ట్యూషన్‌ టీచర్‌.. వంద కోట్ల వ్యాపారం!

వ్యాపారం చేయాలి.. చేసేదేదైనా సమాజంపై సానుకూల ప్రభావం చూపాలన్నది ఆమె కోరిక. ఖర్చులకు సంపాదించుకోవచ్చు, పిల్లలకు సాయం చేసినట్టూ అవుతుందని ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. అది కాస్తా వ్యాపారమైంది. అలా అలా ఒక్కోటీ ప్రయత్నించుకుంటూ వెళ్లడమే కాదు.. విజయాలూ సాధించింది. ఇతర స్టార్టప్‌లకూ పెట్టుబడి అందిస్తోంది త్రినాదాస్‌. ఆమె ప్రయాణమిది!

Updated : 24 Mar 2023 07:26 IST

వ్యాపారం చేయాలి.. చేసేదేదైనా సమాజంపై సానుకూల ప్రభావం చూపాలన్నది ఆమె కోరిక. ఖర్చులకు సంపాదించుకోవచ్చు, పిల్లలకు సాయం చేసినట్టూ అవుతుందని ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. అది కాస్తా వ్యాపారమైంది. అలా అలా ఒక్కోటీ ప్రయత్నించుకుంటూ వెళ్లడమే కాదు.. విజయాలూ సాధించింది. ఇతర స్టార్టప్‌లకూ పెట్టుబడి అందిస్తోంది త్రినాదాస్‌. ఆమె ప్రయాణమిది!

మాజానికి సాయపడాలన్నది నాన్నని చూసే నేర్చుకున్నానంటుంది త్రినా. ఈమెది కోల్‌కతా. తండ్రి వ్యాపారవేత్త. ప్రతివారం దగ్గర్లోని పల్లెల్లో క్యాంప్‌లు నిర్వహించి, విద్య, వైద్య సేవలందించేవారు. త్రినా ఆయనతోపాటు వెళ్లి, వీలైనంత సాయం చేసేది. ఓసారిలాగే దగ్గర్లోని హల్దియా అనే గ్రామానికి వెళ్లింది. అక్కడి ఇంటర్‌ పిల్లలు ట్యూషన్‌ చెప్పమని కోరారు. అప్పటికి ఆమె బీటెక్‌ చదువుతోంది. తన ఖర్చులకూ వస్తాయని కొంత మొత్తం తీసుకొని వారాంతాల్లో వచ్చి చెప్పేది. కొద్ది రోజుల్లోనే విద్యార్థుల్లో  మార్పు కనిపించడంతో సంఖ్య పెరిగింది. దీంతో ‘బి-జీనియస్‌’ ప్రారంభించి ట్యూషన్లు కొనసాగించింది. ఏడాదిలోనే 1800 మంది విద్యార్థులయ్యారు. దీంతో కొందరు ఉపాధ్యాయులను నియమించుకుంది. ఇదంతా 2012లో.. అప్పుడే నెలకు రూ.8-10 లక్షలు సంపాదించిందామె. తర్వాత వేరే గ్రామాలు, పట్టణాల్లోనూ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన త్రినా మూడేళ్లలో తన సేవలను నైజీరియా, సౌత్‌ ఆఫ్రికా, నేపాల్‌ వంటి 8 దేశాలకు విస్తరించింది. 2016లో ఎబోలా వ్యాప్తి సమయంలో ఆఫ్రికా దేశాల్లో స్కూళ్లు మూతపడితే.. విద్యార్థులకు ఉచితంగా బోధన కొనసాగించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. గ్లోబల్‌ స్టూడెంట్‌ ఆంత్రప్రెన్యూర్‌ సహా ఎన్నో పురస్కారాలు అందుకుంది.

ఒబామా మెప్పు!

హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసింది త్రినా. 2017లో విద్యావిధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని టీచింగ్‌ విత్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (టీఏఐ) ప్రారంభించింది. దీని ద్వారా కష్టమైన కాన్సెప్టులే కాదు ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, రీజనింగ్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌ వంటి ఎన్నో నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేది. ఇక్కడ పాఠాలు చెప్పడానికి హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, ఐఐటీ వంటి ప్రముఖ విద్యాలయాల్లో చదివిన వారిని ఆహ్వానించింది. దాంతో ఈ సంస్థకు బాగా ఆదరణ పెరిగింది. లక్షల మంది విద్యార్థులను సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 130 సెంటర్లను తెరిచి బరాక్‌ ఒబామా నుంచి మెప్పునే కాదు.. గ్రాంట్‌నీ అందుకుంది. అదే సమయంలో త్రినా స్నేహితులతో కలిసి ‘టాలెంట్‌ ల్యాబ్స్‌’ ప్రారంభించింది. ఇదో హెచ్‌ఆర్‌ సంస్థ. రంగంతో సంబంధం లేకుండా మేనేజర్‌ నుంచి టెక్నీషియన్‌ వరకు ఉద్యోగులను అందించడం వీరి పని. ఏడాదిలోనే రూ. 20 కోట్ల టర్నోవర్‌ అందుకుందీ సంస్థ.

సేవలు అందిస్తూ..

కరోనా సమయంలో సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్‌ బాయ్స్‌ వంటి చిన్న ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం అవ్వడం గమనించింది త్రినా. దీంతో దృష్టి మొత్తం వీరిపైకే మళ్లించింది. ఎందరికో తిరిగి ఉపాధి కల్పించగలిగింది. అయితే 2022లో వీళ్ల పనికి విలువ ఇవ్వకపోవడం, తక్కువ మొత్తం చెల్లించడం గమనించిందీమె. దీంతో ఉద్యోగుల సరఫరా కాకుండా సంస్థలకు వారి సేవలను మాత్రమే అందించే ‘గిగ్‌చెయిన్‌’ ప్రారంభించింది. ఇప్పుడా సంస్థ విలువ రూ.102 కోట్లకు పైమాటే! త్రినా వయసు 32. ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు దక్కించుకున్న ఈమె.. స్టార్టప్‌లకు పెట్టుబడి సాయాన్నీ అందిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్