Diwali Fashion: దీపావళికి ‘సెలబ్రిటీ’ కళ.. ఇలా..!

పండగంటేనే సంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకొనే వేడుక. ఇక ఈ కళను రెట్టింపు చేయడానికి సంప్రదాయ దుస్తులు ధరించడం పరిపాటే! అయితే కేవలం దుస్తులు ఎంచుకుంటే సరిపోదు.. వీటికి నప్పే ఆభరణాల్ని జత చేసినప్పుడే లుక్‌ ఇనుమడిస్తుంది.

Updated : 11 Nov 2023 18:38 IST

(Photos: Instagram)

పండగంటేనే సంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకొనే వేడుక. ఇక ఈ కళను రెట్టింపు చేయడానికి సంప్రదాయ దుస్తులు ధరించడం పరిపాటే! అయితే కేవలం దుస్తులు ఎంచుకుంటే సరిపోదు.. వీటికి నప్పే ఆభరణాల్ని జత చేసినప్పుడే లుక్‌ ఇనుమడిస్తుంది. తరచి చూస్తే అలాంటి జ్యుయలరీ టిప్స్‌ మన సెలబ్రిటీల లుక్స్‌లోనే బోలెడన్ని దొరుకుతాయి. అవేంటో తెలుసుకొని పాటించేస్తే.. ఈ దీపావళికి ‘సెలబ్రిటీ’ టచ్‌ ఇచ్చినట్లవుతుంది.. లక్ష్మీ కళతో నిండుదనమూ ఉట్టిపడుతుంది.

దీపావళికి చీరలు, లెహెంగాలు, అనార్కలీ సూట్స్‌.. వంటి సంప్రదాయబద్ధమైన డ్రస్సింగ్‌కే ప్రాధాన్యమిస్తుంటారు మగువలు. కొంతమంది ట్రెడిషనల్‌కు కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇస్తూ ఫ్లోర్‌లెంత్‌ గౌన్లు, స్కర్ట్‌-క్రాప్‌టాప్‌, ఫ్యూజన్‌ శారీస్‌.. వంటివి ఎంచుకుంటుంటారు. అయితే ఇలాంటి దుస్తులకు కాస్త భారీ జ్యుయలరీని జోడించినప్పుడే పండగ కళ ఉట్టిపడుతుందంటున్నారు నిపుణులు.

సందర్భమేదైనా ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీని ఎంచుకునే వారు పెరిగిపోతున్నారు. పండగలు, ఫ్యాషన్‌ షోలు, పార్టీల్లోనూ.. తారలంతా ఈ తరహా ఆభరణాల్ని ధరించి మెరిసిపోతున్నారు. తమ బ్రైడల్‌ జ్యుయలరీలోనూ వీటికే ప్రాధాన్యమిచ్చే వారూ లేకపోలేదు. అయితే వీటిలోనూ అన్‌కట్‌ డైమండ్‌ జ్యుయలరీ, పోల్కీ జ్యుయలరీ, కుందన్‌ జ్యుయలరీ.. వంటి వాటికి ఆదరణ పెరుగుతోంది. ఇక ఇందులోనూ దుస్తుల రంగుకు మ్యాచయ్యే కుందన్స్‌తో డిజైన్‌ చేసినవీ దొరుకుతున్నాయి. కాబట్టి ఈ దీపావళికి ఈ తరహా నగల్ని ఎంచుకొని మెరిసిపోవచ్చు.


అమ్మాయిల నగల్లో చోకర్‌ది ప్రత్యేక స్థానం. మెడను చుట్టేసే ఈ నగ అందాన్నే కాదు.. ట్రెడిషనల్‌ లుక్‌నీ అందిస్తుంది. ఇందులోనూ సింపుల్‌ చెయిన్‌ ఉండి.. ముందు భాగంలో పెండెంట్‌ ఉన్నవి, ముత్యాలు/కుందన్స్‌తో తయారుచేసినవి, రాళ్లతో హంగులద్దుకున్నవి, మెష్‌ను పోలినట్లుగా డిజైన్‌ చేసినవి.. ఇలా బోలెడన్ని డిజైన్లలో ఇవి లభ్యమవుతున్నాయి. ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌గా కనిపించాలనుకునే వారు ఎంచుకునే దుస్తులకు తగ్గట్లుగా చోకర్‌ను మ్యాచ్‌ చేసుకుంటే లుక్‌ అదిరిపోతుంది.


పండగైనా ఫ్యాన్సీ లుక్‌లో కనిపించాలనుకుంటారు కొందరమ్మాయిలు. ఇలాంటి వారు దుస్తుల్నే కాదు.. నగల్నీ ఫ్యాన్సీగా ఎంచుకోవచ్చు. ఇలాంటి దుస్తుల పైకి స్టేట్‌మెంట్‌ జ్యుయలరీ చక్కగా నప్పుతుంది. బీడ్స్‌, లెదర్‌, సముద్రపు గవ్వలు, మట్టి, క్లాత్‌, త్రెడ్‌.. ఇలా వివిధ రకాల మెటీరియల్స్‌తో రూపుదిద్దుకున్న ఈ నగల్లోనూ నెక్‌పీస్‌లు, చోకర్‌, పొడవాటి చెయిన్లు.. వంటివి దొరుకుతున్నాయి.


