అమ్మ కోరికను అలా నెరవేర్చేస్తున్నారు!

భారతీయ సంప్రదాయంలో పూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందుకోసం తాజా పువ్వులనే ఉపయోగిస్తుంటారు. అలాగే పండగలు, పర్వదినాల సందర్భంలో పువ్వులను విరివిగా ఉపయోగించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే- 'పూజకు పూలు ఎప్పుడు ఆలస్యంగ....

Updated : 14 May 2022 17:36 IST

(Photos: Instagram)

భారతీయ సంప్రదాయంలో పూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందుకోసం తాజా పువ్వులనే ఉపయోగిస్తుంటారు. అలాగే పండగలు, పర్వదినాల సందర్భంలో పువ్వులను విరివిగా ఉపయోగించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే- 'పూజకు పూలు ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంటాయి. అందులోనూ  వాడిపోయినవే ఎక్కువగా ఉంటాయి’ అంటూ ఓ తల్లి బాధపడుతుంటే-  ఆ సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అందుకోసం ఏకంగా ఓ అంకుర సంస్థను నెలకొల్పేశారు!

ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన దగ్గర్నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌కి విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది. దాంతో వ్యాపారుల ఆలోచనలు కూడా దీనికి తగ్గట్టే సాగుతున్నాయి. అందుకు తగ్గట్టే యువత కూడా తమ వినూత్న ఆలోచనలకు టెక్నాలజీని జోడించి కొత్త కొత్త అంకుర సంస్థలకు ప్రాణం పోస్తున్నారు. తద్వారా మంచి విజయాలను అందుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు  కూడా ఈ కోవలోకే వస్తారు. తమదైన వినూత్న ఆలోచనలతో ‘హూవు ఫ్రెష్‌’ అనే అంకుర సంస్థను స్థాపించి ముందుకు దూసుకుపోతున్నారు.

బెంగళూరుకు చెందిన యశోద, రియా అక్కాచెల్లెళ్లు. వీళ్లు మూడేళ్ల క్రితం ‘హూవు ఫ్రెష్’ అనే అంకుర సంస్థను స్థాపించారు. దీని ద్వారా దేశంలోని కొన్ని నగరాల్లో పూజకు కావాల్సిన తాజా పూలను డోర్‌ డెలివరీ చేస్తున్నారు. వాటితో పాటు పూజకు వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. మరి వీళ్ల ప్రస్థానం గురించి తెలుసుకుందామా...

అమ్మ సమస్యతో అంకురం!

కన్నడలో ‘హూవు’ అంటే పువ్వు అని అర్థం. ఈ క్రమంలో తమ వ్యాపార ఆలోచనకు మూల కారణం మా అమ్మే అంటున్నారీ సిస్టర్స్. మా అమ్మ పూజ చేసేటప్పుడు- ‘ఈ పూలు ఎప్పుడు ఆలస్యంగా వస్తుంటాయి. అందులో వాడిపోయినవే ఎక్కువగా ఉంటాయి’ అని అంటుండేది. అందులో వాస్తవం లేకపోలేదు. మన దేశంలో ఫ్లవర్‌ బొకే వ్యాపారం రోజురోజుకీ విస్తరిస్తోన్నా.. దానికంటే నాలుగు రెట్లు పెద్దదైన సంప్రదాయ పువ్వుల వ్యాపారం మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 40 శాతం పువ్వులు వినియోగదారులకు చేరకముందే వ్యర్థాలుగా మారుతున్నాయి. ఈ విషయం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది..’ అని చెబుతున్నారు. భారతీయ సంప్రదాయంలో పూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందుకోసం తాజా పువ్వులనే ఉపయోగిస్తుంటారు. అలాగే పండగలు, పర్వదినాల సందర్భంలో పువ్వులను విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి పువ్వులను వినియోగదారులకు తాజాగా ఇవ్వాలనే సంకల్పంతోనే ‘హూవు ఫ్రెష్’ని ప్రారంభించామంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.

నాన్న స్ఫూర్తితో..

