మాకూ ఆరోగ్య సమస్యలెన్నో.. అయినా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం..!

తమకున్న ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఒకవేళ చెబితే ఎదుటివారు దీన్ని ఎలా స్వీకరిస్తారో, తమ గురించి నలుగురూ ఏమనుకుంటారోనన్న భావనతో తమ సమస్యను పెదవి దాటనివ్వరు. కానీ ఎవరేమనుకుంటారోనన్న విషయం పక్కన పెట్టి.. ఇతరుల్లో స్ఫూర్తి నింపడానికే.....

Published : 03 Nov 2022 12:45 IST

(Photos: Instagram)

తమకున్న ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఒకవేళ చెబితే ఎదుటివారు దీన్ని ఎలా స్వీకరిస్తారో, తమ గురించి నలుగురూ ఏమనుకుంటారోనన్న భావనతో తమ సమస్యను పెదవి దాటనివ్వరు. కానీ ఎవరేమనుకుంటారోనన్న విషయం పక్కన పెట్టి.. ఇతరుల్లో స్ఫూర్తి నింపడానికే కొందరు తమ అనారోగ్యాల గురించి ధైర్యంగా బయటికి వెల్లడిస్తుంటారు. వీరిలో కొందరు కథానాయికలు కూడా ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో తనకున్న మయోసైటిస్‌ సమస్య గురించి టాలీవుడ్‌ బ్యూటీ సమంత ఇటీవలే బయటపెట్టిన సంగతి తెలిసిందే! తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకుల్ని సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నానని, ఈ సమస్యనూ అదే తరహాలో జయిస్తానంటూ సామ్‌ పెట్టిన పోస్ట్ వైరలైంది. ఇలా తనొక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు తమకున్న ఆరోగ్య సమస్యల గురించి ధైర్యంగా వెల్లడించి.. ఎంతోమందిలో ప్రేరణ కలిగించారు. మరి, వాళ్లెవరు? వాళ్లెదుర్కొన్న అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం రండి..

ఎన్నో ఎదుర్కొన్నా.. ఇదో లెక్కా!

ప్రతికూల అంశాల్ని కూడా సానుకూలంగా స్వీకరిస్తూ.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో విజయం సాధిస్తోంది టాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ సమంత. ఇందుకు ఇటీవల తాను పోస్ట్‌ చేసిన ఓ ఫొటోనే నిదర్శనం! గత కొన్ని రోజులుగా తాను మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నానని, జీవితంలో అన్నీ సానుకూలంగా ఎదుర్కొన్నట్లే.. ఈ వ్యాధినీ పాజిటివిటీతో జయిస్తానంటూ పోస్ట్‌ పెట్టింది సామ్.

‘యశోద ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసి చాలా ఆనందపడ్డా. మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలు నాకు కొండంత మనోబలాన్నిస్తున్నాయి. జీవితం నాకు విసిరే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి నేను మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నా. నిజానికి దీన్నుంచి కోలుకున్నాక ఈ విషయం అందరితో పంచుకోవాలనుకున్నా. కానీ అందుకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ప్రతిసారీ మనం బలంగా ముందుకు వెళ్లలేమన్న విషయం నాకు నెమ్మదిగా అర్థమవుతోంది. ప్రతిదీ సానుకూలంగా స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. అలాగే ఈ సమస్యను కూడా పాజిటివిటీతో అధిగమిస్తా. నేను ఈ సమస్య నుంచి త్వరలోనే కోలుకుంటానని వైద్యులు భరోసా ఇచ్చారు. నా జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్ని ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎలాగోలా ఆ రోజులు గడిచిపోయాయి. మయోసైటిస్‌ నుంచి నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గర్లోనే ఉందనిపిస్తోంది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకుల్ని సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నట్లే.. ఈ సమస్యనూ జయిస్తా..’ అంది సామ్‌. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఎంతోమంది ప్రముఖులు, నెటిజన్లు.. ‘సమంత త్వరగా కోలుకోవాల’ని కామెంట్లు పెడుతున్నారు.

ఓవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా, మరోవైపు తాను నటిస్తోన్న యశోద చిత్రానికి డబ్బింగ్‌ చెబుతూ వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంది సమంత.


‘పీసీఓఎస్‌’ ఉంది.. కానీ!

పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నా.. దీని గురించి బయటికి చెప్పుకోవడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు. కానీ తాను మాత్రం ఇందుకు భిన్నం అంటోంది అందాల తార శృతీ హాసన్‌. గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతోన్న ఆమె.. ఈ క్రమంలో తాను పాటించే చిట్కాల గురించి వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటుంది శృతి. ఈ క్రమంలోనే మొన్నామధ్య తన వర్కవుట్‌ వీడియో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందామె.
‘గత కొన్నేళ్లుగా నేను పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ సమస్యలతో బాధపడుతున్నా. ఫలితంగా వివిధ హార్మోన్ల సమస్యలు నా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వీటి అసమతుల్యత కారణంగా జీవక్రియల్లో మార్పులు, కడుపుబ్బరం.. వంటి దుష్ప్రభావాలు ఎంతలా ఇబ్బంది పెడతాయో చాలామందికి అనుభవమే! అయితే ఇవన్నీ మన శరీరంలో సహజసిద్ధంగా జరిగే ప్రక్రియలే.. కానీ వీటిని అదుపులోకి తెచ్చుకోవడమనేది మన చేతుల్లో, చేతల్లోనే ఉంది. నేనైతే ఈ విషయంలో పక్కా ప్రణాళికను పాటిస్తున్నా. వేళకు ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర పోవడం, వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం.. ఈ మూడూ నా రొటీన్‌లో తప్పకుండా ఉండాల్సిందే! ఈ సమస్యలతో ప్రస్తుతం నా ఆరోగ్యం పర్‌ఫెక్ట్‌గా లేకపోవచ్చు.. కానీ నా మనసు సానుకూలంగానే స్పందిస్తోంది. ఎప్పుడూ ఫిట్‌గా, సంతోషంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్యాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు..’ అంటూ తన పోస్ట్‌తో పీసీఓఎస్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపిందీ చక్కనమ్మ.


