Amrita Rao: మా పెళ్లికైన ఖర్చు లక్షన్నరే!

పెళ్లంటే హంగూ ఆర్భాటాలు అంటూ మనం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక సెలబ్రిటీ పెళ్లిళ్లు మరో రేంజ్‌లో ఉంటాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌, డిజైనర్‌ దుస్తులు, కోట్లు ఖర్చు పెట్టి తయారుచేయించుకునే వజ్రాభరణాలు.. ఇలా వారి వివాహం పూర్తయ్యే సరికి ఖర్చు....

Updated : 19 May 2023 17:56 IST

(Photos: Instagram)

పెళ్లంటే హంగూ ఆర్భాటాలు అంటూ మనం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక సెలబ్రిటీ పెళ్లిళ్లు మరో రేంజ్‌లో ఉంటాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌, డిజైనర్‌ దుస్తులు, కోట్లు ఖర్చు పెట్టి తయారుచేయించుకునే వజ్రాభరణాలు.. ఇలా వారి వివాహం పూర్తయ్యే సరికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. మరి, ఇంత ఆడంబరంగా చేసుకుంటేనే అది వివాహమవుతుందా? అంటే.. కచ్చితంగా కాదంటున్నారు సెలబ్రిటీ కపుల్‌ అమృతా రావ్‌ - ఆర్జే అన్‌మోల్‌. బాలీవుడ్‌ లవబుల్‌ కపుల్‌గా పేరుగాంచిన ఈ ముద్దుల జంట వివాహమై ఇటీవలే తొమ్మిదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తమ వివాహంలోని మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ మురిసిపోయిందీ అందాల జంట. అంతేకాదు.. ఈ క్రమంలో తమ పెళ్లికైన ఖర్చునూ బయటపెట్టారు అమృత-అన్‌మోల్‌. ఈ క్షణాలన్నీ రంగరించి రూపొందించిన వీడియోను తమ 9వ ‘వివాహ వార్షికోత్సవం’ సందర్భంగా ఇటీవలే తమ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసిందీ జంట. దాంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకొని.. ఈ కాలపు జంటలకు బడ్జెట్‌-ఫ్రెండ్లీ పెళ్లి టిప్స్‌ ఇచ్చిన ఈ జంటను చాలామంది ప్రశంసిస్తున్నారు.. మరి, ఈ లవ్లీ కపుల్‌ వెడ్డింగ్‌ మెమరీస్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

అమృతా రావ్‌.. మహేష్‌ సరసన ‘అతిథి’ సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో పలు హిట్‌ చిత్రాల్లో నటించింది. ఇక అన్‌మోల్‌ ఆర్జేగా, వ్యాఖ్యాతగా పేరు సంపాదించుకున్నాడు. ఏడేళ్ల పాటు ప్రేమించుకొని, 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమకు గుర్తుగా.. 2020లో వీర్‌ అనే కొడుకు పుట్టాడు. బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంటల్లో ఒకరిగా పేరుగాంచిన ఈ క్యూట్‌ కపుల్‌.. సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తమ వ్యక్తిగత విషయాల్నీ, తమ జీవితాల్లోని ప్రత్యేక సందర్భాల్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. మరోవైపు అవే విషయాల్ని వీడియోలుగా రూపొందించి ‘కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌ : అమృతా రావ్‌ ఆర్జే అన్‌మోల్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లోనూ పోస్ట్‌ చేస్తుంటుందీ జంట. ఇలా ఇప్పటివరకు వందలాది వీడియోలు పోస్ట్‌ చేసిన ఈ కపుల్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు 3.8 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లున్నారు.

డెస్టినేషన్‌ వెడ్డింగే.. కానీ!

అయితే ఇటీవలే తమ తొమ్మిదో వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న అమృత-అన్‌మోల్‌.. ఈ సందర్భంగా తమ వివాహంలోని మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో రూపొందించారు. తమ వివాహ వేదికను పరిచయం చేయడంతో పాటు తమ పెళ్లికైన ఖర్చును కూడా ఇందులో వివరించారు. ఈ క్రమంలో తమ వివాహానికి కేవలం రూ. 1.5 లక్షలు మాత్రమే ఖర్చైందన్న రహస్యాన్ని బయటపెడుతూనే.. మరోవైపు తక్కువ ఖర్చుతోనే ఎలా పెళ్లి చేసుకోవచ్చో ఈ కాలపు జంటలకు వివరించే ప్రయత్నం చేసిందీ ముద్దుల జంట.
‘మే 15, 2014లో మా పెళ్లైంది. ఈ సందర్భంగా అన్‌మోల్‌ నాకో అందమైన కానుక కూడా ఇచ్చాడు. అయితే మేం చాలా సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నాకు, అన్‌మోల్‌కు ఆడంబరాలంటే ఇష్టం ఉండదు. అందరిలాగే మాదీ డెస్టినేషన్‌ వెడ్డింగే! పెళ్లి కోసం పుణే వెళ్లాం. అదీ సొంత కారులో కాబట్టి ప్రయాణ ఖర్చుల భారం తప్పింది..

