Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్‌ చేసింది.. చివరికి ఏమైందంటే?!

ప్రేమించిన వారికి క్షణం దూరంగా ఉండాలన్నా మనసొప్పదు. అందుకే అప్పుడప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉంటాం. అయితే ఒక్కోసారి అవతలి వారు బిజీగా ఉండడం వల్ల మనం ఫోన్‌ చేసినా ఎత్తే, మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు.. ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందసార్లు ఫోన్‌ చేసింది.

Published : 29 Apr 2024 13:20 IST

ప్రేమించిన వారికి క్షణం దూరంగా ఉండాలన్నా మనసొప్పదు. అందుకే అప్పుడప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉంటాం. అయితే ఒక్కోసారి అవతలి వారు బిజీగా ఉండడం వల్ల మనం ఫోన్‌ చేసినా ఎత్తే, మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు.. ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందసార్లు ఫోన్‌ చేసింది. అయినా అతడు స్పందించకపోయేసరికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడమే కాదు.. ఆత్మహత్యాప్రయత్నం కూడా చేసింది. ఇలా ఆమె మానసిక స్థితిని చూసి షాకైన పోలీసులు వెంటనే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లకు ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. మరి, అదేంటో మీరే చదివేయండి!

చైనాలోని ఓ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల Xiayou స్కూలింగ్‌ పూర్తిచేసుకొని పైచదువుల కోసం నగరానికి వచ్చింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ఓ అబ్బాయితో ప్రేమలో పడిందామె. కొంతకాలంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అదెంతలా అంటే.. Xiayou తన బాయ్‌ఫ్రెండ్‌ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా! ఈ క్రమంలోనే మానసికంగా, ఎమోషనల్‌గా అతడిపై పూర్తిగా ఆధారపడే స్థితికి చేరుకుందామె.

వందసార్లు ఫోన్‌ చేసినా..!

ప్రతి క్షణం తన బాయ్‌ఫ్రెండ్‌ గురించే ఆలోచించడం, అతడేం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆరాటపడడం, అతడికి  తరచూ కాల్స్, మెసేజెస్ చేయడం.. ఇలా పూర్తిగా అతడి ధ్యాసలోనే లీనమైంది Xiayou. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ రోజు తన బాయ్‌ఫ్రెండ్‌కి వరుస సందేశాలు పంపించడం మొదలుపెట్టిందామె. వుయ్‌చాట్‌ కెమెరా ఆన్‌ చేయాల్సిందిగా పదే పదే అతడిని కోరింది. అందుకు అతడు స్పందించకపోవడంతో ఒకట్రెండు సార్లు కాల్‌ చేసి ఊరుకోలేదామె. వరుసగా వందసార్లు ఆపకుండా ఫోన్‌ చేసింది. అప్పటికీ అతడు కాల్‌ ఎత్తకపోయేసరికి తనలో కోపం, యాంగ్జైటీ, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ పగలగొట్టిన ఆమె.. బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం కూడా చేసింది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె మానసిక స్థితిని గుర్తించిన అతడు.. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశాడు. దీంతో వాళ్లొచ్చి ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు.. ఆమె ‘లవ్‌ బ్రెయిన్‌ డిజార్డర్‌’ బారిన పడినట్లుగా గుర్తించారు.

అసలేంటీ ‘లవ్ బ్రెయిన్ డిజార్డర్’?

యాంగ్జైటీ, డిప్రెషన్‌, ఒత్తిడి, మూడ్‌ స్వింగ్స్‌.. ఇలాంటి మానసిక సమస్యలన్నీ తీవ్ర స్థాయిలో ఉన్న వారు ‘లవ్‌ బ్రెయిన్‌ డిజార్డర్‌’ బారిన పడే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. అందులోనూ అనారోగ్యపూరిత అనుబంధాల్లో ఉన్న వారిలోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుందంటున్నారు. అంటే.. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణకు నోచుకోలేకపోవడం.. వీటి కోసం ఇతరులపై ఆధారపడడం, వీళ్లు కోరుకున్నప్పుడు అవతలి వారు ఆ ప్రేమ, కేరింగ్‌ను అందించకపోవడం వల్ల ఇలా ఒత్తిడికి గురవుతారట! చాలామందిలో ఈ తరహా సమస్య ఉన్నప్పటికీ.. భావోద్వేగాల్ని అదుపు చేసుకుంటూ.. తమ అనుబంధాన్ని బ్యాలన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తారని నిపుణులు చెబుతున్నారు. అదే ఈ ఎమోషన్‌ స్థాయులు మితిమీరితే గ్జియావోయు Xiayouలా అత్యవసర చికిత్స అవసరం కావచ్చంటున్నారు.


థెరపీ అవసరం!

⚛ పిల్లలు పెరిగి పెద్దయ్యే క్రమంలో తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకపోవడం వల్ల వారిలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. ఇదే వారు యుక్తవయసులో ‘లవ్‌ బ్రెయిన్ డిజార్డర్’ బారిన పడేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేయకుండా వారిని ప్రేమతో పెంచాలంటున్నారు.

⚛ ప్రతి ఒక్కరిలో భావోద్వేగాలు సహజం. వీటిని అదుపు చేసుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఇందుకోసం స్వీయ ప్రేమ, అన్ని విషయాల్లో మనస్ఫూర్తిగా మనల్ని మనం అంగీకరించడం ముఖ్యమంటున్నారు. ఇదే పరోక్షంగా భాగస్వామితో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని కొనసాగించేందుకు దోహదం చేస్తుందంటున్నారు.

⚛ అయితే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ తరహా మానసిక సమస్య తలెత్తచ్చట! కాబట్టి వైద్యులు చికిత్స అందించే ముందు సదరు వ్యక్తి ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యాలు, అనుబంధానికి సంబంధించిన సమాచారంతో పాటు కుటుంబ చరిత్ర గురించి కూడా తెలుసుకొని సంబంధిత చికిత్స అందిస్తారు.

⚛ సమస్య తీవ్రతను బట్టి వైద్యులు మందులతో పాటు, వ్యక్తిగత/బృంద థెరపీ కూడా అందిస్తారు. వారి మానసిక స్థితిని బట్టి బిహేవియరల్, డయలక్టికల్‌, టాక్‌ థెరపీ వంటివి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

⚛ లవ్‌ బ్రెయిన్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే.. కుటుంబ సభ్యుల సపోర్ట్‌, కేరింగ్‌ కూడా ముఖ్యం. కాబట్టి సదరు వ్యక్తి తన మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కావాల్సిన ప్రేమ, ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్