Updated : 18/02/2023 04:56 IST

సృజన.. వ్యాపారమైంది!

ఇంటర్‌ పూర్తవగానే పెళ్లి. ఇంటికే పరిమితం అవ్వడం నచ్చలేదావిడకి. ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడు మనసు కేకుల తయారీవైపు మళ్లింది. సొంత ప్రయోగాలతో వినియోగదారులను ఆకట్టుకోవడమే కాదు.. ఇతరులకీ నేర్పే స్థాయికీ ఎదిగారు.. భావన రెడ్డి!

భావనది శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు. ఇంటర్‌ పూర్తవగానే పెళ్లై వైజాగ్‌ వెళ్లారు. లాక్‌డౌన్‌లో సరదాగా కేకులు చేయడం ప్రయత్నించారు. అపార్ట్‌మెంట్‌, చుట్టుపక్కల వారికి విక్రయిస్తూ వచ్చారు. ఇంట్లోనే తయారీ, రసాయనాలు వాడకపోతుండటంతో ఆదరణ పెరిగింది. ఇంతలో భర్త విష్ణువర్ధన్‌రెడ్డికి నెల్లూరుకు బదిలీ అయ్యింది. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బేక్‌ మై కేక్‌ నెల్లూరు’ పేరుతో ఖాతా తెరిచారు. తను తయారు చేసిన కేకుల ఫొటోలు అందులో ఉంచడం ప్రారంభించారు. దీంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు మొదలయ్యాయి. రెండేళ్లుగా ఎవరి సాయమూ లేకుండా ఆర్డర్లన్నీ ఆవిడొక్కరే పూర్తి చేస్తున్నారు. తన ప్రత్యేకత చాటాలనుకొని కొత్తరకం కేకుల తయారీ, వాటిని తీర్చిదిద్దడంపై సొంతంగా ఎన్నో ప్రయోగాలు చేసి, కస్టమర్లను సంపాదించుకున్నారు. పిల్లల కోసం బొమ్మల కేకులు, వేడుకలకు తగ్గట్టు భిన్న రకాలూ తయారు చేస్తున్నారు. సొంతంగా ఎదుగుతోన్న ఆవిడ మరింత మంది ఆడవాళ్లని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనుకున్నారు. ఆసక్తి ఉన్నవారికి ఆన్‌లైన్‌లో శిక్షణా ఇస్తున్నారు. ఆమె పనితనానికి ఫిదా అయిన కొందరు కెనడా, అమెరికా దేశాలకూ తెప్పించుకున్నారు. ఈమధ్యే పార్టీలకు వేదికలు సిద్ధం చేయడం ప్రారంభించారు. చిన్నచిన్న వేడుకలకు ఆర్డర్‌పై అలంకరణ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందినీ ఏర్పాటు చేసుకున్నారు.

- షేక్‌ మంజూరు, నెల్లూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి