ఆటోలో... బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కి!

అది లండన్‌లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌! బ్రిటీష్‌ రాజవంశీయుల అధికార దర్పానికి ప్రతీకగా, రాచరిక పాలనకు గుర్తుగా, చక్రవర్తి పరిపాలనా భవనంగా దానికి పేరు. అలాంటి చోటుకి సామాన్యులే కాదు, సంపన్నులు వెళ్లాలన్నా బోలెడు ఆంక్షలు. కానీ, ఉత్తర్‌ ప్రదేశ్‌లో బహరాయిచ్‌ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన పద్దెనిమిదేళ్ల ఆర్తి మాత్రం అక్కడికి ఆటోలో దూసుకొచ్చింది.

Published : 25 May 2024 04:18 IST

అది లండన్‌లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌! బ్రిటీష్‌ రాజవంశీయుల అధికార దర్పానికి ప్రతీకగా, రాచరిక పాలనకు గుర్తుగా, చక్రవర్తి పరిపాలనా భవనంగా దానికి పేరు. అలాంటి చోటుకి సామాన్యులే కాదు, సంపన్నులు వెళ్లాలన్నా బోలెడు ఆంక్షలు. కానీ, ఉత్తర్‌ ప్రదేశ్‌లో బహరాయిచ్‌ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన పద్దెనిమిదేళ్ల ఆర్తి మాత్రం అక్కడికి ఆటోలో దూసుకొచ్చింది. అక్కడున్నవారంతా తనని ఆశ్చర్యంగా చూశారు. కలిసి ఫొటోలు దిగడానికి ఉత్సాహపడ్డారు. ఇక ప్రిన్స్‌ ఛార్లెస్‌ అయితే ఆమెను స్వాగతించడమే కాదు... ఆటో ముందు నిలబడి మరీ ఆ అమ్మాయితో ఫొటో దిగారు. ఇదంతా ఎలా సాధ్యం, తనెవరు అనేగా మీ సందేహం.

ఆ యువతి పేరు ఆర్తి. తనది యూపీ. చిన్న వయసులోనే పెళ్లయ్యింది. కొన్నాళ్లకే ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులూ తనని కష్టాల్లోకి నెట్టేశాయి. అలాంటి సమయంలో ఆగాఖాన్‌ట్రస్ట్‌ లండన్‌కి చెందిన ప్రిన్స్‌ట్రస్ట్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి  ‘ప్రాజెక్ట్‌ లెహర్‌’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. నిరుపేద, ఒంటరి తల్లుల సంక్షేమం కోసం స్థానిక ప్రభుత్వ సంస్థల సాయంతో పింక్‌ ఇ-రిక్షాలను అందించి స్వశక్తి మార్గాన్ని చూపించడమే దీని లక్ష్యం. అలా ఆర్తి బహరాయిచ్‌ జిల్లా యంత్రాంగం నుంచి ఓ ఆటో తీసుకుని నడపడం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం నిర్వహణ వెనుక ఎన్జీవోల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆర్తి తన కాళ్లపై తాను నిలబడటమే కాదు... కష్టాల్లో ఉన్న ఆడవారికి అండగానూ నిలిచేది. ఈ కృషికి గుర్తింపుగానే ప్రపంచ ప్రఖ్యాత మానవ హక్కుల న్యాయవాది ‘అమల్‌ క్లూనీ’ పేరిట ప్రిన్స్‌ ట్రస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఇచ్చే ఎంపవర్‌మెంట్‌ అవార్డు ఆర్తిని వరించింది. దీన్ని తీసుకోవడానికే ఆమె లండన్‌ వచ్చింది మరి. ‘పింక్‌ రిక్షా నడపడం నా కలల్నే కాదు...ఐదేళ్ల నా కూతురి ఆశల్నీ తీరుస్తోంది. పైగా పర్యావరణహితం, మహిళల భద్రతకు సాయపడే వాహనం కావడం వల్లే ఇదంటే నాకెంతో ఇష్టం. నేను లండన్‌ రావడం, కింగ్‌ ఛార్లెస్‌ని కలుసుకోగలగడం అంతా కలలా అనిపిస్తోంది. ఈ అవార్డు అందించిన స్ఫూర్తి మరెంతో మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగిస్తా. నేను మొదటిసారి లండన్‌ వచ్చా. భవిష్యత్తులో వస్తానో, రానో తెలియదు అందుకే నా కూతురికి ఓ జత చెప్పులు తీసుకోవాలనుకుంటున్నా’ అంటోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్