Unstoppable: అనన్యా బిర్లా ట్యాలెంట్ల పుట్ట!

తాను పుట్టింది శ్రీమంతుల కుటుంబంలో.. వారసత్వంగా వచ్చే వ్యాపార బాధ్యతల్ని చేపట్టి కాలు కదపకుండా కనుసైగతోనే వాటిని నిర్వర్తించచ్చు. కానీ అలా చేస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకుందామె. అందుకే బిజినెస్‌పై కాకుండా.. తొలుత తన అభిరుచులపై దృష్టి పెట్టింది. గాయనిగా, పాటల రచయిత్రిగా...

Published : 01 Feb 2023 14:11 IST

(Photos: Instagram)

తాను పుట్టింది శ్రీమంతుల కుటుంబంలో.. వారసత్వంగా వచ్చే వ్యాపార బాధ్యతల్ని చేపట్టి కాలు కదపకుండా కనుసైగతోనే వాటిని నిర్వర్తించచ్చు. కానీ అలా చేస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకుందామె. అందుకే బిజినెస్‌పై కాకుండా.. తొలుత తన అభిరుచులపై దృష్టి పెట్టింది. గాయనిగా, పాటల రచయిత్రిగా, సమాజ సేవకురాలిగా తనను తాను నిరూపించుకుంది. ఇక తాజాగా తన తండ్రి వ్యాపారంలోకీ అడుగుపెట్టింది. ఆమే.. కుమార మంగళం బిర్లా ముద్దుల కూతురు అనన్యా బిర్లా. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో తాజాగా చేరిన ఈ బిర్లా వారసురాలు.. ప్రేమతో మనసులోని అసూయాద్వేషాల్ని జయించినప్పుడే నాయకులుగా రాణించగలం అంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది. మరి, తన బహుముఖ ప్రజ్ఞతో ట్యాలెంట్ల పుట్టగా పేరుగాంచిన అనన్య.. తన గురించి వివిధ సందర్భాల్లో పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

అమ్మే తొలి గురువు!

నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే! పిల్లల పెంపకంలో అమ్మానాన్నల పాత్ర సమానంగా ఉండాలంటారు. కానీ నా చిన్నతనంలో నాన్నతో కంటే అమ్మతోనే ఎక్కువ సమయం గడిపాను. నాన్న తన వ్యాపారంలో బిజీగా ఉండేవారు. అప్పుడు అమ్మే నన్ను, నా ఇద్దరు తోబుట్టువుల పెంపకం బాధ్యతల్ని తీసుకుంది. ఇక చిన్నతనం నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన నాలో ఎక్కువగా ఉండేది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక విద్య నేర్చుకుంటూ ఉండేదాన్నని అమ్మ చెబుతుంటుంది. నాకు ఊహ తెలిశాక.. పజిల్స్‌ పూర్తిచేయడం, బొమ్మలు వేయడం, క్యాలిగ్రఫీ (చేతిరాతకు సంబంధించిన ఆర్ట్‌), సంతూర్‌ వాయించడం, టేబుల్‌ టెన్నిస్‌-ఫుట్‌బాల్‌.. వంటి ఆటలాడడం, ఈత కొట్టడం.. ఇలా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఎప్పుడూ బిజీగా గడిపేదాన్ని. ఇక శ్రీమంతుల కుటుంబంలో పుట్టినా.. అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని కనాలి.. అన్న మాటలు వినిపించేవి. కానీ అమ్మానాన్నలు మా ఇష్టాయిష్టాలు, అభిరుచులకే ఎక్కువ విలువిచ్చేవారు. నన్ను, చెల్లిని, తమ్ముడిని.. ముగ్గురినీ సమానంగా పెంచారు. క్రమశిక్షణ, ఉన్నత విలువల్ని నేర్పారు.

ఆ ముగ్గురే స్ఫూర్తి!

మనం పెరిగి పెద్దయ్యే క్రమంలో కొంతమంది వ్యక్తులు/కొన్ని సంఘటనలు మనకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. నా విషయానికొస్తే.. ముగ్గురు వ్యక్తులు నాలో ప్రేరణ కలిగించారని చెప్తా!

మొదటి వ్యక్తి మా నాన్న.. పని పట్ల తనకున్న అంకితభావం చూస్తూ పెరిగిన నేను.. తన నుంచి వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.

రెండో వ్యక్తి మదర్‌ థెరిసా.. డబ్బు, అధికారం శాశ్వతం కాదు.. ప్రేమతోనే దేన్నైనా జయించచ్చన్న విషయం ఆమె నిరూపించారు.. ఎప్పటికైనా ఆమె దారిలో నడవాలన్నది నా చిరకాల కాంక్ష.

ఇక మూడో వ్యక్తి మా ఇంటి పనిమనిషి లత.. నాకు ఆరు నెలల వయసున్నప్పట్నుంచి తను మా ఇంట్లో పనిచేస్తోంది. ఎన్ని కష్టాలొచ్చినా సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటుంది. తనలో నాకు నచ్చిన విషయం అదే! తనను చూశాక నాలోనూ పాజిటివిటీ పెరిగింది. ఎంత డబ్బు సంపాదించామనేది కాదు.. ఎంతమంది హృదయాలను గెలుచుకున్నామన్నదే నాకు ముఖ్యం.

