Anshula Kapoor: అందుకే పిరియడ్స్ టైంలో స్కూల్‌ మానేసేదాన్ని!

నెలసరి, పీసీఓఎస్‌, వీటివల్ల తలెత్తే దుష్ప్రభావాలు.. ఈ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది ఆసక్తి చూపరు. కానీ నిర్మొహమాటంగా వీటి గురించి పంచుకున్నప్పుడే నలుగురిలో స్ఫూర్తి నింపచ్చంటోంది బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ గారాల చెల్లెలు అన్షులా కపూర్‌. తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల్ని సైతం....

Published : 27 Oct 2022 18:21 IST

(Photos: Instagram)

నెలసరి, పీసీఓఎస్‌, వీటివల్ల తలెత్తే దుష్ప్రభావాలు.. ఈ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది ఆసక్తి చూపరు. కానీ నిర్మొహమాటంగా వీటి గురించి పంచుకున్నప్పుడే నలుగురిలో స్ఫూర్తి నింపచ్చంటోంది బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ గారాల చెల్లెలు అన్షులా కపూర్‌. తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల్ని సైతం పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడని ఈ చక్కనమ్మ.. తన అధిక బరువు, స్వీయ ప్రేమతో దాన్ని తగ్గించుకున్న విధానం గురించి మొన్నామధ్య వరుస పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు తన పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ ఆమె పంచుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

బాలీవుడ్‌ దర్శకనిర్మాత బోనీ కపూర్‌ కూతురిగా, హ్యాండ్‌సమ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ చెల్లెలిగానే కాదు.. తన క్యూట్‌ స్మైల్‌తో, పాజిటివిటీ పోస్టులతో ఎంతోమందికి చేరువైంది అన్షులా కపూర్‌. స్వీయ ప్రేమకు సంబంధించి తరచూ పోస్టులు పెడుతూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ చక్కనమ్మ.. ఇటీవలే మరో పోస్ట్‌తో ఎంతోమందిలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేసింది.

ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌తో బాధపడ్డా!

ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న అన్షుల.. సానుకూల దృక్పథంతో, స్వీయ ప్రేమతో తన అధిక బరువును తగ్గించుకొని నాజూగ్గా మారిపోయింది. అయితే తాను ఇంతలా బరువు పెరగడానికి తనకున్న పీసీఓఎస్‌ సమస్య కూడా ఓ కారణమంటూ.. దానివల్ల తానెదుర్కొన్న దుష్ప్రభావాల గురించి ఓ వీడియో పోస్ట్‌ పెట్టింది.

‘పద్నాలుగేళ్ల వయసులో నాకు పీసీఓఎస్‌ నిర్ధారణ అయింది. దీనివల్ల మూడు నాలుగు నెలలకోసారి నాకు పిరియడ్స్‌ వచ్చేవి. ఈ క్రమంలో నెలసరి నొప్పులు మరింత తీవ్రంగా ఉండేవి. పిరియడ్స్‌ వచ్చినప్పుడల్లా వారాల పాటు కొనసాగేది. దీంతో చాలాసార్లు స్కూల్‌ కూడా మానేసేదాన్ని. అంతేకాదు.. ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా వచ్చేవి. ఇక పదో తరగతిలో వ్యాక్సింగ్‌ ద్వారా నా మీసాలు, గడ్డాన్ని తొలగించుకున్న సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే. అలాగే కొన్ని వారాలకోసారి బ్లీచింగ్‌ పద్ధతిలో నా బుగ్గలపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగించుకునేదాన్ని. మరోవైపు క్రమంగా బరువూ పెరిగిపోయా. అయితే ఈ దుష్ప్రభావాలన్నీ తొలగించుకొని పీసీఓఎస్‌ను అదుపులోకి తెచ్చుకోవాలంటే బరువు తగ్గాలని సూచించారు నిపుణులు. నిజానికి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, నన్ను నేను రియలైజ్ కావడానికి కొంత సమయం పట్టింది. ఒకప్పుడు నేనొక్కదాన్నే ఈ సమస్యతో బాధపడుతున్నానేమోనని అనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆ తర్వాత నాకు అర్థమైంది. మన సమస్య మనలోనే ఉంచుకోవడం కంటే నలుగురితో పంచుకున్నప్పుడే వారిలో ధైర్యం, స్ఫూర్తి నింపగలం..’ అంటోంది అన్షుల. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు చాలామంది మహిళలు స్పందిస్తున్నారు. వారి పీసీఓఎస్‌ అనుభవాల్ని కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్