Published : 16/02/2023 00:58 IST

తుర్కియేలో మన బినా!

తుర్కియే భారీ భూకంపంలో శిధిలాల మధ్య చిక్కుకొని గాయాలపాలైన వారికి ఆమె వైద్య సేవలందిస్తున్నారు. ప్రేమతో చేస్తున్న ఆ సేవలు చూసి ఓ మహిళ ఆమెను ముద్దాడుతున్న ఫొటో ఒకటి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. చికిత్సతో పాటు చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతోన్న ఆవిడకు లక్షలమంది శభాష్‌ చెబుతున్నారు. ఆమె మరెవరో కాదు.. మన ఆడపడుచు.. డాక్టర్‌ మేజర్‌ బినా తివారీ.

దేెహ్రాదూన్‌కు చెందిన బినా తివారీ తాత ఆర్మీలో సుబేదారు. తండ్రి సైనికుడు. బాల్యం నుంచి వీరిద్దరినీ చూస్తూ పెరిగిన బినాకు దేశసేవలో భాగం అవ్వాలనిపించింది. వారి నుంచి స్ఫూర్తి పొందిన ఈమె వాళ్లకు వారసురాలు కావాలనుకున్నారు. దిల్లీ ఆర్మీ కాలేజీ మెడికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి, భారతసైన్యంలో వైద్యురాలిగా శిక్షణ తీసుకున్నారు. మొదటిసారిగా అసోంలో విధులు నిర్వహించారు.

మేమున్నామనీ... తుర్కియే భూకంప బాధితులకు సేవలందించడానికి గతవారం భారత్‌ తరఫున 14 మంది వైద్యులు, 86 మంది పారామెడికల్‌ సభ్యుల బృందం వెళ్లింది. ఇండియన్‌ ఆర్మీ అక్కడ తాత్కాలికంగా ఆసుపత్రి ప్రారంభించి ‘ఆపరేషన్‌ దోస్త్‌’ పేరుతో వైద్య సేవలందిస్తోంది. ఈ బృందంలో ఒకే ఒక మహిళ డాక్టర్‌ బినా తివారి. గాయపడిన, శిథిలాల నుంచి బయటపడిన వారికి చికిత్స చేస్తున్నారీమె. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలకు బినా ధైర్యంతో పాటు  ప్రేమనీ పంచుతున్నారు. అదిచూసి తమ ప్రాణాలను నిలపడానికి వచ్చిన దేవతగా అక్కడివారంతా ఆమెను భావిస్తున్నారు. అలా ఒక వృద్ధురాలు తన అభిమానాన్ని ముద్దిచ్చి ప్రకటించడం అక్కడే ఉన్న ఏడీజీ కంటపడింది. ఆ ఆఫీసర్‌ ఈ సన్నివేశాన్ని ఫొటో తీసి తన ట్విటర్‌లో పొందుపరిచారు. ఇంకోదానిలో చిన్నారికి ధైర్యమిస్తూ కనిపించారు. మానవత్వానికి ఉదాహరణ అంటూ ‘వియ్‌ కేర్‌’ శీర్షికతో ఆయన పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలను లక్షలాదిమంది చూడటమే కాదు.. ఆమె సేవలను అభినందిస్తున్నారు కూడా. మనమూ శభాష్‌ చెబుదామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి