అదేమైనా జాతకమా.. అన్నారు!

వైద్య పరీక్షలకే కాదు.. రిపోర్టుల కోసమూ చాలా సమయం ఎదురుచూడాలి! అలా కేటాయించలేకే చాలామంది అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్నిసార్లు గుర్తించేలోగానే ఆలస్యమైపోతోంది.

Updated : 06 Mar 2023 09:05 IST

వైద్య పరీక్షలకే కాదు.. రిపోర్టుల కోసమూ చాలా సమయం ఎదురుచూడాలి! అలా కేటాయించలేకే చాలామంది అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్నిసార్లు గుర్తించేలోగానే ఆలస్యమైపోతోంది. అలాకాకుండా సులువుగా అనారోగ్యాన్ని కనిపెట్టే పరికరం ఉంటే..? ఇలాగే ఆలోచించారు గాయత్రి! నిమిషాల్లో సమస్యను కనిపెట్టగలిగే టెక్నాలజీనీ రూపొందించారు. దాని వెనకున్న కథని వసుంధరతో పంచుకున్నారు..

మాది గుంటూరు. అమ్మానాన్న నిర్మలాదేవి, బ్రహ్మచారి ఇద్దరూ ఉపాధ్యాయులే. చెల్లి అనూహ్య. ఇంజినీరింగయ్యాక అమెరికాలో ఎంబీఏ చేశా. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేసి, సింగపూర్‌ సంస్థలో డేటా అనలిస్ట్‌గా చేరా. 2012లో దేశానికి తిరిగొచ్చి ‘డిజిటెంట్‌ కన్సల్టెన్సీ’ ప్రారంభించి చిన్నచిన్న ప్రాజెక్టులకు పని చేసేదాన్ని. అప్పుడే డేటా అనాలిసిస్‌పై ప్రచురణైన ఓ పుస్తకాన్ని నారా లోకేష్‌ చదివారట. అది రాసిన అయిదుగురిలో నేనూ ఒకరిని. లోకేష్‌ సిఫారసుతో చంద్రబాబు నాయుడి నుంచి కబురొచ్చింది. 2014 ఎలక్షన్లకు సోషల్‌మీడియా  ప్రచారానికి డేటా అనలిస్ట్‌గా పనిచేశా. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం తరఫున ‘ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ’ బాధ్యతలిచ్చారు.

దిశ మారిందలా..

2018.. నాన్నకు బ్రెయిన్‌ స్ట్రోక్‌. పదిరోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారు. దాన్ని జీర్ణించుకోలేకపోయా. ఆయనకు మధుమేహం ఉంది. దాని సైడ్‌ఎఫెక్ట్‌ వల్లే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందన్నారు వైద్యులు. చెల్లి అప్పటికే వైద్యవిద్య పూర్తిచేసింది. అయినా కాపాడుకోలేకపోయాం. నాన్న పరిస్థితిని ముందుగానే కనిపెట్టి ఉంటే ఆయన మాకు దూరమయ్యేవారు కాదు అనిపించింది. అప్పుడే థర్మల్‌ కెమెరా ద్వారా మధుమేహం, హృద్రోగాల్ని ముందే కనిపెట్టడంపై బయోమెడికల్‌ ఇంజినీర్‌, శాస్త్రవేత్త జయంతి రాసిన జర్నల్‌ చదివాను. ఆమెను సంప్రదించాం. ముగ్గురం కలిసి అప్పటివరకు అందుబాటులోకొచ్చిన సాంకేతికతలను విశ్లేషించాం. డేటా అనలిస్ట్‌ అనుభవం, సెన్సార్స్‌, సిగ్నల్‌ అనాలిసిస్‌పై నాకున్న అవగాహన ఇందుకు సాయపడ్డాయి. ఏడాది పరిశోధన చేసి 2019లో ‘ఆర్కా రిసెర్చ్‌’ ప్రారంభించాం.

నిమిషం చాలు..

థర్మల్‌ కెమెరాకి మేం రూపొందించిన ‘ఐరా (ఇంటెలిజెంట్‌ హెల్త్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌)’ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాం. 200 మందికి రక్త, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించి, మరోపక్క మా పరికరంతోనూ పరీక్షించాం. పరిశోధన విజయవంతమైంది. కెమెరా ముందు ముఖాన్ని నిమిషంపాటు ఉంచితే చాలు. 5 నిమిషాల్లో మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌, హార్ట్‌స్ట్రోక్‌ వంటి వ్యాధులొచ్చే అవకాశాలు, వాటి ఉనికి గుర్తిస్తుంది. మా టెక్నాలజీ సెకనుకు 30 చొప్పున నిమిషానికి 1800 ఫొటోలు తీస్తుంది. వీటిద్వారా నుదురుపై మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు, వాటిలో రక్తప్రసరణ వేగం, మొదలైన వాటిని సిగ్నల్స్‌ ద్వారా పరిశీలించి ముందస్తుగానే అనారోగ్య ప్రమాదాలను కనిపెట్టొచ్చు. ‘ఐరా’పై అయిదు పేటెంట్‌లూ తీసుకున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిపి పైలట్‌ ప్రోగ్రాం చేశాం. ప్రస్తుతం ఏఐ సైంటిస్ట్‌ సమీర్‌తో కలిసి హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరుల్లోని వేల ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, జిమ్‌ల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. త్వరలో విదేశాలకూ ఈ స్క్రీనింగ్‌ సౌకర్యాన్ని అందించనున్నాం. కొవిడ్‌లో పరిశోధన కష్టమైంది. కొంతమంది నుదురు చూసి చెప్పేయడానికి ఇదేమైనా జాతకమా అంటూ విమర్శించారు. ఎన్ని ఇబ్బందులెదురైనా నాన్నలా మరెవరికీ కాకూడదన్న లక్ష్యమే నడిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్