Aditi Rao Hydari: ఆ అలవాటును అస్సలు మానలేకపోతున్నా!

కొంతమందిలో ఎంత మేకప్‌ వేసుకున్నా కృత్రిమ కళే కనిపిస్తుంది. అదే మరికొంతమంది మేకప్‌ లేకపోయినా కళగా, ఫెయిర్‌గా మెరిసిపోతుంటారు. బాలీవుడ్ అందాల తార అదితీ రావ్‌ హైదరీ కూడా ఈ కోవకే....

Published : 20 Mar 2023 12:50 IST

(Photos: Instagram)

కొంతమందిలో ఎంత మేకప్‌ వేసుకున్నా కృత్రిమ కళే కనిపిస్తుంది. అదే మరికొంతమంది మేకప్‌ లేకపోయినా కళగా, ఫెయిర్‌గా మెరిసిపోతుంటారు. బాలీవుడ్ అందాల తార అదితీ రావ్‌ హైదరీ కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ అపురూప లావణ్యం తాను పాటించే కొన్ని అలవాట్లు, జీవనశైలి కారణంగానే వచ్చిందంటోందీ చక్కనమ్మ. ఈ క్రమంలోనే తన సహజసిద్ధమైన అందం వెనకున్న కొన్ని రహస్యాలను ఇటీవలే ఓ సందర్భంలో బయటపెట్టింది అదితి. మరి, ఆ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సబ్బు వాడను!

‘మీరు మేకప్‌ వేసుకోకపోయినా ఇంత ఫెయిర్‌గా, అందంగా కనిపిస్తారు.. ఇదెలా సాధ్యం?’ అని అడుగుతుంటారు చాలామంది. వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలు నా బ్యూటీ రొటీన్‌లో చేర్చుకోవడమే ఇందుకు కారణం. అయితే సీజన్‌ను బట్టి ఇవి మారుతుంటాయి. ఇక ముఖం శుభ్రం చేసుకోవడానికి నేను సబ్బు అస్సలు వాడను. ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన పౌడర్లు, కషాయాలు ఉపయోగిస్తా. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత పచ్చి పాలు, ఓట్స్‌తో తయారుచేసిన మిశ్రమంతో ముఖం శుభ్రం చేసుకోవడం నాకు అలవాటు. ఆపై టోనర్‌ రాసుకోవడం మర్చిపోను. ఇక ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా సన్‌స్క్రీన్‌ తప్పకుండా అప్లై చేసుకుంటా. ఇక పడుకునే ముందు, మేకప్‌ తీసేశాక.. గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేసుకొని.. ఐ క్రీమ్‌, నైట్‌ క్రీమ్‌ రాసుకుంటా.

మేకప్‌ ప్రభావం పడకుండా..!

నా వృత్తిలో భాగంగా మేకప్‌ వేసుకోవడం తప్పనిసరి. ఒక్కోసారి రోజంతా మేకప్‌లోనే ఉండాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు మేకప్‌ ప్రభావం చర్మంపై పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా. పడుకునే ముందు మేకప్‌ తొలగించడం, షూటింగ్‌ లేని సమయాల్లో మేకప్‌కు దూరంగా ఉండడం, మేకప్‌లోని రసాయనాల కారణంగా చర్మం తేమను కోల్పోకుండా నీళ్లు ఎక్కువగా తాగడం, పండ్లు-కాయగూరలు ఆహారంలో భాగం చేసుకోవడం.. వంటివన్నీ ఇందులో భాగమే! నా బ్యూటీ రొటీన్‌లో భాగంగా నేను ఫేస్‌ ఆయిల్స్‌ కూడా ఎక్కువగా వాడుతుంటా. ఇవి చర్మానికి తేమనందించడమే కాదు.. మేకప్‌ వల్ల చర్మం పొడిబారకుండా, వయసు పైబడిన ఛాయలు కనిపించకుండా చేస్తుంది.

బుల్లెట్‌ కాఫీ.. ఉండాల్సిందే!

బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో ఏది ఉన్నా, లేకపోయినా.. బుల్లెట్‌ కాఫీ మాత్రం ఉండాల్సిందే! అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా ఓ కప్పు బుల్లెట్‌ కాఫీ తాగకుండా ఉండలేను. చాలామంది జీవనశైలికి సంబంధించిన అలవాట్లను పనిదినాల్లో పాటించినంత శ్రద్ధగా వారాంతాల్లో పాటించరు. నేనూ అంతే! షూటింగ్‌ ఉన్నప్పుడు నా రోజువారీ అలవాట్లన్నీ చక్కగా పాటిస్తుంటా. విటమిన్‌ ‘సి’ సప్లిమెంట్లు తప్పకుండా వేసుకుంటా. షూటింగ్‌కు వెళ్లేటప్పుడూ వెంటే ఉంచుకుంటా. అదే షూటింగ్‌ లేనప్పుడు సప్లిమెంట్స్‌ వేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. కానీ ఈ మతిమరుపుకి, బద్ధకానికి స్వస్తి పలికి షూటింగ్‌ లేనప్పుడూ చక్కటి రొటీన్‌ను పాటించాలన్న నియమం పెట్టుకున్నా.

రోజుకో అరగంట..!

అందానికైనా, ఆరోగ్యానికైనా వ్యాయామం తప్పనిసరి. అందుకే క్రమం తప్పకుండా రోజుకు అరగంట సమయం వ్యాయామానికి కేటాయిస్తా. వారంలో రోజు విడిచి రోజు మూడు రోజులు సర్క్యూట్‌ ట్రైనింగ్‌, మరో మూడు రోజులు యోగా చేస్తా. షూటింగ్‌ బిజీతో ఈ సమయం కూడా దొరక్కపోతే కనీసం పది నిమిషాలైనా వర్కవుట్‌ చేస్తా. నాకో దురలవాటుంది.. అదేంటంటే.. ఉదయం లేవగానే ఫోన్‌ చూడడం. రాత్రి నిద్రపోయే ముందు ఫ్లైట్‌ మోడ్‌లోనే పెట్టినా.. నిద్ర లేవగానే చెక్‌ చేసుకుంటా. అయితే ఈ అలవాటు మానాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తున్నా.. కానీ మానలేకపోతున్నా. ఎలాగైనా త్వరలోనే దీనికి స్వస్తి పలికి.. మెడిటేషన్‌ను నా వర్కవుట్‌ రొటీన్‌లో చేర్చుకుంటా.

ఒత్తైన కనుబొమ్మల సీక్రెట్‌ అదే!

కనుబొమ్మలు ఒత్తుగా ఉంటేనే ముఖంలో కళ ఉట్టిపడుతుంది. నా నగుమోముకూ ఐబ్రోసే కీలకం! చాలామంది అంటుంటారు.. ‘మీ కనుబొమ్మలు ఒత్తుగా ఉంటాయి.. వాటితోనే మీ అందం రెట్టింపైంది..’ అని! నిజానికి నా చిన్నతనంలో ఐబ్రోస్‌ని ప్లక్కర్‌తో పదే పదే పీక్కోవడం చూసి మా అమ్మ వారించేది. కానీ కొన్నాళ్లకు అవి పెరుగుతూ.. ఇలా ఒత్తుగా వచ్చాయి. కనుబొమ్మల్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఓ ఐబ్రో కిట్‌ ఎప్పుడూ నా వెంటే ఉంటుంది.

మసాజ్‌తో మెరుపు!

చాలామంది తమ జుట్టుతో వివిధ రకాల హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నిస్తుంటారు. కానీ నాకు వదులుగా ఉంచుకోవడం, పోనీ వేసుకోవడమంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆయా హెయిర్‌స్టైల్స్‌ వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం, తలస్నానం చేశాక మొరాకన్‌ ఆయిల్‌ రాసుకోవడం నా హెయిర్‌కేర్‌ రొటీన్‌లో ఓ భాగం. మరో విషయం ఏంటంటే.. రోజూ ఉదయాన్నే ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం నాకు అలవాటు. సహజసిద్ధంగా తయారుచేసిన నూనెను నోట్లోకి తీసుకొని పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడతాయి.. మెరుస్తాయి కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్