విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!

మన వార్డ్‌రోబ్‌లో పాతబడిన దుస్తుల్ని మూల పడేస్తుంటాం.. ఇంట్లో పాతవైపోయిన వస్తువుల్నీ స్టోర్‌ రూమ్‌లో పడేస్తుంటాం.. చాలామందికి వాటిని ఏం చేయాలో అర్థం కాదు.. కొంతమందికి వాటిని ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలని ఉన్నా వాళ్లను ఎలా చేరుకోవాలో అర్థం కాదు.

Published : 25 Mar 2024 21:46 IST

(Photos: LinkedIn)

మన వార్డ్‌రోబ్‌లో పాతబడిన దుస్తుల్ని మూల పడేస్తుంటాం.. ఇంట్లో పాతవైపోయిన వస్తువుల్నీ స్టోర్‌ రూమ్‌లో పడేస్తుంటాం.. చాలామందికి వాటిని ఏం చేయాలో అర్థం కాదు.. కొంతమందికి వాటిని ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలని ఉన్నా వాళ్లను ఎలా చేరుకోవాలో అర్థం కాదు. అందుకే అలాంటి విరాళాల్ని చేరవేసే బాధ్యతను తన భుజాన వేసుకుంది దిల్లీకి చెందిన అనుష్కా జైన్‌. దాతల గడప దగ్గర్నుంచి విరాళాల్ని సేకరిస్తూ.. వాటిని ఆయా స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరార్థులకు అందించేందుకు ఏకంగా ఓ సోషల్‌ స్టార్టప్‌నే ప్రారంభించిందామె. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 11 నగరాల్లో సేవలందిస్తోన్న తన సామాజిక సేవా సంస్థ గురించి అనుష్క పంచుకున్న విశేషాలు మీకోసం..!

‘ఈ సమాజం నాకెంతో ఇచ్చింది. నా వంతుగా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి.. లేదంటే లావైపోతాను..’ అంటుంది శ్రీమంతుడు సినిమాలో శృతీ హాసన్‌. అనుష్కది కూడా అచ్చం ఇలాంటి మనస్తత్వమే! దిల్లీలో పుట్టి పెరిగిన ఆమె చిన్న వయసు నుంచే సమాజ సేవలో భాగమయ్యేది. అయితే ఇదంతా తన తల్లి వల్లే తనకు అలవాటయ్యిందంటోంది అనుష్క.

పుట్టినరోజున అలా!

‘చిన్నతనంలో నా ప్రతి పుట్టినరోజుకు మా అమ్మ నన్ను ఏదో ఒక సమాజ సేవలో భాగం చేసేది. ముఖ్యంగా నా పాత దుస్తుల్ని, బొమ్మల్ని స్వచ్ఛంద సంస్థలకు అందించేది. ఇక సాయంత్రాలు అక్కడి పిల్లలకు స్వీట్స్‌, స్నాక్స్‌ అందించడం.. రాత్రి వరకు వాళ్లతో, వాళ్ల తల్లిదండ్రులతో సమయం గడిపి ఇంటికి తిరిగొచ్చేవాళ్లం. నా ప్రతి పుట్టినరోజు ఇలా జరుపుకోవడం నాకు నచ్చింది. ఈ క్రమంలో నా మనసుకు ఏదో తెలియని సంతోషం, సంతృప్తి కలిగేవి. సమాజ సేవలో ఉన్న సంతృప్తేంటో అప్పుడే నాకు అర్థమైంది. పెద్దయ్యాకా నేను దీన్ని కొనసాగించాలనుకున్నా. అయితే అమ్మానాన్నలు నేను బాగా చదువుకొని కార్పొరేట్‌ ఉద్యోగం చేయాలని కోరుకున్నారు. ఆపై పెళ్లి, పిల్లలతో నా జీవితం పరిపూర్ణం చేసుకుంటే చాలనుకున్నారు. కానీ నేనేమో అవసరార్థులకు సహాయం చేసేలా ఓ సోషల్‌ స్టార్టప్‌ని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నా. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేశా. ఆపై నేను నా బిజినెస్‌ ఆలోచనల్లో ఉంటే.. నా పేరెంట్స్‌ నా పెళ్లి సంబంధాల వేటలో మునిగిపోయారు. కానీ అప్పుడే నాకు పెళ్లి ఇష్టం లేదు. అందుకే నా మనసులోని మాటను అమ్మానాన్నలతో చెప్పా.. వాళ్లను ఒప్పించి కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇలా అమ్మ చిన్నప్పుడు చూపిన సేవా మార్గమే 2012లో ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌ (SADS)’ అనే సోషల్‌ స్టార్టప్‌కు తెరతీసింది..’ అంటోంది అనుష్క.

