Sextortion: నవ్విస్తారు.. కవ్విస్తారు.. నట్టేట ముంచుతారు.. జాగ్రత్త!

మేఘన తనకు నచ్చిన వరుడిని వెతుక్కోవడానికి ఓ డేటింగ్ యాప్లో రిజిస్టర్‌ అయింది. ఈ క్రమంలోనే కొంతమంది అబ్బాయిలతో పరిచయాలు పెంచుకుంది. అయితే ఓ రోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ మధ్యే మీకు పరిచయమైన శ్రీకాంత్‌...

Published : 27 May 2023 17:36 IST

మేఘన తనకు నచ్చిన వరుడిని వెతుక్కోవడానికి ఓ డేటింగ్ యాప్లో రిజిస్టర్‌ అయింది. ఈ క్రమంలోనే కొంతమంది అబ్బాయిలతో పరిచయాలు పెంచుకుంది. అయితే ఓ రోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ మధ్యే మీకు పరిచయమైన శ్రీకాంత్‌ ఫ్రెండ్‌నంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడా వ్యక్తి. ఇలా స్నేహంగా మొదలైన ఆ పరిచయం వీడియో కాల్‌, వ్యక్తిగత ఫొటోలు పంచుకునే దాకా వెళ్లింది. కట్‌ చేస్తే.. తాను పంపిన ఫొటోలతో అదే వ్యక్తి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇక చేసేది లేక లక్షల రూపాయలు ఆ అపరిచిత వ్యక్తికి సమర్పించుకోవాల్సి వచ్చిందామె.

ఇలా డేటింగ్‌ యాప్స్‌లో అమ్మాయిలకు వల వేస్తూ.. అమ్మాయిలకు సంబంధించిన అసురక్షిత సోషల్‌ మీడియా ఖాతాల్ని హ్యాక్‌ చేస్తూ.. వీటిని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కొందరు సైబర్‌ నేరగాళ్లు. వీడియో కాల్స్‌లో తియ్యటి మాటలతో కవ్వించి.. వారి వ్యక్తిగత ఫొటోలు సేకరించడం, సోషల్‌ మీడియా ఖాతాల నుంచి దొంగిలించిన ఫొటోల్ని మార్ఫింగ్‌ చేయడం.. అడిగిన డబ్బు చెల్లించకపోయినా, అదనపు వ్యక్తిగత ఫొటోలు/సమాచారం పంచుకోవడానికి నిరాకరించినా.. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియా ద్వారా బాధితుల స్నేహితులకు, తెలిసినవారికి పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ తరహా బ్లాక్‌మెయిల్‌నే ‘సెక్స్‌టార్షన్’ (Sextortion) అంటారు. కేవలం మగవాళ్లే కాకుండా ఎంతోమంది అమ్మాయిలు, మహిళలు సైతం ఇలాంటి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ కంటే.. ముందు జాగ్రత్తగా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈ ఊబిలో పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

అన్ని దారులూ మూసేస్తారు!

ఓ అబ్బాయి తమతో ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడినా, తమ అందాన్ని పొగిడినా, విలువైన కానుకలిచ్చినా.. ఇట్టే పడిపోతారు కొందరమ్మాయిలు. అలాంటి అమాయకపు యువతుల్నే లక్ష్యంగా చేసుకొని ‘సెక్స్‌టార్షన్’ వలలో పడేస్తున్నారు సైబర్‌ మోసగాళ్లు. తొలుత అమ్మాయిలకు ఫోన్‌ కాల్‌ లేదా వీడియో కాల్‌ చేసి.. దగ్గరి స్నేహితుల్లా/ఆత్మీయుల్లా మాట కలుపుతారు. ఈ క్రమంలోనే వాళ్ల బలహీనతలేంటో పసిగట్టి.. వాటిని లక్ష్యంగా చేసుకొని ప్రేమగా, కేరింగ్‌గా మాట్లాడడం మొదలుపెడతారు. ‘అబ్బ.. ఈ అబ్బాయి ఎంత మంచోడో!’ అనుకునేలా చేస్తారు. దీంతో అమ్మాయి ఓ అడుగు ముందుకేసి తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు బయటపెడుతుంది. ఆపై నేరగాళ్లు ఇంకాస్త అడ్వాన్స్ అయి.. రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. ఇద్దరూ లైంగిక పరమైన అంశాల గురించి మాట్లాడుకోవడం, అర్ధనగ్న/నగ్న ఫొటోలు పంపుకోవడం దాకా విషయం వెళ్తుంది. ఇలా మానసికంగా వాళ్లను వశపరచుకున్నాక అసలు కథ మొదలవుతుంది.

