నర్సుగా సేవలు.. జిమ్‌లో కసరత్తులు.. అందుకే ఇదంతా!

తమ తపననే కెరీర్‌గా ఎంచుకొని దూసుకుపోయేవారు కొందరైతే.. అటు వృత్తితో పాటు ఇటు అభిరుచికీ సమప్రాధాన్యం ఇచ్చే వారు మరికొందరు.. త్రిపురకు చెందిన పాతికేళ్ల లిపిక దేవ్‌నాథ్‌ రెండో కోవకు చెందుతుంది. నర్సుగా ఓవైపు ప్రభుత్వోద్యోగం సంపాదించినా ఆమెకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలోనే తనకెంతో.....

Published : 12 May 2022 16:59 IST

తమ తపననే కెరీర్‌గా ఎంచుకొని దూసుకుపోయేవారు కొందరైతే.. అటు వృత్తితో పాటు ఇటు అభిరుచికీ సమప్రాధాన్యం ఇచ్చే వారు మరికొందరు.. త్రిపురకు చెందిన పాతికేళ్ల లిపిక దేవ్‌నాథ్‌ రెండో కోవకు చెందుతుంది. నర్సుగా ఓవైపు ప్రభుత్వోద్యోగం సంపాదించినా ఆమెకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలోనే తనకెంతో ఇష్టమైన బాడీ బిల్డింగ్‌పై దృష్టి సారించింది. ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు జిమ్‌లో కసరత్తులు చేస్తూ తన దేహదారుఢ్యాన్ని పెంచుకుంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం మిస్‌ ఒలింపియా పోటీల్లో పాల్గొనడమే తన ముందున్న లక్ష్యమంటోన్న లిపిక.. తన వృత్తిప్రవృత్తుల్ని ఎలా బ్యాలన్స్‌ చేస్తోందో తెలుసుకుందాం రండి..

లిపిక దేవ్‌నాథ్‌.. త్రిపుర ధలాయ్‌ జిల్లాలోని సలేమా గ్రామం ఆమె సొంతూరు. చిన్నతనం నుంచి కష్టపడే తత్వం ఆమెది. ఈ క్రమంలోనే చదువులో చక్కటి ప్రతిభ కనబరిచేది. ఆ తర్వాత పశ్చిమ బంగ మాల్డాలోని చంచల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా ప్రభుత్వోద్యోగం సంపాదించింది. దీంతో ప్రస్తుతం మాల్డాలోనే నివాసముంటోంది లిపిక.

రోజూ 150 కిలోమీటర్ల ప్రయాణం!

లిపికకు చిన్న వయసు నుంచే వ్యాయామమంటే చాలా ఇష్టం. ఈ మక్కువే ఆమెను దేహదారుఢ్యం పెంపొందించుకునే దిశగా ప్రోత్సహించింది. ఇందుకోసం ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టిందామె. ఈ క్రమంలోనే మాల్డాలోని ఓ ట్రైనర్ దగ్గర శిక్షణకు చేరింది. అయితే రోజూ మాల్డా నుంచి చంచల్‌ ఆస్పత్రికి విధులకు వెళ్లడం, డ్యూటీ ముగించుకొని తిరిగి జిమ్‌కు వెళ్లడం, అక్కడ్నుంచి ఇంటికి చేరుకోవడం.. ఇలా రోజూ సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది లిపిక. అయినా ఇష్టంతో చేసే పనిలో అలుపేముంది అంటోంది.

‘నేను చేసే పని పైనే పూర్తి ఏకాగ్రత పెడతా. ఆస్పత్రి విధుల్లో ఉన్నప్పుడు ఇంకేదీ నాకు గుర్తు రాదు. అదేవిధంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పుడు బాడీ బిల్డింగ్ పైనే శ్రద్ధ పెడతా. చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నతో కలిసి జిమ్‌కు వెళ్లేదాన్ని. అలా వ్యాయామంపై క్రమంగా మక్కువ పెరిగింది. ఇక ఇప్పుడు అటు డ్యూటీని, ఇటు కసరత్తుల్ని బ్యాలన్స్‌ చేయడమూ పెద్ద కష్టమనిపించట్లేదు..’ అంటోందీ యంగ్‌ నర్సు.

ఆ కల నిజమవ్వాలని..!

ప్రస్తుతం మాల్డాలో బాడీ బిల్డింగ్‌ శిక్షణ తీసుకుంటోన్న లిపిక.. వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఇటీవలే పుణే వేదికగా జరిగిన ‘అంతర్జాతీయ మిస్టర్‌ అండ్‌ మిస్‌ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో’ పాల్గొన్న లిపిక.. ఆరో స్థానంలో నిలిచింది. ఇదే ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో ‘మిస్‌ ఒలింపియా’ పోటీలపై కన్నేసిందీ జిమ్‌ లవర్‌. ఇందులో చక్కటి ప్రతిభ కనబరిచి తన కలను నిజం చేసుకోవడంతో పాటు దేశానికి పతకం అందించాలని ఉవ్విళ్లూరుతోంది.

గుడ్‌ లక్‌ లిపిక!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్