లింక్డిన్‌లో జాబ్ వదిలేసి.. ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. వ్యాపారవేత్తగా మారింది!

రోజంతా ఆఫీస్‌ హడావిడితోనే సరిపోతుంది.. కాసేపు ఇంట్లో వాళ్లతో గడుపుదామన్నా సమయం దొరకదు.. అలాంటిది ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్లాలనిపించినా.. వీలు పడక ఆ కోరికను మనసులోనే అణచివేస్తుంటాం. దిల్లీకి చెందిన ఆకాంక్ష మోంగాదీ అచ్చం...

Published : 22 May 2023 13:52 IST

(Photos: Instagram)

రోజంతా ఆఫీస్‌ హడావిడితోనే సరిపోతుంది.. కాసేపు ఇంట్లో వాళ్లతో గడుపుదామన్నా సమయం దొరకదు.. అలాంటిది ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్లాలనిపించినా.. వీలు పడక ఆ కోరికను మనసులోనే అణచివేస్తుంటాం. దిల్లీకి చెందిన ఆకాంక్ష మోంగాదీ అచ్చం ఇదే పరిస్థితి. కానీ తాను ఉద్యోగం కంటే తన అభిరుచికే ప్రాధాన్యమిచ్చింది. ప్రపంచాన్ని చుట్టిరావాలనుకున్న తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా లింక్డిన్‌ సంస్థలో ఉన్నతోద్యోగాన్ని సైతం వదులుకుంది. తాను ప్రయాణాలు చేయడమే కాదు.. ఆ అనుభవాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ డిజిటల్‌ క్రియేటర్‌గా సరికొత్త అవతారం ఎత్తింది. దీంతో ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య అమాంతం మూడు రెట్లు పెరిగింది. ఉద్యోగిగా కంటే ట్రావెలర్‌గానే తనకు ఎక్కువ గుర్తింపొచ్చిందంటోన్న ఆకాంక్ష.. ప్రయాణాల్నే తన వ్యాపారసూత్రంగా మలచుకొని.. ఏకకాలంలో అటు తన కలనూ నెరవేర్చుకుంది.. ఇటు కెరీర్‌లోనూ నిలదొక్కుకుంది.

‘నేను ప్రతిరోజూ జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను..’ ఇదీ ఆకాంక్ష మోంగా సూత్రం. మిలిటరీ కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. ఆరేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి భూటాన్‌లోని పారో అనే నగరాన్ని సందర్శించింది. అక్కడి అందాలకు ముగ్ధురాలవడమే కాదు.. ఈ ప్రయాణ అనుభవంతో ట్రావెలింగ్‌పై క్రమంగా ప్రేమ పెంచుకుంది. సమయం దొరికినప్పుడల్లా తన పాకెట్‌ మనీతో దగ్గరి ప్రాంతాల్ని సందర్శిస్తూ ముందుకు సాగిన ఆమె.. ఎప్పటికైనా సరే ప్రపంచాన్ని చుట్టేయాలన్న జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుంది.

మూడు రెట్లు పెరిగింది!

అయితే అది అనుకున్నంత సులభం కాదు.. అందుకు బోలెడంత డబ్బు ఖర్చవుతుందన్న విషయం అర్థం చేసుకున్న ఆమె.. ఈ క్రమంలో చదువు పైనే తన పూర్తి దృష్టి పెట్టింది. కష్టపడి చదువుకొని.. లింక్డిన్‌ సంస్థలో ఉన్నతోద్యోగం తెచ్చుకుంది. అయితే అటు సీరియస్‌గా ఉద్యోగం చేస్తున్నా.. తన మనసు ప్రపంచ పర్యటన వైపే లాగేది. ఇలా మూడేళ్ల పాటు శ్రమించి కొంత డబ్బు పోగేసుకుంది ఆకాంక్ష. గతేడాది మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి తన చిరకాల అభిరుచిపై దృష్టి సారించింది. అయితే తాను ట్రావెలర్‌గా మారి ఏడాది పూర్తైన సందర్భంగా.. గతంలో ఉద్యోగిగా కంటే ట్రావెలర్‌గా మారాకే తనకు ఎక్కువ గుర్తింపొచ్చిందంటూ ఇటీవలే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిందీ ట్రావెల్‌ లవర్.

