో అవగాహన పెంచుతున్నా. నేనిచ్చే ప్రోత్సాహంతో ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని కాపాడే దిశగా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించడం సంతోషాన్నిస్తోంది..’ అంటోంది భూమి. ఇలా తన ఎన్జీవో వేదికగానే కాకుండా.. ‘క్లైమేట్‌ వారియర్‌’ వంటి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్‌ మీడియా వేదికగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం.. ఇలా తనకొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోందీ అందాల తార.

దావోస్‌ వేదిక పైనా..!
పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలతో ‘ఎకో వారియర్‌’గా పేరు తెచ్చుకున్న భూమి.. పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెడుతూ.. ప్రకృతిపై తనకున్న ప్రేమను ఈ విధంగానూ చాటుకుంటోంది. ఈ క్రమంలోనే 2020లో ‘EcoSoul’ అనే పర్యావరణహిత ఇంటీరియర్‌ ఉత్పత్తుల్ని తయారుచేసే సంస్థలో పెట్టుబడులు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఇలా ఈ భూమిని కాపాడేందుకు తన వంతుగా కృషి చేస్తోన్న ఈ చక్కనమ్మ సేవల్ని గుర్తించిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)’ ఆమెను ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌’గా ఎంపిక చేసింది. తద్వారా వచ్చే ఏడాది దావోస్‌లో జరగనున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు’లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.
‘డబ్ల్యూఈఎఫ్‌ యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఎంపికవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా. ఈ ఏడాది సింగపూర్‌లో జరిగే సదస్సుతో పాటు వచ్చే ఏడాది దావోస్‌ సదస్సులోనూ పాల్గొనబోతున్నా. పర్యావరణ ప్రేమికురాలిగా నా గళాన్ని బలంగా వినిపించబోతున్నా..’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది భూమి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి 90 మందిని ఈ సదస్సుకు ఎంపిక చేయగా.. అందులో భారత్‌ నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ఒకరైన భూమి ప్రస్తుతం ‘మేరీ పత్నీ కా రీమేక్‌’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్