ఐదేళ్లున్నప్పుడే ఆ సమస్య..!

చిన్న వయసులో ఎదురైన కొన్ని అనారోగ్యాలు దీర్ఘకాలం పాటు వేధిస్తుంటాయి. వాటిలో ఆస్తమా కూడా ఒకటి. తానూ ఐదేళ్ల వయసున్నప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది అందాల చందమామ కాజల్‌ అగర్వాల్.
‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు బ్రాంకియల్‌ ఆస్తమా నిర్ధారణ అయింది. ఆ సమయంలో నేను పాటించిన కఠినమైన ఆహార నియమాలేంటో ఇప్పటికీ నాకు గుర్తే! పాలు, పాల పదార్థాలు, చాక్లెట్స్‌.. వంటివి దూరం పెట్టాను. చిన్న వయసులో ఇలాంటి ఆహార నియమాలంటే ఎవరికైనా కష్టమే! కానీ తప్పలేదు. ఇక పెరిగి పెద్దయ్యే క్రమంలో.. ప్రతి శీతాకాలంలో ఎప్పుడైనా దుమ్ము, పొగ.. వంటివి పీల్చినప్పుడు సమస్య తాలూకు లక్షణాలు మళ్లీ బయటపడేవి. అప్పుడే ఇన్‌హేలర్స్‌ వాడడం మొదలుపెట్టా.. వీటివల్ల చాలా ఉపశమనం కలిగేది. ఇప్పటికీ ఓ ఇన్‌హేలర్‌ని నా బ్యాగ్‌లో ఉంచుకుంటా. అయితే చాలామంది ఇతరులు ఏమనుకుంటారోనని బహిరంగంగా వీటిని వాడడానికి భయపడుతున్నారు. కానీ ఇందుకు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు..’ అంది కాజల్.


ఒత్తిడే అందుకు కారణం!

అతి అనర్థదాయకమే అంటుంటారు. మన జీవనశైలిలో ప్రతి దానికీ వర్తిస్తుందిది. అంతేకాదు.. దీనివల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తనకూ ఈ విషయం అనుభవమే అంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ‘ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. ఈ విషయం నాకు కొన్నేళ్ల క్రితమే అర్థమైంది. నాకు చిన్నప్పట్నుంచీ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం అలవాటు. అయితే నా అతి వ్యాయామాలు, అధిక ఒత్తిడి కారణంగా ఒకానొక సమయంలో ఓ మానసిక సమస్యతో ఇబ్బంది పడ్డా. ఇక దీన్నుంచి బయటపడే క్రమంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకునేదాన్ని.. ఫ్రైడ్‌ ఫుడ్స్‌, బయటి ఆహార పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టా. అలాగే వ్యాయామాలూ మోతాదుకు మించకుండా జాగ్రత్తపడ్డా. ఈ కఠిన నియమాలే నేను ఈ అనారోగ్యాన్ని అధిగమించేందుకు దోహదం చేశాయి..’ అంటూ చెప్పుకొచ్చింది తమ్మూ.


అవెప్పుడూ సమస్య కాలేదు!

లోపలి అనారోగ్యం గురించి చెబితేనే తెలుస్తుంది.. అదే చర్మ సమస్యలు చూస్తేనే తెలిసిపోతాయి. అయితే చాలామంది తమకున్న చర్మ సమస్యల్ని ఎవరికీ కనిపించకుండా దాచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తాను ఇందుకు భిన్నం అంటోంది న్యాచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. Rosacea (ముఖంపై అక్కడక్కడా మొటిమల్లాంటి ఎర్రటి దద్దుర్లు ఏర్పడడం) అనే సమస్యతో బాధపడుతోన్న ఆమె.. ఈ పరిస్థితి తనకెప్పుడూ సమస్యగా అనిపించలేదంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
‘ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో ఈ సమస్య కనిపించకుండా ఉండడానికి చాలామంది నాకు మేకప్‌ వేసుకోమని సలహా ఇచ్చారు. కానీ అది నాకు నచ్చలేదు. ఎందుకంటే మేకప్‌ నన్ను నాలా కాకుండా మరోలా చూపించేది. అందుకే మేకప్‌ లేకుండా కనిపించడానికే ఇష్టపడేదాన్ని. క్రమంగా ప్రేక్షకులు నన్ను ఇలా చూడ్డానికే ఇష్టపడడం మొదలుపెట్టారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది..’ అందీ సొట్టబుగ్గల సుందరి.

ఇలా తనొక్కర్తే కాదు.. నివేతా థామస్‌, యామీ గౌతమ్.. వంటి తారలు కూడా తమకున్న కెరాటోసిస్‌ పిలారిస్‌ అనే చర్మ సమస్య గురించి నిర్భయంగా, నిర్మొహమాటంగా పంచుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు.

వీళ్లతో పాటు.. హంసా నందిని (రొమ్ము క్యాన్సర్‌), ఇలియానా (బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌), దీపికా పదుకొణె (డిప్రెషన్‌), సోనమ్‌ కపూర్‌ (మధుమేహం, పీసీఓఎస్‌), సోహా అలీ ఖాన్‌ (పీసీఓఎస్‌).. వంటి ముద్దుగుమ్మలు కూడా తమ అనారోగ్యాల గురించి బహిరంగంగా పంచుకొని.. ఎంతోమంది బాధితుల్లో ప్రేరణ కలిగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్