World Cup: ‘మాట’లతో మాయ చేస్తున్నారు!

క్రికెట్‌ పండగ మొదలైంది. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మైదానాన్ని కవర్‌ చేసే కెమెరా కళ్లు.. మధ్యమధ్యలో కొందరు ముద్దుగుమ్మల వైపు మళ్లుతుంటాయి.. వాళ్లేం మాట్లాడతారా అని చెవులు రిక్కిస్తాయి. వారి మాటల ప్రవాహానికి, వాక్చాతుర్యానికి కెమెరానే కాదు.. ప్రేక్షకులూ మైమరచిపోతారంటే అతిశయోక్తి కాదు.

Published : 07 Oct 2023 12:00 IST

(Photos: Instagram)

క్రికెట్‌ పండగ మొదలైంది. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మైదానాన్ని కవర్‌ చేసే కెమెరా కళ్లు.. మధ్యమధ్యలో కొందరు ముద్దుగుమ్మల వైపు మళ్లుతుంటాయి.. వాళ్లేం మాట్లాడతారా అని చెవులు రిక్కిస్తాయి. వారి మాటల ప్రవాహానికి, వాక్చాతుర్యానికి కెమెరానే కాదు.. ప్రేక్షకులూ మైమరచిపోతారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అందమైన స్పోర్ట్స్‌ ప్రజెంటర్స్‌/కామెంటేటర్స్‌ ఈసారి ప్రపంచకప్‌లో బోలెడంత మంది సందడి చేసేస్తున్నారు. అందం, ఆకట్టుకునే ఆహార్యం, అంతకు మించిన వాక్పటిమతో క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు, మధ్యలో, ఆట ముగిశాక, స్టూడియోలో.. ఇలా ఎక్కడ చూసినా వారే కనిపించేస్తున్నారు.


‘మాటల’ మయంతి!

మహిళా స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ అనగానే మనకు తొలుత గుర్తొచ్చే పేరు మయంతీ లాంగర్‌. దిల్లీలో పుట్టి, అమెరికాలో పెరిగిన ఆమెది ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం. అయినా చిన్నతనం నుంచి ఆటలపై మక్కువ పెంచుకుంది. ముఖ్యంగా ఫుట్‌బాల్‌ను ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఓవైపు మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తూనే.. మరోవైపు దాన్ని విశ్లేషించడానికీ ఆసక్తి చూపేది. ఈ మక్కువే ఆమెకు ‘ఫిఫా బీచ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌’లో గెస్ట్‌ యాంకర్‌గా తొలి అవకాశాన్ని అందించింది. ఇక అప్పట్నుంచి వెనుదిరిగి చూడలేదు మయంతి. పలు ఛానళ్లలో క్రీడా షోలు, టోర్నమెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, క్రీడాకారుల్ని ఇంటర్వ్యూ చేయడంతో దేశవ్యాప్తంగా పాపులరైందామె. ఇక 2010లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ‘ఫిఫా ప్రపంచకప్‌’లో వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ మహిళా యాంకర్‌గానూ గుర్తింపు సొంతం చేసుకుందీ బ్యూటిఫుల్‌ ప్రజెంటర్.

తన యాంకరింగ్తో పాటు, క్రీడల పట్ల తనకున్న లోతైన పరిజ్ఞానంతో ప్రస్తుతం ఈ రంగంలో లేడీ స్టార్‌గా దూసుకుపోతోన్న మయంతి.. ప్రపంచంలో మన మ్యాచ్‌ ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతుంటుంది. అయితే మొదట్లో మ్యాచ్‌ ప్రజెంటర్‌గా తన ఆహార్యాన్ని చూసి చాలామంది కామెంట్లు చేసేవారు. అయినా వాటికి తనదైన రీతిలో సమాధానమిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌. ‘భవిష్యత్తులో గ్రాఫిక్‌ డిజైనర్‌గా స్థిరపడాలనుకున్నా.. కానీ అదే జరిగితే ఇంత గుర్తింపు వచ్చేది కాదేమో!’ అని చెప్పే మయంతి.. 2012లో క్రికెటర్‌ స్టువర్ట్‌ బన్నీని వివాహమాడింది. వీరికి 2020లో కొడుకు పుట్టాడు.


అమ్మయ్యాక నెలకే..!

పెళ్లైనా, పిల్లలు పుట్టినా.. కెరీర్‌కు మాత్రం బ్రేక్‌ వేయట్లేదు ఈతరం మహిళలు. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. 2021లో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను వివాహం చేసుకునే నాటికే మేటి క్రీడా యాంకర్‌గా పేరు తెచ్చుకుందామె. ఇక వివాహం తర్వాత ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, పాపులారిటీ మరింత పెరిగిపోయాయి. సరిగ్గా నెల క్రితం బాబుకు జన్మనిచ్చిన సంజన.. ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొనడం డౌటే అనుకున్నారంతా! కానీ వరల్డ్‌ కప్‌ కామెంట్రీకి సిద్ధమైపోయానంటూ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టిందీ మిసెస్‌ బుమ్రా.

‘ప్రపంచకప్‌లో పాల్గొనడానికి, మన జట్టుకు మద్దతివ్వడానికి నేను సిద్ధం. ఈసారి ప్రపంచకప్‌ మన దేశంలో జరగడం ఓ ప్రత్యేకత అయితే.. నాతో పాటు మరో స్పెషల్‌ గెస్ట్‌ పాల్గొంటుండడం మరో ప్రత్యేకత! తనెవరో మీరే చెప్పుకోండి చూద్దాం?’ అంటూ ఫ్యాన్స్‌కి సవాలు విసిరింది సంజన. దీంతో అందరూ ఆ స్పెషల్‌ గెస్ట్‌ తన కొడుకేనేమో అనుకుంటున్నారు. ఏదేమైనా తల్లైన నెల రోజులకే తిరిగి మైదానంలోకి అడుగుపెడుతోన్న సంజనను చాలామంది ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు మోడలింగ్‌ చేస్తూనే.. మరోవైపు స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా అవకాశాల్ని అందిపుచ్చుకున్న ఈ పుణే అమ్మాయి.. 2014లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఐపీఎల్‌తోనే ఈ ముద్దుగుమ్మకు ఎక్కువ పాపులారిటీ వచ్చిందని చెప్పచ్చు.


‘ఆర్జే’ భావన!

మయంతీ లాంగర్‌ తర్వాత దేశంలోనే పేరు మోసిన క్రీడా వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకుంది భావనా బాలకృష్ణన్. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. రేడియో జాకీగా, వీడియో జాకీగా, టీవీ యాంకర్‌గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా, డ్యాన్సర్‌గానూ చాలామందికి సుపరిచితమే! హిందీ, తమిళంలో గలగలా మాట్లాడుతూ కామెంట్రీ చెప్పే భావన.. 2019 ప్రపంచకప్‌తో పాపులరైంది. కెరీర్‌ ప్రారంభంలో పలు టీవీ షోలకు యాంకరింగ్‌ చేసిన ఆమె.. ఐపీఎల్‌, కబడ్డీ ప్రొ లీగ్‌ల్లోనూ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇక తాను పాడిన తొలి పాట ‘వీరాతి వీర’కు యూట్యూబ్‌లో ఐదు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ రమేశ్‌ను వివాహం చేసుకున్నాక ఇక్కడే స్థిరపడిందీ బ్యూటిఫుల్‌ ప్రజెంటర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్