అన్నీ ఆర్టిఫిషియల్‌ నగలే!

పుణేలోని ఆర్చిడ్‌ హోటల్‌ మా వివాహ వేడుకలకు వేదికైంది. మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల్ని మాత్రమే మా పెళ్లికి ఆహ్వానించాం. ఇందుకోసం హోటల్లో 8 గదుల్ని బుక్‌ చేశాం.. రూ. 64 వేలు ఖర్చైంది. అందరిలాగే మేమూ సంగీత్‌, మెహెందీ వంటి వేడుకలు చేసుకున్నాం. వీటి కోసం రూ. 21 వేలతో అదే హోటల్‌లో హాల్‌ బుక్‌ చేశాం. ఇక సాయంత్రం రూ. 6,500లతో ఫ్యామిలీ డిన్నర్‌ ఏర్పాటుచేశాం. ఇక మా పెళ్లి కోసం భారీ డిజైనర్‌ దుస్తులేవీ ఎంచుకోలేదు. సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా ఉండే దుస్తులే ధరించాం. వీటికి ఖర్చు తలా రూ. 3 వేలకు మించలేదు. అయితే నా పెళ్లికి నగల షాపింగ్‌ చేయాలన్న కోరిక బాగా ఉండేది. ఇదే విషయం అన్‌మోల్‌కి చెప్తే.. ‘జ్యుయలరీ షాపింగ్‌ ఇప్పుడెందుకు? పెళ్లయ్యాకైనా తీరిగ్గా చేసుకోవచ్చుగా!’ అన్నాడు. నిజానికి మా పెళ్లి సమయంలోనే మా కొత్త ఇంటి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఆ బిజీలో నగల షాపింగ్‌ చేయడం కుదరలేదు.. కాబట్టి ఒక్క మంగళసూత్రం తప్ప మిగతావన్నీ ఆర్టిఫిషియల్‌ నగలే ధరించా. మంగళసూత్రం ఖరీదు కూడా కేవలం రూ. 18 వేలు మాత్రమే! సింపుల్‌ డిజైన్లో రూపొందించిందే అయినా అది నాకు బాగా నచ్చింది.

డబ్బు కాదు.. ప్రేమ ముఖ్యం!

ఇక పెళ్లి పుణే కత్రజ్‌లోని ఇస్కాన్‌ మందిరంలో జరిగింది. అక్కడి వెడ్డింగ్‌ హాల్‌కు రూ. 11 వేలు ఖర్చు పెట్టాం. ఇక నా పెళ్లికి మేకప్‌ నేనే వేసుకున్నా. డ్రస్సింగ్‌ విషయంలో మా కుటుంబ సభ్యులు సహాయం చేశారు. ఇలా మొత్తంగా మా పెళ్లి ఖర్చు లక్షన్నరకు మించలేదు. నేను, అన్‌మోల్‌ నమ్మేది ఒక్కటే.. వివాహమనేది ప్రేమతో ముడిపడినది.. డబ్బు, హంగూ ఆర్భాటాలతో కాదు. మా పెళ్లి విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాం. మమ్మల్ని అమితంగా ప్రేమించే అతి తక్కువమంది అతిథుల సమక్షంలో ఒక్కటవడం ఓ మధురమైన జ్ఞాపకం! ఏళ్లు గడిచినా.. ఇవన్నీ మా మదిలో పదిలమే!’ అంటూ మురిసిపోయింది అమృత.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ వివాహాన్ని ఉదహరిస్తూ ఈ కాలపు జంటలకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ టిప్స్‌ అందించిన ఈ ముద్దుల జంటపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మీది అత్యుత్తమ వివాహం.. హ్యాపీ యానివర్సరీ!’ అంటూ ఈ స్వీట్‌ కపుల్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్