అమ్మాయిని మోసం చేయడానికి తమకు కావాల్సిన సమాచారం/ఫొటోలు వచ్చాయనుకున్నాక.. మోసగాళ్ల మాట, ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అప్పటిదాకా ప్రేమ ఒలకబోసిన వారు కాస్తా.. కటువుగా మాట్లాడేసరికి అసలు విషయం అర్థం చేసుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి! ఈ క్రమంలో వాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా లేదంటే అదనపు వ్యక్తిగత ఫొటోలు పంపించకపోయినా.. మనం పంపిన ఫొటోల్ని మన సోషల్‌ మీడియా అకౌంట్‌తో అనుసంధానమై ఉన్న కాంటాక్ట్స్‌, వాట్సప్‌ ఖాతాలకు ఫార్వార్డ్‌ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. దీంతో వాళ్లు ఆడించినట్లు ఆడడం తప్ప మన చేతిలో ఏమీ ఉండదు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అయితే ఈ ‘సెక్స్‌టార్షన్‌’ వలలో చిక్కుకొని.. ఇటు డబ్బు, అటు పరువు పోగొట్టుకోకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో రియలైజ్ అయితే ఇలాంటి సైబర్‌ మోసాలకూ అడ్డుకట్ట వేయచ్చంటున్నారు. అదెలాగంటే..!

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల్లో కొన్నిసార్లు కొన్ని ఆన్‌లైన్‌ లింకులు అనుసంధానమై ఉంటాయి. అవేంటో చూడాలన్న ఆతృతతో వాటిని ఓపెన్‌ చేస్తే కోరి సమస్యను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఇలాంటి లింకులతో కూడిన సోషల్‌ మీడియా/వాట్సప్‌ సందేశాల్ని ఓపెన్‌ చేయకుండానే తొలగించడం మంచిది.

అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినా.. దాన్ని ఎత్తకూడదు. అంతగా సదరు వ్యక్తి ఎవరా అని తెలుసుకోవాలంటే.. కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ సహాయం తీసుకోవడం ఉత్తమం. తెలియని వారైతే వదిలేయచ్చు.. ఒకవేళ తెలిసిన వారైతే తిరిగి కాల్‌ చేయచ్చు.

 .APK, .DMZ ఎక్స్‌టెన్షన్‌ ఫైల్స్‌ ఉన్న యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. అలాగే అపరిచిత సోర్సుల నుంచి కాకుండా.. యాప్‌ స్టోర్‌, ప్లే స్టోర్‌ నుంచే మనకు కావాల్సిన యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఓటీపీ, పాస్‌వర్డ్స్‌ ఇతరులతో పంచుకోకూడదు. అలాగే సోషల్‌ మీడియా, ఈ-మెయిల్స్‌.. వంటి అకౌంట్లకు కఠినమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి.

ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే ‘క్యూ-ఆర్‌’ కోడ్‌ స్కాన్‌ చేయడం తప్పనిసరిగా మారింది. ఇదీ సరికాదంటున్నారు నిపుణులు. ప్రామాణికమైన సంస్థలు, తెలిసిన వ్యక్తులు మినహా.. అపరిచితుల ఫోన్లో క్యూ-ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులెదురయ్యే ప్రమాదమూ లేకపోలేదు.

తెలిసిన వ్యక్తులే మీ సోషల్‌ మీడియా అకౌంట్‌ చూసేలా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి.

ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్ల ద్వారానే ‘సెక్స్‌టార్షన్‌’ కేసులు పెరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. ఒకవేళ మీరు ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటే.. నేరుగా కలిసి మాట్లాడడమే సురక్షితం అని చెబుతున్నారు.

అవతలి వ్యక్తి భర్తైనా, బాయ్‌ఫ్రెండ్ అయినా.. ఆన్‌లైన్‌లో మీ వ్యక్తిగత వీడియోలు/ఇతర సమాచారం పంచుకోకపోవడమే మంచిది.

ఒకవేళ అపరిచిత వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా మీ సంభాషణను ‘Hidden Mode’లో పెట్టుకుంటే.. ప్రమాదకర పరిస్థితుల్లో ఇది మీకు సాక్ష్యాధారంగా ఉపయోగపడుతుంది.


భయపడుతూ కూర్చోవద్దు!

అయితే కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మోసపోవాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో భయపడుతూ కూర్చుంటే అవతలి వాళ్లు మరింత రెచ్చిపోతారు. కాబట్టి ఆ సమయంలో మీ సోషల్‌ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్స్‌, ఫోన్‌ నంబర్లు మార్చేయడం; మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి అకౌంట్‌/మొబైల్‌ నంబర్‌ బ్లాక్‌ చేయడం; వారికి చెల్లించిన డబ్బుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ తీసి పెట్టుకోవడం; అలాగే మీపై వేధింపులకు పాల్పడుతూ జరిపిన సంభాషణ రికార్డ్‌ చేయడం.. ఇవన్నీ అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని గట్టెక్కించేవే! అలాగే సంబంధిత సోషల్‌ మీడియా పోర్టల్‌కు మీ సమస్య గురించి తెలియజేయడం కూడా తప్పనిసరి. అయినా ఫలితం లేకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే నేరస్థులపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశముంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్