పెంపుడు తల్లి వేధింపులు.. విడిచిపెట్టి వెళ్లిపోవాలనుంది..!

నాకు 22 ఏళ్లు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పెంపుడు తల్లి సంరక్షణలో పెరిగాను. తనే నన్ను చదివించింది. అయితే మా వ్యక్తిత్వాలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. దానికి తోడు ఆమె చీటికిమాటికి నన్ను వేధించేది. అన్ని విషయాల్లోనూ తను చెప్పినట్లే వినాలని ఆంక్షలు విధించేది....

Updated : 19 Mar 2024 21:15 IST

నాకు 22 ఏళ్లు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పెంపుడు తల్లి సంరక్షణలో పెరిగాను. తనే నన్ను చదివించింది. అయితే మా వ్యక్తిత్వాలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. దానికి తోడు ఆమె చీటికిమాటికి నన్ను వేధించేది. అన్ని విషయాల్లోనూ తను చెప్పినట్లే వినాలని ఆంక్షలు విధించేది. తల్లి అనే భావనతో ఇన్ని రోజులు భరించాను. కానీ ఈ మధ్య తన వేధింపులు తార స్థాయికి చేరాయి. అది నా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. నాకు ఆమె నుంచి దూరంగా వెళ్లి సొంతంగా జీవించాలనిపిస్తోంది. కానీ, ఇన్ని రోజులూ పెంచిన తల్లిని వృద్ధాప్యంలో వదిలిపెట్టడం మంచిది కాదేమోనన్న భావన వేధిస్తోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? నేను తనను విడిచిపెట్టి దూరంగా వెళ్లాలనుకోవడం సరైనదేనా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ ప్రశ్న విన్న తర్వాత ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతోంది. మీ ఇద్దరి వ్యక్తిత్వాలు వేరని, చిన్నప్పట్నుంచీ ఆమె మిమ్మల్ని వేధిస్తోందని చెబుతున్నారు. అయితే అవి ఎలాంటి వేధింపులో మీరు పేర్కొనలేదు. ఈ క్రమంలో- ఒకవైపు ఆమె నుంచి వేధింపులు ఎదుర్కొంటూనే మరోవైపు ఆమెపై కృతజ్ఞతాభావం చూపడం ఒకరకంగా అభినందనీయమే. అయితే మిమ్మల్ని చిన్నప్పట్నుంచి పెంచారు కాబట్టి.. అది వేధించడానికి కారణం కాకూడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా సరే.. వేధించడం అనేది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోండి. మీ మొత్తం ప్రశ్నలో ఒక నిర్ణయానికి రాలేక ఇబ్బంది పడుతున్నట్టుగా అర్థమవుతోంది. మీరు ఒక్క అడుగు వెనక్కి వేయడం వల్ల మీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టుగా భావించాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు స్వీయ సంరక్షణ కిందే పరిగణించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో- ఒకసారి చర్చల ద్వారా ఇప్పుడైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చేమో ఆలోచించండి. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో ఆమె వల్ల మీరు పడుతున్న ఇబ్బందుల గురించి చెబుతూనే తన సమస్యలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి వాదనలకు తావివ్వకండి. ఒకవేళ ఆమె సానుకూలంగా స్పందిస్తే ఇకనుంచైనా మీ బంధంలో ఆరోగ్యకరమైన పరిధులు గీసుకునే ప్రయత్నం చేయండి. ఫలితంగా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో- ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. వయసు పైబడినవారిలో అభద్రతాభావం లేదా ఇతర కారణాల వల్ల కూడా ఒక్కోసారి వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ అమ్మగారికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌/థెరపీ ఇప్పించే ప్రయత్నం చేయండి. దీనివల్ల సమస్యకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు పరిష్కారాన్ని కనుగొనే అవకాశం కలుగుతుంది. ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో- ఒకవేళ మీ ఆలోచనలు మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయనిపిస్తే మీరు కూడా నిపుణులను సంప్రదించడానికి ఏమాత్రం సంకోచించకండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్