Niti Taylor: అప్పుడు బతికే అవకాశం 50 శాతమే ఉందన్నారు!

‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలో నటించి తన అందచందాలతో కుర్రకారు ‘దిల్‌’ దోచేసిన అందాల బొమ్మ నీతీ టేలర్.. గుర్తుందా?  తన స్వీట్‌ స్మైల్‌.. క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసిన ఈ చిన్నది తెలుగులో ముచ్చటగా మూడు సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌ బుల్లితెర పైనా....

Published : 11 Jan 2023 18:41 IST

(Photos: Instagram)

‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలో నటించి తన అందచందాలతో కుర్రకారు ‘దిల్‌’ దోచేసిన అందాల బొమ్మ నీతీ టేలర్.. గుర్తుందా?  తన స్వీట్‌ స్మైల్‌.. క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసిన ఈ చిన్నది తెలుగులో ముచ్చటగా మూడు సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌ బుల్లితెర పైనా మెరిసింది. అయితే తను నటన కంటే డ్యాన్సర్‌గానే ఎక్కువమందికి సుపరిచితం. ‘ఝలక్‌ దిక్లా జా’ అనే డ్యాన్స్‌ రియాల్టీ షోలో తన డ్యాన్సింగ్‌ నైపుణ్యాలతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెరపై ఎంతో హుషారుగా కనిపిస్తుంటుంది. ఇలాంటి అందాల భామ తన చిన్నతనంలో తీవ్ర గుండె సమస్యతో బాధపడిందట! ఒకానొక దశలో చావు అంచుల దాకా వెళ్లి బయటపడ్డానంటోన్న నీతి.. తాను సినిమాల్లోకి రావడం కూడా అనూహ్యంగా జరిగిపోయిందంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో విధిని జయించి వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ స్ఫూర్తి గాథ ఆమె మాటల్లోనే..!

నేను పుట్టిపెరిగిందంతా దిల్లీలోనే. నాకు డ్యాన్స్‌ అంటే చిన్నతనం నుంచే ప్రాణం. నా ఆసక్తి తెలుసుకున్న అమ్మానాన్నలు కూడా నన్ను ఈ దిశగానే ప్రోత్సహించారు. అయితే నా బాల్యం మాత్రం అందరు పిల్లల్లా ఆనందంగా సాగలేదు. పిల్లలతో కలిసి ఆడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడు చూసినా అమ్మానాన్నల రక్షణ కవచంలోనే ఉండేదాన్ని. నా గుండెలో రంధ్రం ఉండడమే ఇందుకు కారణం.

చావు అంచుల దాకా వెళ్లొచ్చా!

దీంతో ఎప్పుడు చూసినా ఆస్పత్రుల చుట్టూ తిరిగేదాన్ని. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బతుకుపై చిన్న ఆశ ఉండేది. అయితే కచ్చితంగా ఆపరేషన్‌ చేయాలని, అప్పటికీ బతికే అవకాశాలు 50-50 శాతం ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో అమ్మానాన్నల బాధ వర్ణనాతీతం! ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందోనన్న సందిగ్ధంలోనే నాకు ఆపరేషన్‌ చేయించడానికి సిద్ధపడ్డారు. అయితే ఆపరేషన్‌ పూర్తయ్యాక ఒకానొక దశలో చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చా. జీవితంలో నేను సాధించాల్సింది చాలా ఉందని అప్పుడు నాకు అర్థమైంది. ఇక పూర్తిగా కోలుకున్నాక అమ్మానాన్నలు ముంబయిలోని ఓ కాలేజీలో నన్ను చేర్పించారు. అదే సమయంలో బాలాజీ టెలీఫిలింస్‌ నుంచి నటిగా నాకు అవకాశం వచ్చింది. ముందు నమ్మలేకపోయా.. కానీ ఆ తర్వాత రియలైజ్‌ అయ్యా. నిజానికి టీచర్‌ కావాలన్నది నా కల. కానీ నేను నటిగా స్థిరపడాలని రాసుంది.. అందుకే అనూహ్యంగా నటినయ్యా.

హీ ఈజ్‌ సో స్వీట్!

నటిగా అవకాశం ఎంత సులభంగా వచ్చిందో.. పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో నిలదొక్కుకోవడం అంత కష్టమైంది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు భరించా.. సోషల్‌ మీడియాలోనూ నా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల గురించి నన్ను ఎంతోమంది ట్రోల్‌ చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగా. ఒక నటిగా, డ్యాన్సర్‌గా నేను రాణించడానికి నా పేరెంట్స్‌, మావారు, అత్తింటి వారి ప్రోత్సాహం ఎంతో ఉంది. మావారు పరీక్షిత్‌ బవా.. 2020లో మా వివాహం జరిగింది. తను ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా ఇద్దరం బిజీగా ఉన్నా.. కలిసి గడపడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకుంటాం. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. నేను మాత్రం వాటిని మరింతగా ఎంజాయ్‌ చేస్తున్నా. ముఖ్యంగా మా ఆయనతో కలిసి పార్టీలకు వెళ్లడం, తన కోసం వంట చేసి పెట్టడమంటే నాకు మహా ఇష్టం. ఇటీవలే ‘ఝలక్‌ దిక్లా జా’ పదో సీజన్‌ ముగియడంతో ప్రస్తుతం మావారితో సమయం గడుపుతున్నా. తిరిగి పనిలోకంటే.. అది కొన్నాళ్ల తర్వాతే..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్