ఆకాశంలో జిమ్నాస్టిక్స్‌.. ఆమె విన్యాసాలు అదుర్స్!

గాల్లో జిమ్నాస్టిక్స్‌ గురించి విన్నాం.. కానీ ఆకాశంలో జిమ్నాస్టిక్స్‌ ఏంటి.. అనుకుంటున్నారా? ఇలాంటి అరుదైన సాహసంతో తాజాగా వార్తల్లోకెక్కింది పోలండ్‌ యువతి మాయా కూచిన్‌స్కా. వృత్తిరీత్యా స్కైడైవింగ్‌ క్రీడాకారిణి అయిన ఆమె.. ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్కైడైవింగ్‌ చేయడంలో దిట్ట.

Published : 27 Oct 2023 12:37 IST

(Photos: Instagram)

గాల్లో జిమ్నాస్టిక్స్‌ గురించి విన్నాం.. కానీ ఆకాశంలో జిమ్నాస్టిక్స్‌ ఏంటి.. అనుకుంటున్నారా? ఇలాంటి అరుదైన సాహసంతో తాజాగా వార్తల్లోకెక్కింది పోలండ్‌ యువతి మాయా కూచిన్‌స్కా. వృత్తిరీత్యా స్కైడైవింగ్‌ క్రీడాకారిణి అయిన ఆమె.. ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్కైడైవింగ్‌ చేయడంలో దిట్ట. ఈ క్రమంలోనే ఇటీవల వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఆమె.. గాల్లోనే జిమ్నాస్టిక్స్‌ ప్రదర్శించింది. తన సాహస విన్యాసాలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ‘ఔరా!’ అంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ యువ స్కైడైవర్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మాయా ఇలా స్కైడైవింగ్‌ విన్యాసాలు చేయడం ఇది తొలిసారేమీ కాదు.. గతంలోనూ ఇలాంటి ఎన్నో గగుర్పొడిచే విన్యాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందామె. మరి, స్కైడైవింగ్తో ఆకాశాన్నే తన ఆటస్థలంగా మార్చుకున్న మాయాకు ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి..

మాయా పోలండ్‌లోని వార్సాలో జన్మించింది. ఆమె తండ్రి బ్యాంకు ఉద్యోగి. వృత్తి రీత్యా ఆయనకు యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు ఉద్యోగ బదిలీలయ్యేవి. అలా పెరిగి పెద్దయ్యే క్రమంలో మ్యూనిక్, ప్యారిస్‌, కీవ్‌, చెక్‌ రిపబ్లిక్‌, రోక్లా.. వంటి నగరాల్ని చుట్టేసిందామె. ‘నాన్న ఉద్యోగరీత్యా ఇలా నేను పదే పదే ప్రాంతాలు మారడం నా ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వారు చాలామంది. కానీ నాకేమీ అలా అనిపించలేదు. పైగా దీనివల్ల వివిధ నగరాల్ని సందర్శించే అదృష్టం నాకు దక్కింది. అక్కడి భాషలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఆయా ప్రాంతాల/నగరాల సంస్కృతుల గురించి తెలుసుకోగలిగా.. నా స్కూల్‌ స్నేహాల్ని మరింత విస్తరించుకోగలిగాను. ఏదేమైనా ఈ మార్పును నేనెంతో ఆస్వాదించా..’ అంటోంది మాయా.

నాన్నతో కలిసి దూకేశా!

మాయా తల్లిదండ్రులిద్దరికీ, ఆమె అన్నయ్యకూ స్కైడైవింగ్‌లో ప్రావీణ్యముంది. ఈ క్రమంలోనే చిన్నతనం నుంచే వారితో కలిసి స్కైడైవింగ్‌ చేసే ప్రదేశానికి వెళ్లేదామె. అలా తనకూ ఈ క్రీడపై మక్కువ పెరిగిందంటోంది మాయా.

‘అమ్మానాన్నలు, అన్నయ్య చేసే స్కైడైవింగ్‌ విన్యాసాలు చూస్తూ పెరిగిన నాకూ ఈ క్రీడపై ఇష్టం ఏర్పడింది. ఇక నా పదేళ్ల వయసులో నాన్నతో కలిసి తొలిసారి టాండెమ్‌ జంప్‌ చేయడం మర్చిపోలేను. ఈ మక్కువతోనే ఇండోర్‌ స్కైడైవింగ్‌/విండ్‌ టన్నెల్‌ స్కైడైవింగ్‌లో శిక్షణ తీసుకున్నా. ఆపై పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టా. అలా 2012లో ఫ్రీస్టైల్‌ విభాగంలో ‘జూనియర్‌ ప్రపంచ ఛాయంపిన్‌షిప్స్‌’ గెలిచాను. ఇక నా 17 ఏళ్ల వయసులో అవుట్‌డోర్‌ స్కైడైవింగ్‌పై దృష్టి పెట్టా..’ అంటోన్న ఈ యువ అడ్వెంచరర్‌కు జిమ్నాస్టిక్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. ఆరేళ్ల వయసు నుంచే జిమ్నాస్టిక్స్‌పై పట్టు పెంచుకున్న మాయా.. గతంలో ఈ క్రీడా విభాగంలోనూ పలు పోటీల్లో పాల్గొని పతకాలూ నెగ్గింది.

