Published : 13/11/2022 11:22 IST

మోడల్ కాదు.. పోలీస్.. ఇంతకీ ఎవరీ అందగత్తె?

(Photos: Instagram)

‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. నాలో అలజడి రేపిందీ నీ చిరునవ్వు..’ అని పాటందుకుంటున్నారు కొలంబియాకు చెందిన డయానా రమిరెజ్‌ను చూసిన నెటిజన్లు. అలాగని ఆమె ఏ హీరోయినో లేదంటే ఏ మోడలో అనుకుంటే పొరపడినట్లే! ఎందుకంటే.. వృత్తి రీత్యా ఆమె ఒక పోలీసాఫీసర్‌. డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటుందో.. నెట్టింట్లోనూ అంత సరదాగా పోస్టులు పెడుతుంటుందీ బ్యూటిఫుల్‌ కాప్‌. అందుకే సోషల్‌ మీడియాలోనూ ఆమెకు ఫాలోయింగ్‌ ఎక్కువే! మరి, ‘ఇంత అందమైన మీరు.. హాయిగా ఏ మోడలింగో చేసుకోకుండా.. ఎందుకీ రిస్కీ జాబ్‌?’ అనడిగితే.. తనేమంటుందో తెలుసా?

కొలంబియాలోని మెడెలిన్‌ నగరాన్ని నేరాల పరంగా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పేర్కొంటారు. ఇలాంటి ప్రదేశంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రతి నిత్యం ఓ సవాలే! తన వృత్తిలో భాగంగా అలాంటి సవాళ్లెన్నో ఎదుర్కొంది డయానా రమిరెజ్‌. అదే ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేస్తూ.. ఇప్పటికే ఎంతోమంది నేరస్థుల్ని పట్టుకుందామె.

అందమైన పోలీస్!

ఇలా విధి నిర్వహణలో ఎంత స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తుందో.. సోషల్‌ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటుంది డయానా. ఈ క్రమంలోనే వివిధ సందర్భాల్లో, పర్యటక ప్రదేశాల్లో తాను దిగిన అందమైన ఫొటోల్ని పోస్ట్‌ చేస్తుంటుంది. ఆమె గురించి తెలియని వారు.. వాటిని చూస్తే ఏ హీరోయినో, మోడలో అనుకోక మానరు. ఇలా ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఆమెకు ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసాఫీసర్‌’గా కితాబిచ్చేశారు. ఇక డయానా మంచి ఫ్యాషనర్‌ కూడా! విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోతూ తాను దిగిన ఫొటోల్ని ఇలా ఇన్‌స్టాలో పంచుకుంటుందో లేదో.. అలా లక్షల కొద్దీ లైకులు, వేల కొద్దీ కామెంట్లతో ఆమె ఖాతా కిక్కిరిసిపోతుంటుంది. ఇలా తన అందచందాలు, ఫ్యాషన్‌ సెన్స్‌తో కట్టిపడేస్తోన్న ఈ ముద్దుగుమ్మకు.. ఇన్‌స్టా ఫాలోవర్లు నాలుగు లక్షలకు పైమాటే!

మళ్లీ.. పోలీస్‌నే అవుతా!

సాధారణంగా రిస్క్‌ ఉన్న వృత్తిలో కొనసాగడానికి ఎక్కువమంది ఇష్టపడరు.. మరో అవకాశమొస్తే.. ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. కానీ తాను మాత్రం.. ఆ దేవుడు ఎన్ని అవకాశాలిచ్చినా.. పోలీస్‌ వృత్తినే ఎంచుకుంటానంటోంది డయానా. ‘మీరు ఇంత అందంగా ఉన్నారు.. ఇంత కష్టపడే బదులు.. ఏ మోడలింగ్‌ వృత్తిలోనో, ఆన్‌లైన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానో స్థిరపడచ్చుగా..! అని చాలామంది అడుగుతుంటారు. కానీ వీటి కోసం నేను నాకిష్టమైన పోలీస్‌ ఉద్యోగాన్ని వదులుకోను. నా కెరీర్‌ను ఎంచుకునే అవకాశం నాకు ఎన్నిసార్లు వచ్చినా సరే.. నా ఓటు మాత్రం పోలీస్‌ వృత్తికే. రిస్క్‌, సవాళ్లతో కూడుకున్న పనిలోనే మన సత్తా ఏంటో బయటపడుతుంది. ఆ సంతృప్తే నాకు కావాలి. అందుకే నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ నన్ను నేను నిరూపించుకుంటున్నా. దేశ సేవకే నా జీవితం అంకితం..’ అని తేల్చేసింది డయానా.

ఇలా తన అందంతో కట్టిపడేస్తూ, పనితీరుతో తనను తాను నిరూపించుకుంటోన్న డయానా.. ‘ఇన్‌స్టాఫెస్ట్‌ అవార్డు’ల్లో భాగంగా ‘బెస్ట్‌ పోలీస్‌/మిలిటరీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఇటీవలే నామినేట్‌ అయింది. అటు వివిధ వృత్తుల్లో రాణిస్తూ, ఇటు డిజిటల్‌ కంటెంట్‌తో ఎక్కువమంది నెటిజన్లను ఆకట్టుకునే వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి