Josephine Michaluk: రక్తదానంలో రికార్డులకెక్కింది!

రక్తదానం..ఇది ఎంత పవిత్రమైనదో అంత గొప్పది కూడా. మనలో చాలామంది ఎన్నోసార్లు రక్తదానం చేశామనిగర్వంగా చెప్పుకొంటారు. కానీ ఓ బామ్మ మాత్రం తన జీవితకాలమంతా రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలిపారు.

Updated : 31 Mar 2023 04:41 IST

రక్తదానం..ఇది ఎంత పవిత్రమైనదో అంత గొప్పది కూడా. మనలో చాలామంది ఎన్నోసార్లు రక్తదానం చేశామని గర్వంగా చెప్పుకొంటారు. కానీ ఓ బామ్మ మాత్రం తన జీవితకాలమంతా రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలిపారు. ఆమే కెనడాకు చెందిన జోసఫిన్‌ మిచలుక్‌. తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డునూ సాధించిన ఈ బామ్మ విశేషాలేంటో తెలుసుకుందామా!

తనకు 22 ఏళ్లు ఉన్నప్పటి నుంచి రక్తదానం చేయటం మొదలుపెట్టారు జోసఫిన్‌. ఈమెకు నలుగురు పిల్లలు. అందరూ ఆడపిల్లలే. గర్భంతో ఉన్నప్పుడు, ఆ తరువాత ఏడాది రక్తమివ్వకూడదు. అలా నలుగురు పిల్లలకూ జన్మనిచ్చేక్రమంలో సుమారు ఎనిమిదేళ్లు రక్తదానం చేయలేదు. మధ్యలో ఆమె కొన్ని రకాల సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. థైరాయిడ్‌ సమస్యతో మరో మూడేళ్లపాటు రక్తదానానికి దూరమయ్యారు. ఇప్పుడు ఈమె వయసు 76 ఏళ్లు. ఈ ఆరు దశాబ్దాల్లో ఈమె ఏకంగా 203 యూనిట్లు (96,019 లీటర్ల ) రక్తాన్ని దానం చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 30న 203వ సారి రక్తదానం చేసి ఈ ఘనత సాధించారు.

అక్క ఇచ్చిన స్ఫూర్తితో..

‘తొలిసారి నా సోదరి కల్గరీతో కలిసి రక్త దానం చేయటానికి వెళ్లాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా దానం చేస్తూనే ఉన్నాను. ఇతరులకు ప్రాణదానం చేస్తున్నాననే భావన నాకు ఎంతో సంతోషాన్నిచ్చేది. రక్తమున్నది ఇతరులకు ఇవ్వడానికేనని భావిస్తాను. దాన్ని అవసరమైన వాళ్లకు అందిస్తున్నా. రికార్డు వస్తుందని నేనెప్పుడూ ఈ పని చేయలేదు. గుర్తింపు కోసం అంతకన్నా కాదు. నాకు చేతనైన సాయం చేస్తున్నానంతే. దీన్ని ఇక ముందూ కొనసాగిస్తా’ అంటారు జోసఫిన్‌. తాను ఇవ్వడమే కాదు మరెందరినో రక్తదానం చేయమంటూ ప్రోత్సహిస్తుంటారు కూడా. ఈమె రక్త నమూన 0 పాజిటివ్‌. ఎక్కువ మందికి అవసరమయ్యే రక్త నమూన ఇది. ఎనిమిది పదుల వయసులోనూ రక్తదానాన్ని ఆపలేదు ఈ బామ్మ. ఇప్పటికీ ఏడాదిలో నాలుగు సార్లు రక్తదానం చేస్తున్నారు. మన దేశానికి చెందిన మధుర అశోక్‌ కుమార్‌ తన జీవిత కాలంలో మొత్తం 117 యూనిట్లు రక్తదానం చేసి నెలకొల్పిన రికార్డును జోసఫిన్‌ అధిగమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్