ఎముకలు బలహీనమైనా.. ఆమె సంకల్పం గట్టిది!

కొంతమంది పడే కష్టాల్ని చూస్తే.. మనకున్న సమస్యలు చాలా చిన్నవనిపిస్తాయి. కేరళకు చెందిన ధన్యా రవిని చూసిన వాళ్లూ ఇదే మాట అంటుంటారు. అరుదైన ఎముక విరుపు వ్యాధితో జన్మించిన ఆమె.. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.

Updated : 17 Nov 2023 16:28 IST

(Photos: Instagram)

కొంతమంది పడే కష్టాల్ని చూస్తే.. మనకున్న సమస్యలు చాలా చిన్నవనిపిస్తాయి. కేరళకు చెందిన ధన్యా రవిని చూసిన వాళ్లూ ఇదే మాట అంటుంటారు. అరుదైన ఎముక విరుపు వ్యాధితో జన్మించిన ఆమె.. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి! ఇలా విధి తనను వంచించినా.. తాను మాత్రం విధికి తల వంచాలనుకోలేదామె. తన జీవితానికీ ఓ అర్థం, పరమార్థం ఉందని నిరూపించాలనుకుంది. ఈ సంకల్పంతోనే అరుదైన వ్యాధులపై అందరిలో అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం దీన్నో పనిలా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తోన్న ఆమె.. ఎంతోమందిలో స్ఫూర్తి రగిలిస్తోంది. ‘నా శరీరంలో ఎముకలు బలహీనమైనవి కావచ్చు.. కానీ నా సంకల్పం గట్టిది!’ అంటోన్న ధన్య జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం!

కేరళలో పుట్టి పెరిగిన ధన్య ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడింది. పుట్టింది మొదలు రోజుల తరబడి ఏడుస్తూనే ఉండేదామె. తమ ఎదురుచూపులు ఫలించి ఆడపిల్ల పుట్టిందన్న సంతోషం అటుంచితే.. అసలు పాప ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని పరిస్థితి ధన్య తల్లిదండ్రులది. అసలు సమస్యేంటో తెలుసుకోవడానికి పాపను తీసుకొని ఎన్నో ఆస్పత్రులు తిరిగారు వారు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. ఆఖరికి ఓ వైద్యుడు ధన్యకు ‘ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్ఫెక్టా’ అనే అరుదైన ఎముక విరుపు వ్యాధి ఉన్నట్లు తేల్చాడు.

స్కూల్లో సీటివ్వలేదు!

ఈ వ్యాధి కారణంగా పసి వయసులో దగ్గినా, తుమ్మినా ఆమె శరీరంలో ఎముకలు విరిగేవి. ఆస్పత్రిలో వాటికి వైద్యం చేయించుకొని ఇంటికి తిరిగి రాగానే.. మరో ఫ్రాక్చర్‌  ఆమెను వేధించేది. ఇలా ఏళ్ల తరబడి తాను ఆస్పత్రుల చుట్టూనే తిరగాల్సి వచ్చిందంటోంది ధన్య.

‘నేను పుట్టగానే ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నలు మురిసిపోయారు. అందరికీ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కానీ అంతలోనే నాకు అరుదైన ఎముక వ్యాధి ఉందని తెలుసుకొని కుంగిపోయారు. నిజానికి ఈ సమస్యతో నేను జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వస్తుందని తొలుత వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఎన్నో చికిత్సల అనంతరం డాక్టర్‌ ఈ విషయాన్ని తేల్చి చెప్పడంతో దీన్ని వారు అంగీకరించక తప్పలేదు. అలాగని నన్ను ఎక్కడా నిరుత్సాహ పరచలేదు. నా ఆరోగ్య సమస్య కారణంగా ఏ స్కూలూ నాకు సీటివ్వడానికి ముందుకు రాలేదు. దాంతో ఇంట్లోనే హోమ్‌ స్కూల్‌ ఏర్పాటుచేశారు. మా పక్కింటి ఆంటీనే నాకు ఉచితంగా చదువు చెప్పారు. పదో తరగతి పూర్తి కాగానే ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి వొకేషనల్‌ కోర్సు పూర్తిచేశా. ఆపై ఆన్‌లైన్‌ నావెల్‌ రైటింగ్‌ కోర్సు చేసి.. సంబంధిత సర్టిఫికెట్‌ అందుకున్నా..’ అంటూ తన జీవితంలోని పలు గడ్డు పరిస్థితుల్ని గుర్తు చేసుకుంది ధన్య.

బినూను చూశాకే..!

ఇంటికే పరిమితమైనా ఆన్‌లైన్‌ ఉపయోగంపై పట్టు పెంచుకుంది ధన్య. ఈ క్రమంలోనే పలు ఆన్‌లైన్‌ ఛాట్‌ ఫోరమ్స్‌లో చేరింది. అప్పటిదాకా ఒంటరిగా గడిపిన ఆమెకు.. ఈ ఛాట్‌ ఫోరమ్స్‌ పదుల సంఖ్యలో స్నేహితుల్ని సంపాదించి పెట్టాయి. అంతేకాదు.. ఇలా అందరితో మాట్లాడే క్రమంలో తనలాంటి అరుదైన ఎముక విరుపు సమస్య ఉన్న ఓ బాలుడి గురించీ తెలుసుకుందామె.

‘మా స్నేహితుల కమ్యూనిటీలో బినూ అనే బాలుడు కూడా అచ్చం నాలాంటి ఎముక వ్యాధితోనే బాధపడుతున్నట్లు తెలుసుకున్నా. పైగా అతడికి ఆపరేషన్‌ కోసం నిధులు కూడా కావాల్సి వచ్చింది. రెండో ఆలోచన లేకుండా.. ఆ నిధులు నేనే సమకూర్చాలనుకున్నా. వెంటనే బినూ కేర్‌టేకర్‌ అయిన లతా నాయర్‌ని కలిసి అతడి వైద్య చికిత్సల గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. ఆపై ఓ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటుచేసి నిధులు సమీకరించడం ప్రారంభించా. నా స్నేహితులు చాలామంది తమకు తోచినంత సహాయం చేశారు. సర్జరీ ముందు వరకు కనీసం పాకలేకపోయిన బినూ.. శస్త్రచికిత్స తర్వాత చక్రాల కుర్చీలో కూర్చొని తన పనులు తాను చేసుకోగలిగే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆరోగ్యకేంద్రంలో అసిస్టెంట్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇలా బినూను తన కాళ్లపై తాను నిలబడేలా సహకరించినందుకు మనసుకు తృప్తిగా అనిపించింది. ఈ ప్రయత్నమే ఇలాంటి అరుదైన వ్యాధులు ఎదుర్కొంటోన్న వారిలో స్ఫూర్తి నింపాలన్న ఆలోచన రగిలించింది..’ అంటోంది ధన్య.

అవగాహనే ధ్యేయంగా..!

ఆపై కొన్నాళ్లకు ‘అమృతవర్షిణి ఛారిటబుల్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన ధన్య.. ఈ వేదికగా ఎముక విరుపు వ్యాధులు, ఇతర అరుదైన ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే టీవీ ఇంటర్వ్యూలు, న్యూస్‌ షోస్‌, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఈ ఎన్జీవో నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోందామె. ఆదిలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకోమని అందరిలో అవగాహన పెంచుతోంది.

‘గర్భిణిగా ఉన్న సమయంలోనే మహిళలు జన్యుపరమైన పరీక్షలు చేయించుకునేలా వారిలో అవగాహన కల్పిస్తున్నా. దీనివల్ల పుట్టబోయే బిడ్డలో ఏవైనా సమస్యలుంటే ముందే పసిగట్టచ్చు.. తదనంతరం నిపుణుల సలహాలు పాటించచ్చు. అలాగే అవసరమైతే మందులు, థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌.. వంటివీ తీసుకోవచ్చు. ఆస్పత్రులూ దీనిపై ప్రత్యేకమైన సెల్‌ ఏర్పాటుచేసి.. పేషెంట్స్‌కి ఇలాంటి అరుదైన వ్యాధులపై ముందు నుంచే అవగాహన పెంచాలి..’ అంటోన్న ధన్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాలకు వెళ్లి అక్కడా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తోంది. తనలా మరెవరూ బాధపడకూడదని సామాజిక స్పృహతో ధన్య చేస్తోన్న ఈ ప్రయత్నానికి గుర్తింపుగా.. 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘రోల్‌ మోడల్‌’ విభాగంలో ‘జాతీయ పురస్కారం’ అందుకుంది. ‘బ్రేవ్‌ బ్యాంగిల్‌ అవార్డు’, ‘యాన్యువల్‌ ఇన్‌స్పైర్‌డ్‌ ఇండియన్‌ ఫౌండేషన్‌ అవార్డు’.. వంటివీ ఆమెను వరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్