నమోదు చేసుకుంటే చాలు!

నగదు రహిత విరాళాల్ని దాతల గడప వద్దే సేకరించి.. ఆయా స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరార్థులకు అందించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనుష్క.. దీని ద్వారా దాతలకు విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచుకునే అవకాశమిస్తోంది. ఈ క్రమంలో దాతలు తమ అడ్రస్‌, విరాళాలు అందించాలనుకుంటోన్న వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. షెడ్యూల్‌ను బట్టి వీళ్లే దాతల గడప వద్దకు వెళ్లి ఆయా వస్తువుల్ని సేకరిస్తారు. వాటిని ఆయా ఎన్జీవోలకు అందిస్తారు. ఒకవేళ దాతలే తమ విరాళాల్ని సంబంధిత వ్యక్తులకు/ఎన్జీవోలకు అందించాలనుకుంటే.. తమ సంస్థ ద్వారా వాళ్లే స్వయంగా అందించే ఏర్పాటు కూడా చేస్తున్నట్లు చెబుతోంది అనుష్క.

‘చాలామంది పాత వస్తువుల్ని మూల పడేస్తుంటారు. కానీ అవి మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడచ్చు.. అయితే వాటిని విరాళంగా ఇవ్వాలని అనుకున్నా కొంతమందికి అది ఎలా ఇవ్వాలో, అవసరార్థుల్ని ఎలా చేరుకోవాలో అర్థం కాదు. అలాంటి వాళ్ల కోసమే మా సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. దాతలు తమ వద్ద  ఉన్న షూస్‌, పుస్తకాలు, బ్యాగ్స్‌, దుస్తులు, ఫర్నీచర్‌, గృహాలంకరణ వస్తువులు, గృహోపకరణాలు.. ఇలా ఏదైనా విరాళంగా ఇవ్వచ్చు.. వీటిని సేకరించి ఎన్జీవోల ద్వారా అవసరార్థులకు అందిస్తున్నాం. అలాగే దాతల వద్ద నుంచి విరాళాల్ని సేకరించే క్రమంలో సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్స్‌/రివార్డ్స్‌ కూడా అందిస్తున్నాం..’ అంటూ తమ సంస్థ సేవల గురించి చెబుతోందీ సోషల్‌ వారియర్‌.

11 నగరాల్లో మా సేవలు!

తమ వెబ్‌సైట్‌ వేదికగా వివిధ రకాల డిజిటల్‌ క్యాంపెయిన్స్‌ని నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తోంది అనుష్క. కాలక్రమేణా తమ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న ఎన్జీవో అవసరాలకు అనుగుణంగా కావాల్సిన వస్తువులేంటో తెలుసుకునేలా కృత్రిమ మేధతో సాంకేతికతనూ అభివృద్ధి చేసిందీ టెకీ. దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో విజయవంతమైన తన ఈ ఐడియాను ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 11 నగరాలకు విస్తరించిందామె.
‘SADS ప్రారంభానికి ముందు పలు ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేశా. కానీ ఇప్పుడు దక్కుతోన్న సంతృప్తి, మానసిక ప్రశాంతత ఆ కెరీర్‌లో నాకు దక్కలేదు. అందుకే నా సేవల్ని దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ దేశాలకూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలోనే గతేడాది సింగపూర్‌లోనూ అడుగుపెట్టా. త్వరలోనే మరిన్ని దేశాలకు నా సోషల్‌ స్టార్టప్‌ను విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నా..’ అంటోన్న అనుష్క సేవలతో ఇప్పటికే లక్షలాది మంది పేద వారు లబ్ది పొందారు. వేలాది మంది దాతలు తమ విరాళాలతో స్వీయ సంతృప్తిని సొంతం చేసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్