‘సరిగ్గా ఏడాది క్రితం (మే 17, 2022) లింక్డిన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశా. ఆ సమయంలో నాకు నేనే ఓ వాగ్దానం చేసుకున్నా. అదేంటంటే.. ‘ఏడాది గ్యాప్‌ తీసుకొని ప్రపంచాన్ని చుట్టిరావాలి.. ఈ సమయంలో మరో ఆలోచన లేకుండా పూర్తిగా ట్రావెలింగ్ పైనే దృష్టి పెట్టాలి.. జీవితాన్ని ఆస్వాదించాలి..’ అని! నిజానికి అప్పుడు నా ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 2.5 లక్షలు.. మరి, ఇప్పుడెంతో తెలుసా? 7 లక్షలు. అంటే.. ఏడాది కాలంలోనే సుమారు మూడు రెట్లు పెరిగిందన్నమాట! దీన్ని బట్టే అర్థమవుతుంది.. ఉద్యోగిగా కంటే ట్రావెలర్‌గానే నాకు ఎక్కువ గుర్తింపొచ్చిందని!’ అంటూ రాసుకొచ్చింది ఆకాంక్ష.

తపనే వ్యాపారమైంది!

ఇలా ఈ ఏడాది కాలంలోనే 19కి పైగా దేశాల్ని సందర్శించింది ఆకాంక్ష. తాను పోగేసుకున్న డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తూ.. వెళ్లిన చోట సాధారణ హోటల్స్‌లో బస చేస్తూ, అక్కడి సంస్థల్లో వలంటీర్‌గా పనిచేస్తూ.. సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, వియత్నాం.. వంటి అందమైన ప్రదేశాల్ని చుట్టేసింది. అయితే ఈ జ్ఞాపకాల్ని తనలోనే దాచుకోకుండా.. వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రారంభించిందామె. అంతేనా.. ఆయా ప్రదేశాలకు ఎలా వెళ్లాలి? అక్కడ చూడదగిన ప్రదేశాలేంటి? అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు.. ఇలా మొత్తంగా ఆ ప్రదేశాన్నే తన మాటల్లో పర్యటక ప్రియులకు అర్థమయ్యేలా అక్షరీకరించేది ఆకాంక్ష. ఇలా క్రమంగా ట్రావెల్‌ బ్లాగర్‌గా, డిజిటల్‌ క్రియేటర్‌గా మారిన ఆమె.. తన పర్యటన అనుభవాలతోనే ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్యను మూడింతలు పెంచుకుంది.. తన పాపులారిటీనీ రెట్టింపు చేసుకుంది. ఫలితంగా పలు ప్రముఖ బ్రాండ్లు ఆమెతో జట్టు కట్టడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం 30కి పైగా బ్రాండ్లతో కలిసి పనిచేస్తోన్న ఆకాంక్ష.. ‘ట్రావెల్‌ ఎ మోర్‌’ అనే సంస్థను సైతం స్థాపించింది.

కంఫర్ట్‌ జోన్‌ను వదిలితేనే..!

తన అభిరుచితోనే క్రమంగా వ్యాపారవేత్తగానూ మారిన ఆకాంక్ష.. ఈ వేదికగా తన ప్రయాణ అనుభవాల్ని పంచుకుంటూనే.. ఔత్సాహిక ట్రావెలర్స్‌కి మార్గనిర్దేశనం చేస్తోంది. మరోవైపు తన సంస్థ వేదికగా, నిపుణుల సహాయంతో పలు ట్రావెల్‌ కోర్సుల్ని కూడా అందిస్తోంది. ఇలా తన తపననే కెరీర్‌గా ఎంచుకొని రాణిస్తోన్న ఈ సోలో ట్రావెలర్‌.. ‘నా ప్రయాణ అనుభవాలతో.. మహిళల్ని వారి కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి తమ అభిరుచులపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలనుకుంటున్నా. మన మనసుకు నచ్చిన అంశాన్నే కెరీర్‌గా మార్చుకుంటే తప్పకుండా రాణించగలుగుతాం..’ అంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్