సవాళ్లను అధిగమించి..!

స్కైడైవింగ్‌ అంటే.. అందరిలా విమానం నుంచి దూకేసి ప్యారాచూట్‌ సహాయంతో తిరిగి భూమిని చేరుకోవడంలో కొత్తేముంది అనుకుంది మాయా. అందుకే ఇందులోనూ కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించాలనుకుంది. ఈ ఆలోచనతోనే స్కైడైవింగ్‌కు జిమ్నాస్టిక్స్‌ను జత చేసి.. గాల్లోనే గగుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శిస్తోందామె.

‘చిన్నప్పట్నుంచి ఏ విషయంలోనైనా అందరిలా కాకుండా కొత్తగా ప్రయత్నించాలనుకునేదాన్ని. స్కైడైవింగ్‌ విషయంలోనూ అలాగే చేయాలనుకున్నా. అందుకే కొంత ఎత్తుకు వెళ్లి విమానంలో నుంచి దూకడంతో పాటు.. గాల్లోనే విన్యాసాలు చేయడం ప్రారంభించా. అయితే మొదట్లో అదంత సులభం కాలేదు.. ఆకాశంలో గాలి వేగం ఎక్కువగా ఉండడం వల్ల ఒక చోట స్థిరంగా ఉండలేకపోయేదాన్ని.. ఇలా గింగిరాలు తిరగడం, తలకిందులుగా వేలాడడం వల్ల జిమ్నాస్టిక్స్‌ సరిగ్గా చేయలేకపోయేదాన్ని.. మరోవైపు గురుత్వాకర్షణ శక్తి నన్ను భూమి వైపు లాగేది. అయినా ఈ సవాళ్లన్నీ అధిగమించి ముందు గాల్లో నన్ను నేను బ్యాలన్స్‌ చేసుకోవడం ప్రాక్టీస్‌ చేశా. ఆపై విన్యాసాలు చేయడం సాధన చేశా. ఇప్పుడు నేను స్కైడైవింగ్‌లో భాగంగా గాల్లో జిమ్నాస్టిక్స్‌ చేయగలను.. వ్యాయామాలూ సాధన చేయగలను.. నా శరీరాన్నీ బ్యాలన్స్‌ చేసుకుంటూ భూమి వైపు దూసుకురాగలను..’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది మాయా.

విన్యాసాలతో సెన్సేషనల్‌గా..!

ట్రెడిషనల్‌ స్కైడైవర్‌గా, ఫ్రీస్టైల్‌ స్కైడైవర్‌గా (ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గాల్లో చేసే ఏరోబిక్స్‌ విన్యాసాలు).. ఇలా విభిన్న స్కైడైవింగ్‌ విన్యాసాల్ని అలవోకగా ప్రదర్శించగల సత్తా ఉన్న మాయా.. ఇటీవలే మరో అద్భుత విన్యాసంతో ప్రపంచం దృష్టిని మరోసారి ఆకర్షించింది. నిర్దేశిత ఎత్తు నుంచి దూకేసిన తర్వాత.. ఆకాశంలో గాలి వేగాన్ని తట్టుకొని తనను తాను బ్యాలన్స్‌ చేసుకుంటూ గాల్లోనే గింగిరాలు తిరగడం.. వంటి విన్యాసాలు ప్రదర్శించిందామె. ఆపై తాను ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. చాలామంది ఆమె విన్యాసాలకు ఫిదా అవుతున్నారు.

‘నా స్కైడైవింగ్‌ విన్యాసాలు చూసి చాలామంది నా ప్రతిభను ప్రశంసిస్తుంటారు. అయితే కొంతమంది ‘ఇవి నిజం కాదు.. ఎడిట్‌ చేసిన వీడియోలం’టూ విమర్శిస్తుంటారు. ఎవరేమనుకున్నా నా ట్యాలెంట్‌ నాదే..’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోన్న మాయా.. తన సరికొత్త స్కైడైవింగ్‌ నైపుణ్యాలతోనే సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెకు సుమారు 5.5 లక్షల మంది ఫాలోవర్లున్నారు. కేవలం స్కైడైవింగ్‌ విన్యాసాలతోనే కాదు.. స్కీయింగ్‌, గుర్రపు స్వారీ వంటి సాహస క్రీడల్లోనూ మాయాకు ప్రావీణ్యముంది. ఇక ఖాళీ సమయాల్లో పియానో వాయించడం, పాటలు పాడడాన్ని ఎక్కువగా ఇష్టపడతానంటోందీ సాహసి.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్