ఆక్సిడైజ్‌డ్‌ జ్యుయలరీ ఎలాంటి దుస్తులపైకైనా ఇట్టే నప్పేస్తుంది. రంగురంగుల రాళ్లు పొదిగినవి, ఎనామిల్‌ పెయింట్‌తో హంగులద్దినవి, అద్దాలు-ముత్యాలతో రూపొందించినవి, దేవతామూర్తుల రూపాల్లో తీర్చిదిద్దిన టెంపుల్‌ జ్యుయలరీ.. ఇలా మీ దుస్తుల్ని బట్టి వీటిని ఎంచుకుంటే సింప్లీ సూపర్బ్‌ అనిపించచ్చు.


కొంతమంది అదృష్ట రత్నాల్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారు తమ అదృష్ట రత్నంతో కూడిన నగల్ని ఎంచుకోవచ్చు. వీటిలోనూ ఈ రత్నాల్ని వివిధ ఆకృతుల్లో పెండెంట్‌ల రూపంలో తీర్చిదిద్దినవి, లేదంటే నవరత్నాలు కలిపి ఒక చెయిన్‌లా తయారుచేసినవి, అదృష్ట రత్నంతో డిజైన్‌ చేసిన నెక్లెస్‌లు/చోకర్లు.. వంటివి ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఏ రంగు డ్రస్‌ అయినా మ్యాచ్‌ కావాలనుకునే వారు నవరత్నాలతో కూడిన జ్యుయలరీ సెట్‌ను ఎంచుకోవచ్చు.


పర్యావరణ స్పృహ ఉన్న వారు.. దుస్తులు, నగల విషయాల్లోనూ ఎకో-ఫ్రెండ్లీగా ఉన్న వాటికే ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో వివిధ రకాల మెటీరియల్స్‌ని రీసైకిల్ చేసి రూపొందిస్తోన్న సస్టెయినబిలిటీ నగల్ని ఎంచుకోవచ్చు. ఇవీ సెలబ్రిటీ స్టైల్‌ని, క్లాసీ లుక్‌ని అందిస్తాయి.


మెడలో ఆభరణాలు ఉన్నా, లేకపోయినా.. చెవులకు మాత్రం భారీ ఇయర్‌ రింగ్స్‌ పెట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషనైపోయింది. చాలామంది సెలబ్రిటీలూ ఈ ట్రెండ్‌ ఫాలో అవడం మనం చూస్తున్నాం. ఈ దీపావళికి మీరూ ఇలా ట్రై చేయాలనుకుంటే.. చాంద్‌బాలీలు, జుంకాలు, షాండ్లియర్‌, హూప్స్‌.. వంటి హెవీ ఇయర్‌రింగ్స్‌ ఉండనే ఉన్నాయి. వీటితో పాటు ఇంకాస్త ట్రెడిషనల్‌ టచ్‌ ఇవ్వాలనుకునే వారు మ్యాచింగ్‌ పాపిడబిళ్లను ఎంచుకోవచ్చు.


ప్రస్తుతం జుట్టునూ అలంకరించుకునేందుకు వివిధ రకాల హెయిర్‌ జ్యుయలరీ అందుబాటులోకొచ్చింది. హెయిర్‌ పిన్స్‌, జుడా పిన్స్‌, బ్రూచ్‌ పిన్స్‌, చెయిన్స్‌, హెడ్‌బ్యాండ్స్‌, దువ్వెన తరహా హెయిర్‌ క్లిప్స్‌.. వంటివెన్నో లభిస్తున్నాయి. ఇవన్నీ జుట్టు అందాన్ని పెంచడమే కాదు.. ట్రెడిషనల్‌ లుక్‌నీ అందిస్తాయి.


ఎన్ని నగలు వేసుకున్నా గాజుల ప్రత్యేకత గాజులదే! ఈ క్రమంలో మనం ఎంచుకునే నగలకు మ్యాచయ్యేలా వీటిని సెలక్ట్‌ చేసుకోవచ్చు.. లేదంటే బ్రేస్‌లెట్‌ తరహాలో కాస్త హెవీగా ఉండే సింగిల్‌ బ్యాంగిల్‌ను ఎంచుకొని కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇవ్వచ్చు.

ఇలా సంప్రదాయ దుస్తులు.. వాటికి మ్యాచింగ్‌ నగల్ని ధరించే సరికి లుక్‌ కాస్త హెవీ అయిపోతుంది. కాబట్టి మేకప్‌ లైట్‌గా ఉండేలా చూసుకుంటే క్లాసీ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. పండగలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్