Celebrity Fashion: అందాన్ని పెంచే ‘అజ్రఖ్’ ప్రింట్!

మొన్నామధ్య జాయ్‌ అవార్డుల్లో భాగంగా ఆలియా భట్‌ కట్టుకున్న అందమైన చీర గుర్తుందా? అదేనండీ.. అజ్రఖ్‌ ప్రింటెడ్‌ శారీ! అవును.. దాన్నెలా మర్చిపోతాం.. అంటారా? ఆ అవార్డుల వేదికపై ఆలియా అందాన్ని ద్విగుణీకృతం చేసిన ఈ ప్రింట్‌కు ఇటీవలే భౌగోళిక గుర్తింపు (GI Tag) దక్కింది....

Updated : 16 May 2024 13:18 IST

(Photos : Instagram)

మొన్నామధ్య జాయ్‌ అవార్డుల్లో భాగంగా ఆలియా భట్‌ కట్టుకున్న అందమైన చీర గుర్తుందా? అదేనండీ.. అజ్రఖ్‌ ప్రింటెడ్‌ శారీ! అవును.. దాన్నెలా మర్చిపోతాం.. అంటారా? ఆ అవార్డుల వేదికపై ఆలియా అందాన్ని ద్విగుణీకృతం చేసిన ఈ ప్రింట్‌కు ఇటీవలే భౌగోళిక గుర్తింపు (GI Tag) దక్కింది. మన దేశ ప్రాచీన కళల్లో ఒకటైన ఈ బ్లాక్‌ ప్రింటింగ్‌ ఫ్యాషన్‌ సమకాలీన హంగులద్దుకొని ఈ ఫ్యాషన్‌ ప్రపంచంలో తన హవాను కొనసాగిస్తోంది. అందుకే ఈ ప్రింట్‌తో చీరలే కాదు.. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులూ రూపొందిస్తున్నారు నేటి తరం డిజైనర్లు. అతివల్ని ఆకట్టుకుంటూనే వారి అందానికి అదనపు హంగులద్దుతోన్న ఈ ఫ్యాషన్‌ శైలి పుట్టుపూర్వోత్తరాలేంటో తెలుసుకుందాం రండి..

అక్కడ పుట్టినా..!
ప్రాచీన కళ అనగానే పాతదైపోయిందన్న భావన కలుగుతుంటుంది చాలామందికి. కానీ ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అన్నట్లుగా పాతవే కొత్త హంగులద్దుకొని ఈ ఫ్యాషన్‌ ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి.. ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్లుగా నిలిచిపోతున్నాయి. వాటిలో ‘అజ్రఖ్‌’ ప్రింట్‌ ఒకటి. క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాడు సింధులోయ నాగరికత బయటపడిన సమయంలో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్న సింధ్‌ ప్రావిన్స్‌లో తొలిసారి ఈ ప్రింట్‌కు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. సుమారు 400 ఏళ్ల క్రితం అప్పటి రాజుల చొరవతో భారత్‌కు వలస వచ్చిన కళాకారులు ఈ ఫ్యాషన్‌ కళ ఆనవాళ్లను తమ వెంటపెట్టుకొని గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో ఇక్కడే ఈ కళ మొగ్గ తొడిగింది. నాటి నుంచి నేటి వరకు మన దేశ ప్రాచీన కళల్లో ఒకటిగా వర్ధిల్లుతోంది. అందుకే ఈ కళకు పుట్టినిల్లు గుజరాతే అంటూ ‘ఇటీవలే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ’ దీనికి భౌగోళిక గుర్తింపు (GI Tag)ను అందించింది. ‘కచ్‌ అజ్రఖ్‌’గానూ ఈ కళకు పేరుంది.

నీలి రంగే ఎందుకంటే..?!
అజ్రఖ్‌ అనేది అరబిక్‌ పదం.. ఆ భాషలో దీన్ని నీలం అంటారు. అందుకే అజ్రఖ్‌ ప్రింటెడ్‌ దుస్తుల్ని పరిశీలిస్తే.. నీలి రంగే ఎక్కువగా హైలైట్‌ అవుతుంది. ఇక ఈ ప్రింటెడ్‌ ఫ్యాషన్‌లో భాగంగా.. బ్లాక్‌ ప్రింటింగ్‌ పద్ధతిలో దీన్ని దుస్తులపై ముద్రిస్తారు. ముందుగా చెక్కతో చేసిన బ్లాక్స్‌పై.. మోటిఫ్స్‌, ఫ్లోరల్‌ మోటిఫ్స్‌, జామెట్రిక్‌ ప్యాటర్న్స్‌, భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా విభిన్న డిజైన్లను చెక్కుతారు. ఈ బ్లాక్స్‌ని ఆయా రంగుల్లో ముంచుతూ దుస్తులపై ముద్రిస్తారు.. డిజైన్లను బట్టి కొన్ని వస్త్రాలపై గ్యాప్‌ వదులుతూ సమాన దూరాల్లో అచ్చు వేస్తారు. ఇది ఆరాక క్లాత్‌ను ఓసారి ఉతికి.. మరోసారి ఇదే బ్లాక్‌ ప్రింటింగ్‌ పద్ధతిలో డిజైన్లను ముద్రిస్తారు. ఇలా వివిధ రకాల డిజైన్లలో బ్లాక్‌ ప్రింట్స్‌ తయారుచేయడం మొదలు.. దుస్తులపై అజ్రఖ్‌ ప్రింటింగ్‌ పూర్తి కావడానికి సుమారు 12-14 దశలు పడుతుంది. ఇక ఈ ప్రింటింగ్‌ కలర్స్‌ని కూడా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేయడం ఈ ఫ్యాషన్‌ కళ మరో ప్రత్యేకత! ఎక్కువగా ఇండిగో/నీలం రంగులు, వాటి షేడ్స్‌ హైలైట్‌ అయ్యేలా తీర్చిదిద్దే ఈ అజ్రఖ్‌ ప్రింట్స్‌తో ప్రస్తుతం చాలా రకాల దుస్తులు ఫ్లోరల్‌ మోటిఫ్స్‌, జామెట్రిక్‌ ప్రింట్స్‌తో సమకాలీన హంగులద్దుకుంటున్నాయి.

సెలబ్రిటీల ఫ్యాషన్‌!
అవడానికి ప్రాచీన కళే అయినా.. ఈతరం ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త హంగులద్దుకుంటోంది అజ్రఖ్‌ ప్రింట్‌. అందుకే దీన్ని సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ తమ వార్డ్‌రోబ్‌లో భాగం చేసుకుంటున్నారు. అవార్డుల వేడుకలు, చిత్రోత్సవాలు, ఇతర పార్టీలకూ వారు ఎంచుకునే ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో అజ్రఖ్‌ ప్రింటెడ్‌ దుస్తులకూ ప్రాధాన్యమిస్తున్నారు.

అజ్రఖ్ శారీలో మెరిసిన ఆలియా!
ఈ క్రమంలోనే ఇటీవలే ‘జాయ్‌ అవార్డుల’ ప్రదానోత్సవానికి హాజరైన బాలీవుడ్‌ భామ ఆలియా భట్.. అజ్రఖ్‌ ప్రింటెడ్‌ శారీలోనే మెరిసిపోయింది. ఎరుపు, బ్లూ, బ్లాక్‌ షేడెడ్‌ ప్రింట్స్‌లో హంగులద్దిన అజ్రఖ్‌ ప్రింటెడ్‌ శాటిన్‌ శారీని ఈ వేడుక కోసం ఎంచుకుంది ఆలియా. ఇక దీనిపై గోల్డ్‌ సీక్విన్‌ ఎంబ్రాయిడరీ చేయడంతో చీర మరింత హైలైట్‌ అయిందని చెప్పచ్చు. ఇలా తన చీర పైకి ఇదే ప్రింటెడ్‌ ట్యూబ్‌ టాప్‌ను ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇదే ప్రింటెడ్‌ లాంగ్‌ కేప్‌ను చీరకు జత చేసింది. వదులైన హెయిర్‌స్టైల్‌, తక్కువ మేకప్‌తో మెరుపులు మెరిపించిన ఆలియా లుక్‌కి ఫ్యాషన్‌ ప్రియులే కాదు.. డిజైనర్లూ ఫిదా అయిపోయారు. అప్పుడు ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇలా ఆలియానే కాదు.. రష్మిక, విద్యాబాలన్‌, కృతీ సనన్‌, సమంత.. తదితర ముద్దుగుమ్మలు కూడా ఆయా సందర్భాల్లో అజ్రఖ్‌ ప్రింటెడ్‌ దుస్తుల్లో మెరిసిపోయారు.

మోడ్రన్‌గానూ మెరిసిపోవచ్చు!
సెలబ్రిటీల ఫేవరెట్‌ ఫ్యాషన్‌గా మారిన అజ్రఖ్‌ ప్రింటెడ్‌ ఫ్యాషన్‌లో ప్రస్తుతం చీరలే కాదు.. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులూ రూపుదిద్దుకుంటున్నాయి. పలాజో-క్రాప్‌టాప్‌ సెట్‌, కేప్స్‌, కుర్తా సెట్స్‌, మోడ్రన్‌ బ్లౌజులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అజ్రఖ్‌ ప్రింట్స్‌తో ప్రతి ఫ్యాషన్‌ అదనపు హంగులద్దుకుంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇలా ఎంచుకున్న అజ్రఖ్‌ ఫ్యాషన్స్‌పై ముదురు రంగుల్లో రూపొందించిన జాకెట్‌, షాల్, కార్డిగాన్‌.. వంటివి జత చేస్తే లుక్‌ మరింత ఇనుమడిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక వీటికి జతగా ధరించే యాక్సెసరీస్‌ని కూడా మోడ్రన్‌గా ఎంచుకున్నప్పుడు మరింత అందంగా మెరిసిపోవచ్చంటున్నారు. తక్కువ మేకప్‌, సిల్వర్‌/యాంటిక్‌ జ్యుయలరీని అజ్రఖ్‌ ప్రింటెడ్‌ దుస్తులకు జతగా ధరిస్తే.. సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్