ఈ క్యాలీఫ్లవర్ సూప్‌తో ప్రయోజనాలెన్నో!

తేలికగా జీర్ణమయ్యే సూప్‌లను ఏ కాలంలోనైనా ఇష్టంగా లాగించేస్తుంటారు చాలామంది. చికెన్‌, మటన్‌.. వంటి వాటితో పాటు రకరకాల కూరగాయలతో తయారుచేసే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిల్లో క్యాలీఫ్లవర్‌ సూప్‌ కూడా ఒకటి. ఫైబర్‌ పుష్కలంగా ఉండే దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీవక్రియ సక్రమంగా....

Published : 22 Oct 2022 17:28 IST

తేలికగా జీర్ణమయ్యే సూప్‌లను ఏ కాలంలోనైనా ఇష్టంగా లాగించేస్తుంటారు చాలామంది. చికెన్‌, మటన్‌.. వంటి వాటితో పాటు రకరకాల కూరగాయలతో తయారుచేసే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిల్లో క్యాలీఫ్లవర్‌ సూప్‌ కూడా ఒకటి. ఫైబర్‌ పుష్కలంగా ఉండే దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. పైగా దీని తయారీకి పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ రుచికరమైన సూప్‌ తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి...

క్యాలీఫ్లవర్‌ సూప్

కావాల్సిన పదార్థాలు

⚛ క్యాలీఫ్లవర్‌ - 300 గ్రాములు

⚛ ఉల్లిపాయ - ఒకటి

⚛ వెల్లుల్లి - 10 నుంచి 12 రెబ్బలు

⚛ రెడ్ చిల్లీఫ్లేక్స్‌ - అర టీస్పూన్

⚛ ఆలివ్‌ నూనె- 2 నుంచి 3 టేబుల్‌ స్పూన్లు

⚛ వెన్న – ఒక టేబుల్‌ స్పూన్

⚛ వెజిటబుల్‌ స్టాక్ (కూరగాయలు ఉడికించిన నీరు) - 4 కప్పులు

⚛ ఛీజ్‌- పావు కప్పు

⚛ ఫ్రెష్‌ క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

⚛ ఒరెగానో ఆకు

⚛ నల్ల మిరియాల పొడి

⚛ ఉప్పు- రుచికి సరిపడినంత

తయారీ విధానం

క్యాలీఫ్లవర్‌ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, నల్ల మిరియాల పొడి, చిల్లీఫ్లేక్స్‌ను తీసుకోవాలి. వీటికి ఆలివ్‌ నూనెను కలిపి సుమారు 200 డిగ్రీల వద్ద 10-15 నిమిషాల పాటు వేయించాలి. వీటిని ఓ బౌల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు వెన్న, ఒరెగానో ఆకు, వెజిటబుల్‌ స్టాక్‌ కలిపి అయిదు నిమిషాల పాటు ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఎలక్ట్రిక్‌ బ్లెండర్‌ సహాయంతో మెల్లగా బ్లెండ్‌ చేయాలి. ఆ తర్వాత ఛీజ్‌, క్రీమ్‌ వేసి బాగా కలిసిపోయేవరకు ఉడికించాలి. చివరగా సర్వింగ్‌ బౌల్‌లోకి సూప్‌ తీసుకుని ఆలివ్ నూనె, మిగిలిపోయిన క్రీమ్‌, వేయించిన క్యాలీఫ్లవర్‌ ముక్కలు, వెల్లుల్లి, చిల్లీఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేస్తే... రుచికరమైన క్యాలీఫ్లవర్‌ సూప్‌ సిద్ధం.


ఆరోగ్య ప్రయోజనాలు

క్యాలీఫ్లవర్‌ సూప్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

⚛ శరీరంలో చెడు కొవ్వును కరిగించే లక్షణాలు క్యాలీఫ్లవర్‌లో సహజంగా ఉంటాయి.

⚛ ఇందులోని ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.

⚛ విటమిన్‌-బి, సి, కెలతో పాటు క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

⚛ ఇందులోని సల్ఫోరఫేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులను నివారిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.

⚛ దీనిలోని కొలీన్ మెదడు పనితీరుని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్