తమ వ్యాపారానికి అమ్మ ఆలోచన ఎలా ఉపయోగపడిందో నాన్న నుంచి అంతే స్ఫూర్తిని పొందామంటున్నారు. ‘మా నాన్న 1994లో గులాబీ సాగును ప్రారంభించారు. అప్పటికి ఈ రంగంలో ఎవరూ లేరు. మనం దేశంతో పాటు ఇథియోపియా, కెన్యాలలో గులాబీ సేద్యం చేశారు. ఈ క్రమంలో గులాబీ సాగు, దిగుబడి, సీజన్లు, వేలానికి సంబంధించిన రేట్లు, సరకు రవాణా ధరలు.. వంటి వాటి గురించి మేము తరచుగా వినేవాళ్లం. అదే క్రమంలో గులాబీ పూల మార్కెట్ క్రమంగా ఎలా విస్తరించిందో మేం దగ్గర్నుంచి చూశాం. అలా నాన్నగారు కూడా మా ఆలోచన రూపుదిద్దుకోవడానికి స్ఫూర్తిగా నిలిచారు.

తాజాదనం కోసం..

సాధారణంగా పంట నుంచి పూలు కోసిన తర్వాత వినియోగదారుడికి చేరడానికి 36 నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎంతోమంది చేతులు మారుతుంటాయి. వినియోగదారుడికి చేరే సమయానికి అందులో కొన్ని వాడిపోతుంటాయి. ఈ క్రమంలో దాదాపు 40 శాతం పువ్వులు వినియోగదారుడికి చేరకముందే వ్యర్థాలుగా మారుతున్నాయి. ‘హూవు ఫ్రెష్’ ద్వారా వీళ్లు ఈ సమయాన్ని తగ్గించాలనుకున్నారు. ఇందుకోసం పూల సాగులో వారికున్న అనుభవాన్ని ఉపయోగించుకుని రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో- పూలు కోసిన తర్వాత వినియోగదారుడికి చేరే సమయాన్ని 12 నుంచి 24 గంటలకు తగ్గించగలుగుతున్నామని చెబుతున్నారు. అలాగే ప్యాకేజింగ్‌లో కొత్త పద్ధతులను ఉపయోగించి పూలు తాజాగా ఉండే సమయాన్ని రెండు నుంచి ఐదు రెట్లకు పెంచగలుగుతున్నామని చెబుతున్నారు.

‘పూజకు వినియోగించే పూలు తాజాగా ఉండాలనేది మా అకాంక్ష. అందుకు తగ్గట్టే... పూలను పూర్తిగా శుభ్రపరిచి అందులో బ్యాక్టీరియా, తేమ లేకుండా చూస్తాం. అలాగే ప్రత్యేకమైన గ్యాస్‌ను ఉపయోగించి పూల జీవితకాలాన్ని రెండు రోజుల నుంచి 15 రోజుల వరకు పెరిగేలా చేస్తున్నాం’ అని చెబుతోంది రియా.

‘హూవు ఫ్రెష్’ ద్వారా గతేడాది నుంచి అగరబత్తీలనూ ఉత్పత్తి చేస్తున్నారు. దీని తయారీ కోసం పూజకు వినియోగించిన పూలను ఉపయోగించడం విశేషం. ఇందులో ఎలాంటి కెమికల్స్‌, చార్‌కోల్‌ ఉండవు. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. అయితే భారతదేశంలోని మరో ఆరు నగరాల్లో (హైదరాబాద్‌, ముంబయి, పుణే, మైసూర్‌, చెన్నై, దిల్లీ) ఈ సంస్థ సేవలను విస్తరించారు. అలాగే బిగ్‌ బాస్కెట్, సూపర్‌ డైలీ, గ్రోఫర్స్‌, ఫ్రెష్‌ టు హోమ్‌.. వంటి ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులకు తాజా పూలు అందిస్తున్నారు. కేవలం 10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి నెలకు దాదాపు 1.5 లక్షల ఆర్డర్లను అందుకుంటోంది.

యశోద, సీఈవో

యశోద తన డిగ్రీ, మాస్టర్స్‌ రెండూ సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీలో పూర్తి చేసింది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ, అకౌంటింగ్‌లో మాస్టర్స్‌ చేసింది. చదువు పూర్తైన తర్వాత తండ్రి స్థాపించిన సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేసింది. ఈ సంస్థలో యశోద విదేశీ వ్యవహారాలను చూసుకునేది. ఈ క్రమంలో ఇథియోపియా వ్యాపార రంగంలో ఉన్న టెక్నికల్‌ సమస్యలను అధిగమించేందుకు మెషీన్లను అద్దెకు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. తద్వారా మంచి ఫలితాలను సాధించింది.

రియా, సీటీవో

రియా.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందింది. ఇందులో కమ్యూనికేషన్స్‌, మీడియాలోనూ ప్రావీణ్యం పొందింది. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో టీచింగ్‌ అసిస్టెంట్‌గా పని చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్