అందుకే స్కూలుకెళ్లలేదు!

పదో తరగతి వరకు క్రమం తప్పకుండా స్కూలుకెళ్లినా.. ఇంటర్మీడియట్‌లో మాత్రం బలవంతంగా స్కూలు మానేశా. దీని వెనకున్న కారణం చాలామందికి సిల్లీగానే అనిపించచ్చు.. కానీ నేను మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకున్నా. నాలుగైదు గంటల్లో పూర్తయ్యే పాఠాల్ని.. స్కూల్లో/కాలేజీలో రోజంతా సాగదీస్తూ సమయం వృథా చేస్తున్నారనిపించేది. అందుకే ఇంటర్మీడియట్‌ కోసం ఇంట్లోనే ట్యూషన్‌ పెట్టించుకున్నా. నాలుగైదు గంటలు దీనికి వెచ్చించాక.. ఇక మిగతా సమయంలో నాకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెట్టేదాన్ని. ఈ క్రమంలోనే వ్యాపార ఆలోచనలు కూడా నా మనసులోకి వచ్చేవి. ఇవే ‘స్వతంత్ర’ పేరుతో సూక్ష్మరుణ సంస్థను నెలకొల్పేందుకు కారణమయ్యాయి. ఈ సంస్థ సాంకేతికత సహాయంతో గ్రామీణ మహిళలకు ఆదాయ వనరుల్ని సమకూర్చుతోంది. ప్రస్తుతం మా సంస్థలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌.. ఈ మూడు రాష్ట్రాల నుంచి 1.20 లక్షలకు పైగా మహిళలు సభ్యత్వం తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ సంస్థను యూనివర్సల్‌ బ్యాంకుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

మనసుకు ‘ఎంపవర్‌’ తోడు!

వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా, ఎమోషనల్‌గా.. ఇలా అన్ని విషయాల్లో ముందుకెళ్లాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ విషయం నాకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు అర్థమైంది. మానసిక సమస్యల పరిష్కారానికి ఆ విశ్వవిద్యాలయంలో ఓ హెల్‌్ిలైన్‌ ఉండేది. నిరంతరాయంగా దానికొచ్చే కాల్స్‌ చూశాక.. నా చుట్టూ ఇంతమంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారా? అనిపించింది. ఇక భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితుల్నే గమనించా. ఇక ఇక్కడ ఆత్మహత్యలకు మానసిక సమస్యలే ముఖ్య కారణమన్న విషయం నాకు అర్థమైంది. అందుకే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో అమ్మతో కలిసి ‘Mpower’ అనే సంస్థను స్థాపించా. ప్రస్తుతం ఈ వేదికగా ఎంతోమందిలో ఉన్న ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీని దూరం చేసి తిరిగి వారిని మామూలు మనుషుల్ని చేయడం సంతోషంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మానసిక సమస్యలపై ఉన్న అపోహల్ని దూరం చేసే దిశగానూ మా సంస్థ సేవలందిస్తోంది.

మనసు మాట వినమంది!

చిన్నతనం నుంచి అమ్మ నాతో ఒక మాట ఎప్పుడూ చెబుతుండేది.. ‘మనసు మాట వినమ’ని! ప్రతి రోజూ ఉదయం లేచాక ఇదే మాటను గుర్తు చేసుకుంటా. బహుశా.. ఈ ప్రోత్సాహమే నాలోని సంగీత తృష్ణను మేల్కొలిపిందేమో అనిపిస్తుంటుంది. సంగీతం నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. నాకు చిన్నతనం నుంచి కవితలు రాయడం, పాటలు పాడడమంటే మక్కువ. ఈ క్రమంలోనే గిటార్‌, సంతూర్‌.. వంటి సంగీత వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నా. నా గదిలో ఒంటరిగా కూర్చొని.. అర్థవంతమైన పాటలు రాసిన సందర్భాలు లెక్కకు మిక్కిలే ఉన్నాయి. ఇక నేను రాసి పాడిన ‘లివింగ్‌ ది లైఫ్‌’, ‘మీన్‌ టు బీ’, అన్‌స్టాపబుల్, లవ్ సూసైడ్‌’, ‘డిస్‌అప్పియర్‌’.. వంటి పాటలు నాకు ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల్ని సంపాదించి పెట్టాయి. నా జీవితంలో నేను కోరుకుందీ ఇదే.. నా ఇంటి పేరు, కుటుంబ పేరుప్రఖ్యాతులతో సంబంధం లేకుండా నాకంటూ సొంత ప్రత్యేకత సంపాదించుకోవాలని! ప్రస్తుతం కుటుంబ వ్యాపారంలో భాగంగా నాకు అందిన ఈ కొత్త బాధ్యతనూ ఇంతే సమర్థంగా నిర్వర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక నాకు లాంగ్‌ డ్రైవ్స్‌కి వెళ్లడం, ట్యాటూలు వేయించుకోవడమంటే చాలా ఇష్టం. నేను ప్రారంభించిన ‘స్వతంత్ర’ సంస్థ పేరుతోనూ ఓ ట్యాటూ వేయించుకున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్