Neerja Bhanot: చస్తాను కానీ.. పారిపోను

‘అమ్మా.. ఆపదలో ఉన్నవాళ్లని హీరో ధైర్యంగా కాపాడతాడు కదా! ఆ పరిస్థితి వస్తే నేనేం చేయను?’ అని అడిగిందో అమ్మాయి.

Published : 04 Mar 2023 00:17 IST

‘అమ్మా.. ఆపదలో ఉన్నవాళ్లని హీరో ధైర్యంగా కాపాడతాడు కదా! ఆ పరిస్థితి వస్తే నేనేం చేయను?’ అని అడిగిందో అమ్మాయి. దానికి వాళ్లమ్మ ‘అలాంటిదేదైనా జరిగితే ముందు పారిపో’మన్న సలహానిచ్చింది. కోపగించుకున్న ఆ అమ్మాయి ‘నీలాగే అందరమ్మలూ ఆలోచిస్తే దేశం పరిస్థితేంటి? చస్తాను కానీ పారిపోను’ అని చెప్పింది. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నిజంగానే పోరాడింది.

నీర్జా బానోత్‌.. ఇద్దరు అబ్బాయిల తర్వాత పుట్టింది. దీంతో ఇంట్లో గారాబం ఎక్కువే! ఈమెది చండీగఢ్‌. విద్యావంతురాలు పైగా అందాల భరిణ. ఎన్నో సంస్థలకు మోడల్‌గా చేసింది. అలాంటి అమ్మాయిని మహారాణిలా చూసుకునే వాడికే ఇవ్వాలనుకున్నారామె అమ్మానాన్న. ఏరికోరి షార్జాలో చేసే మెరైన్‌ ఇంజినీర్‌కిచ్చి పెళ్లి చేశారు. 19 ఏళ్ల నీర్జా.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెడితే.. తిట్లు, దెబ్బలు, తిండి పెట్టకుండా మాడ్చడం వంటివి ఎదురయ్యాయి. తట్టుకోలేక కొన్ని నెలలకే పుట్టింటికి చేరింది. అలాగని జీవితం వృథా అయ్యిందని కూర్చోలేదామె. తిరిగి కెరియర్‌ మీద దృష్టిపెట్టి, ఫ్లైట్‌ అటెండెంట్‌ అయ్యింది. త్వరలోనే సీనియర్‌ స్థాయికి ఎదిగింది. అది 1986, సెప్టెంబరు 5 ముంబయి నుంచి అమెరికా వెళ్లే విమానంలో విధులు నిర్వహిస్తోంది. మధ్యలో కరాచీలో విమానం ఆగినప్పుడు తీవ్రవాదులు దాన్ని హైజాక్‌ చేశారు. 380 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఉన్నారందులో. ఆగంతుకుల లక్ష్యం.. అమెరికన్లు. వెంటనే స్పందించిన నీర్జా అమెరికన్‌ పైలట్లకు సమాచారమిచ్చి తప్పించుకునేలా చూసింది. ప్రయాణికుల పాస్‌పోర్ట్‌లను దాచేసింది. అధికారులను భయపెట్టడానికి తీవ్రవాదులు ఒకరిని చంపి, బయటకు విసిరేశారు. ఆ పరిస్థితుల్లోనూ ప్రయాణికుల అవసరాలను చూసుకుంటూ వారిలో ధైర్యం నింపింది. 17 గంటలయ్యాక ఉగ్రవాదుల ఓపిక తగ్గి ప్రయాణికులందరినీ చంపాలనుకున్నప్పుడు ధైర్యం చేసి తన చాకచక్యంతో వారిని వేరే మార్గం ద్వారా పంపింది. 360 మంది ప్రాణాలు కాపాడింది. ఈ క్రమంలో తను ప్రాణాలొదిలి ‘హీరోయిన్‌ ఆఫ్‌ హైజాక్‌’గా నిలిచింది. పుట్టినరోజుకు రెండ్రోజుల ముందు లోకాన్ని వీడిన ఆమె అంతకు ముందు ఏడాది ‘నాన్నా.. నిన్ను గర్వపడేలా చేస్తా’నని మాటిచ్చింది. చెప్పినట్టుగానే గర్వించేలా చేసింది. ఆమె ధైర్యసాహసాలకు ఆమె నాన్నే కాదు.. దేశప్రజలూ జోహార్లు పలికారు.


యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అసువులు బాసిన వీరులకు ఇచ్చే అశోక చక్రను ప్రభుత్వం ఈమెకు ప్రకటించింది. దాన్ని అందుకున్న తొలి మహిళగా నిలిచింది.. నీర్జా బానోత్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్